ఎవరిపని వారు చేసుకుని చూడండి!
♦ బ్యూరోక్రాట్స్‌కు ఆర్బీఐ గవర్నర్ సూచన
♦ ‘సామాన్యుని’ గురించి మరింత
♦ అవగాహన పెరుగుతుందని వ్యాఖ్య
ముంబై: బ్యూరోక్రాట్స్ తమ సహాయకుల సేవలు తీసుకోకుండా ఒకరోజు తమకుతాము తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. దీనివల్ల ‘సామాన్యుని’ గురించి మరింత అవగాహన పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బ్యూరోక్రాట్లు తమ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోడానికి సైతం ఈ చర్య దోహదపడుతుందని ఆయన అన్నారు. సెక్రటేరియట్లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన వైబీ చవాన్ స్మారక ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆర్బీఐలో బ్యూరోక్రాట్లు తమకుతాముగా కొన్ని సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఒక వ్యవస్థను ప్రారంభించాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల తమ కిందివారు కార్యకలాపాల నిర్వహణలో ఎదుర్కొనే ఇబ్బందులు...
వ్యవస్థలో ఇమిడి ఉన్న క్లిష్టత వంటి అంశాలు ఉన్నతస్థాయి అధికారులకు అర్థమవుతాయని అన్నారు. తనతోసహా చాలామంది అధికారులకు పదవీ విరమణ చేసిన తర్వాతే.. వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు అర్థం అవుతుంటాయని ఆయన పేర్కొన్నారు. సహాయకులు ఎవ్వరూ లేకపోవడమే దీనికి కారణమని విశ్లేషించారు. ఉన్నత స్థాయి అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయ డానికి నరేంద్రమోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుందన్న వార్తల నేపథ్యంలో- రాజన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
పీ2పీ లెండింగ్పై సెబీతో సంప్రదింపులు..
ఇదిలావుండగా పీర్-టూ-పీర్ (పీ2పీ) లెండింగ్ నిబంధనలు ఖరారుచేసి, సంబంధిత వర్గాల అభిప్రాయాలను కోరేముందు దీనిపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీతో సంప్రదింపులు జరుపుతామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ ఇక్కడ ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆన్లైన్ సేవల ద్వారా వ్యక్తులకు, పారిశ్రామికవేత్తలకు రుణాలు అందించే ప్రక్రియను మరింత పటిష్ట పరచడమే పీ2పీ లెండింగ్ లక్ష్యం.
పారదర్శకత మెరుగుపడ్డం, రుణ ప్రక్రియలో నెలకొనే అనవసర జాప్యం, వ్యయాల నియంత్రణ వంటి అంశాలు లక్ష్యంగా ఈ విధానంపై బ్యాంకింగ్ కసరత్తు జరుగుతోంది. ఇది అటు వినియోగదారులకు ఇటు బ్యాంకింగ్‌కు ప్రయోజనం చేకూర్చుతుందని భావిస్తున్నారు. ఈ విధానాంశాలను ప్రజల అభిప్రాయాల కోసం త్వరలో ఆర్బీఐ వెబ్సైట్లో ఉంచుతామని కూడా ఆయన పేర్కొన్నారు.