breaking news
BFS
-
కొంచెం కనికరించండి..!
ముంబై: ఆర్బీఐ నూతన గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ముంబైలో ప్రభుత్వరంగ బ్యాంకుల సారథులతో భేటీ అయ్యారు. అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఆర్బీఐ అనుసరిస్తున్న కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ), రుణ చెల్లింపుల్లో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా వర్గీకరించడమనే నిబంధనలను సడలించాలని ఈ సందర్భంగా ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులు కోరారు. అలాగే, బ్యాంకులు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై దాస్తోపాటు ఆర్బీఐకి చెందిన నలుగురు డిప్యూటీ గవర్నర్లు చర్చించారు. వీటిల్లో ద్రవ్య లభ్యత, ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం వంటి అంశాలున్నాయి. ఎస్బీఐ, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీసీఏ నిబంధనలను సరళించాలని గవర్నర్‌ను కోరినట్టు వీరు తెలిపారు. బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకోలేక, ఎన్పీఏలు భారీగా పెరిగిపోయిన ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్బీఐ పీసీఏ పరిధిలోకి తీసుకొచ్చి కఠినంగా వ్యవహరిస్తోంది. 21 ప్రభుత్వరంగ బ్యాంకులకు 11 బ్యాంకులు పీసీఏ పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వడంపై ఆంక్షలు అమలవుతున్నాయి. కాగా, నియంత్రణ సంస్థ, బ్యాంకుల మధ్య చర్చలకు వీలు కల్పించడమే ఈ సమావేశం ఉద్దేశమని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా మీడియాకు తెలిపారు. దాస్‌కు నేడే తొలి పరీక్ష! గవర్నర్‌గా తొలి బోర్డు సమావేశం నేడు న్యూఢిల్లీ: నూతన గవర్నర్ శక్తికాంత్‌దాస్ ఆధ్వర్యంలో ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం సమావేశం కాబోతుంది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియపై డైరెక్టర్ల నుంచి ప్రశ్నలు ఎదురుకానున్నాయి. నవంబరు 19న జరిగిన గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిపై సమీక్ష జరగనుంది. డీమోనిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాల కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)కు ఉపశమనం కల్పించే చర్యలు, ఆర్బీఐ విధాన నిర్ణయాల్లో సెంట్రల్ బోర్డు పాత్రపైనా చర్చ జరగనుంది. ప్రస్తుత నిర్మాణంలో, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం అవుతోంది. ప్రభుత్వ ప్రాతినిధ్యం కూడా ఉన్న బోర్డును ఆర్బీఐ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ భాగస్వామిని చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఒక్కరోజు రుణ చెల్లింపుల్లో విఫలమైనా దాన్ని ఎన్పీఏగా వర్గీకరించడం వంటి ఎన్నో కీలక అంశాల్లో ప్రస్తుతం బోర్డు జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయితే, ఆర్బీఐ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం కావాలని, ఆర్బీఐ స్వతంత్రత, స్వయంప్రతిపత్తిని కాపాడాలన్నది మాజీ గవర్నర్లు, నిపుణుల అభిప్రాయం. ఆర్బీఐ స్వతంత్రతను, విశ్వసనీయతను తాను కాపాడతానని గవర్నర్ బాధ్యతల తర్వాత దాస్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను సమయానుకూలంగా పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్పారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డుకు గవర్నర్ అధిపతిగా వ్యవహరిస్తారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, 11 ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన రెండోరోజే ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో దాస్ సమావేశం కాగా, మూడో రోజు ఆర్బీఐ బోర్డు కీలక సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వానికి ఆర్బీఐ మద్దతివ్వాలి ఏ సంస్థనూ నిర్వీర్యం చేయలేదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబై: ఆర్బీఐని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వీర్యం చేయబోదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆర్బీఐ ప్రభుత్వంలో ఒక భాగమని, అది ప్రభుత్వ ఆర్థిక విధానానికి మద్దతుగా నిలవాలని అభిప్రాయపడ్డారు. కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదాల వల్ల ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన నేపథ్యంలో మంత్రి గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉర్జిత్ పటేల్ స్థానంలో శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బ్యాంకు స్వతంత్ర సంస్థగానే పనిచేయాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలకు కూడా మద్దతు నివ్వాలన్న అభిప్రాయాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. ఏ విధంగానూ సెంట్రల్ బ్యాంకును తాము దెబ్బతీయలేదన్నారు. దేశం కోసం ఆర్థిక మంత్రి ఓ విధానాన్ని ప్రతిపాదిస్తే దానికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఆర్బీఐపై లేదా? అని గడ్కరీ ప్రశ్నించారు. ‘‘ఎక్కడైనా ఎగుడుదిగుళ్లు సహజమే. ఏ సంస్థనూ మేం నిర్వీర్యం చేయలేదు. ఆర్బీఐ నిర్వహణలో మేమేమీ రాజకీయంగా జోక్యం చేసుకోలేదు. పారదర్శకమైన, అవినీతి రహిత వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంది. వేగంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియకు తోడు, ప్రభుత్వ నిర్ణయాలకు ప్రతీ సంస్థ కట్టుబడాలి’’ అని గడ్కరీ చెప్పారు. ఒకవేళ ఆర్బీఐ పూర్తి సర్వస్వతంత్రంగా ఉండాలనుకుంటే, ఆర్థిక అనారోగ్యానికి అదే బాధ్యత వహించాలని, ఆర్థిక శాఖ కాదని చెప్పారాయన. ‘‘ఒకవైపు ఆర్థిక వ్యవస్థలో అనారోగ్యాలకు బాధ్యత మాదంటారు. దాంతో మేము నిర్ణయాలు తీసుకుంటే ఆర్బీఐ స్వతంత్రత ప్రమాదంలో పడిందంటారు’’ అని గడ్కరీ పేర్కొన్నారు. మాల్యాకు మద్దతు! వ్యాపారంలో ఎత్తు పల్లాలు ఉంటాయని, అది బ్యాంకింగ్ అయినా, బీమా అయినా తప్పిదాలు జరిగితే క్షమించి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఓ కంపెనీ వ్యాపార పరంగా గడ్డు పరిస్థితుల్లోకి వెళితే ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చాలా కాలం క్రితం మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ సికామ్ విజయ్ మాల్యాకు రుణం ఇచ్చిందని, మాల్యా దానికి 40 ఏళ్ల పాటు వడ్డీ కట్టారని చెప్పారు. ‘‘ఒక వ్యక్తి రుణానికి 40 ఏళ్లు చెల్లింపులు చేసి, ఆ తర్వాత ఏవో కారణాల వల్ల రుణ చెల్లింపులు చేయలేకపోతే అతన్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారు అని నిర్ధారించడం సరికాదన్నారు. ‘‘నీరవ్‌మోదీ లేదా విజయ్ మాల్యా మోసానికి పాల్పడితే వారిని జైలుకు పంపించాలి. కానీ, ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రతీ ఒక్కరినీ మోసగాళ్లుగా చిత్రీకరిస్తే ఆ ఆర్థిక వ్యవస్థ పురోగతి చెందలేదు’’ అని గడ్కరీ అభిప్రాయపడ్డారు. -
