breaking news
Cancellation of election
-
వేలూరు ఎన్నికల రద్దు సబబే: మద్రాసు హైకోర్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాష్ట్రం వేలూరు లోక్‌సభ ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఎన్నికలు జరపాలంటూ అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినపుడు ఎన్నికలను రద్దు చేసే అధికారం ఈసీకి ఉందని, రాష్ట్రపతి ఆమోదం పొందినందున ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది. వేలూరు నియోజకవర్గంలో డీఎంకే నేతల ఇళ్లల్లో రూ.11.10 కోట్ల నగదు స్వాధీనం నేపథ్యంలో వేలూరు లోక్‌సభ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఈసీ ప్రకటించడం తెల్సిందే. డబ్బు పంపిణీ వల్ల తమిళనాడులో ఎన్నికలు వాయిదాపడటం ఇదే తొలిసారి కాదు. జయలలిత మరణానంతరం ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ ఆసెంబ్లీ స్థానానికి 2017లో జరగాల్సిన ఉప ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. ఆ ఏడాది డిసెంబర్లో ఆ ఉప ఎన్నిక జరిగింది. 2016 మే నెలలోనూ తంజావూరు, అరవకురుచ్చిల్లో జరగాల్సిన ఎన్నికలను ధనప్రవాహం కారణంగానే ఈసీ వాయిదా వేసింది. -
షోలాపూర్ సెంట్రల్ సిటీ ఎన్నిక రద్దుచేయాలి
సీపీఎం నేత ఆడం డిమాండ్ షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ సెంట్రల్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక రద్దు చేయాలని సీపీఎం అభ్యర్థి, మాజీ శాసన సభ్యుడు నర్సయ్య ఆడం డిమాండ్ చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నిక రద్దుచేయాలని కోరుతూ తాను త్వరలోనే ముంబై హైకోర్టులో వాజ్యం దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ సిటీ స్థానం పరిధిలో తను శివసేనకు మద్దతు ప్రకటించినట్లు ఓటర్లను నమ్మించి దుష్ర్పచారం చేశారన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వాట్సప్‌లో పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టారని ఆరోపించారు. హిందువుల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పాల్పడ్డారని తెలిపారు. కాగ్రెస్ పార్టీ నుంచి తను రూ.11 కోట్లు తీసుకుని ప్రణతి షిండేకు మద్దతు ఇచ్చినట్లుగా ఎంఐఎం వారు తనపై దుష్ర్పచారం చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు తాను ఎన్నికల అధికారి శాహుజీ పవార్, పోలీసు కమిషనర్లకు 13వ తేదీన అందజేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక చోట్లలో ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసి ఓట్లు పొందిందని ఆయన ఆరోపించారు.తన ఫిర్యాదులపై అధికారులెవరూ స్పందించనందున కోర్టును ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో అడ్వకేట్ ఎం.హెచ్.శేఖ్, నసియా శేఖ్, సిద్దప్ప కలుశెట్టి, సురేష్ పలుమారి, అశోక్ బల్లా తదితరులు పాల్గొన్నారు.