breaking news
Cases of rape
-
అత్యాచార కేసులకు ప్రత్యేక కోర్టులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న అత్యాచారాల కేసులు, మైనర్లపై లైంగిక వేధింపులను నియంత్రించేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు కేంద్ర హోంశాఖలో మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేక విభాగం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర మంత్రిమండలి ఆమోదంతో కేంద్ర హోంశాఖలో మహిళా భద్రత విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని కింద అత్యాచారాల నియంత్రణ, ఎస్సీ, ఎస్టీ మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ, మనుషుల అక్రమ రవాణాను అడ్డుకోవడం, నిర్భయ ఫండ్ మేనేజ్మెంట్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్), నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విభాగాలుంటాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కోర్టుల్లో కేంద్ర నిధులతో నియామకాలు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అత్యాచారాలు, లైంగిక వేధింపుల నియంత్రణకు ఏర్పాటు చేసే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేంద్ర నిధులతో నియామకాలు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే బాధితుల పక్షాన పోరాడేందుకు అదనపు పబ్లిక్ ప్రాస్యిక్యూటర్లను నియమించనున్నారు. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, హైకోర్టు ఆధ్వర్యంలోనే వీటి నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా అత్యాచారాల కేసుల్లో శిక్షల శాతం చాలా తక్కువగా ఉండటంతో.. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పటిష్టవంతమైన దర్యాప్తు, త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నిధులతో దేశవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లకు అత్యాధునిక ఫోరెన్సిక్ కిట్లు అందజేయాలని నిర్ణయించింది. ప్రతీ పోలీస్ అధికారికి దర్యాప్తులో పాటించాల్సిన మెళకువలపై శిక్షణ ఇవ్వనుంది. అలాగే ప్రతీ రాష్ట్రంలో ఒకటి లేదా రెండు స్పెషలైజ్డ్ ఫోరెన్సిక్ లేబొరేటరీలను ఏర్పాటు చేయనుంది. అత్యాచారాల కేసుల దర్యాప్తులో సహకరించేందుకు ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు ఎన్సీఆర్బీ, సీసీటీఎన్ఎస్ డాటాబేస్‌ను అనుసంధానించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ (పోస్కో చట్టం) 2012, ఐపీసీ 1860లోని కొన్ని సెక్షన్లను సవరించినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. -
రైళ్లలో పెరిగిన వేధింపుల కేసులు
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో మహిళలపై వేధింపుల కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. 2013లో 41 వేధింపు కేసులు నమోదుకాగా, ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 47 కేసులు నమోద య్యాయి. ముఖ్యంగా ఈ కేసులు కల్యాణ్, కుర్లా, దాదర్‌లలో ఎక్కువగా నమోదవుతున్నాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. మరో పక్క అత్యాచారానికి సంబంధించిన కేసులు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది అత్యాచార కేసులు రెండు నమోదు కాగా, గత ఏడాది ఆరు నమోద య్యాయని గణాంకాలు చెబుతున్నాయి. కాగా, నమోదు కాని వేధింపు కేసులు కూడా చాలా ఉన్నాయని ప్రయాణికుల అసోసియేషన్ పేర్కొంది. రైల్ యాత్రి సంఘ్ అధ్యక్షుడు సుభాష్ గుప్తా మాట్లాడుతూ.. స్టేషన్లలో 10 శాతం మంది మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తారని తెలిపారు. డివిజినల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్‌యూసీసీ) సభ్యుడు రాజీవ్ సంఘాల్ మాట్లాడుతూ.. వేధింపుల కేసులను రైల్వే అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను అమర్చాలని సూచించారు.