‘బంధన్’కు లైన్‌క్లియర్
♦ ఆర్బీఐ నుంచి పూర్తిస్థాయి లెసైన్స్ ♦ ఆగస్టు 23 నుంచి కార్యకలాపాలు ♦ దాదాపు 600 శాఖలతో ప్రారంభం ముంబై : సూక్ష్మ రుణాల సంస్థ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్) ప్రతిపాదిత బ్యాంకుకు రిజర్వ్ బ్యాంకు నుంచి పూర్తి స్థాయి లెసైన్సు లభించింది. దీంతో.. బంధన్ బ్యాంకు కార్యకలాపాలు ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. బీఎఫ్ఎస్ డెరైక్టర్ చంద్ర శేఖర్ ఘోష్ బుధవారం ఈ విషయాలు తెలిపారు. తమ కేంద్ర కార్యాలయం ఉన్న కోల్‌కతాలోనే బ్యాంకును కూడా ఆవిష్కరించనున్నట్లు ఆయన వివరించారు. ముందుగా 500-600 శాఖలతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఘోష్ తెలిపారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాలపైనా, బ్యాంకింగ్ సేవలు అంతగా అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాలపైనా ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో బీఎఫ్ఎస్కి ఉన్న 2,200 కార్యాలయాలు, 17,000 పైచిలుకు ఉద్యోగులు, 66 లక్షల పైగా కస్టమర్లు, రూ. 10,000 కోట్లకు పైగా రుణ ఖాతాలు అన్నీ కూడా తొలి రోజు నుంచే బంధన్ బ్యాంకులో భాగమవుతాయని ఘోష్ పేర్కొన్నారు. మేనేజ్మెంట్ బృందంలో 20 మంది సభ్యులు ఉంటారని, ఇతరత్రా సంస్థల నుంచి 850 మంది ఉద్యోగులను తీసుకున్నామని తెలిపారు. 2006లో కోల్‌కతాలో బంధన్ ఫైనాన్షియల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రిలయన్స్ క్యాపిటల్, టాటా సన్స్ వంటి దిగ్గజాలు పోటీపడినప్పటికీ.. ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐడీఎఫ్‌సీతో పాటు బంధన్ బ్యాంకుకు గతేడాది ఏప్రిల్‌లో ఆర్బీఐ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది. చిన్న మొత్తాల్లో రుణాలు.. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన తొలి రోజు నుంచే చిన్న మొత్తాల్లో రుణాల మంజూరీ కూడా ఉండగలదని ఘోష్ వివరించారు. దాదాపు రూ. 10 లక్షల దాకా గృహ, వాహన రుణాలను ఇచ్చే అవకాశాలున్నాయని తెలి పారు. ప్రస్తుతం సూక్ష్మ రుణాల సంస్థగా 22.4 శాతం వడ్డీ రేటు విధిస్తుండగా, బ్యాం కుగా మారిన తర్వాత ఈ రేటు తగ్గుతుందని ఆయన చెప్పారు. ఇదంతా కూడా డిపాజిట్ల సమీకరణను బట్టి ఉండగలదన్నారు. ప్రస్తుతానికి డెబిట్ కార్డులు మాత్రమే ఇవ్వనున్నామని, క్రెడిట్ కార్డులు ఉండబోవని ఘోష్ చెప్పారు. ఐఎఫ్‌సీ, సిడ్బీ తదితర షేర్హోల్డర్లు రూ. 500 కోట్లు సమకూర్చగలరన్నారు. ఇక, తొలి మూడేళ్లలో తమకు అదనంగా నిధులు అవసరం లేదని, 2018 నాటికల్లా ఐపీవోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఘోష్ తెలిపారు. దక్షిణాదిన 4 రాష్ట్రాల్లో విస్తరణ.. ప్రస్తుతం తమ కార్యకలాపాలున్న ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, దక్షిణాదిన నాలుగు రాష్ట్రాల్లో బంధన్ బ్యాంకు కార్యకలాపాలు ఉండగలవని ఘోష్ తెలిపారు. కొత్తగా ప్రారంభించే శాఖల్లో దాదాపు 200 బ్రాంచీలు మెట్రో, పట్టణ ప్రాంతాల్లోనూ మిగతావి సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉంటాయని ఆయన తెలిపారు. 2,200 పైగా కార్యాలయాలు.. ఖాతాదారులకు ఇంటి వద్దే సర్వీసులు అందించే విధమైన సేవా కేంద్రాలుగా ఉంటాయని ఆయన చెప్పారు. మొదటి రోజు నుంచే 250 ఏటీఎం సెంటర్లు అందుబాటులో ఉండగలవన్నారు. లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు వివరించారు.