breaking news
Arya 2
-
ప్రేమ.. పిచ్చి అలానే ఉన్నాయి!
అల్లు అర్జున్, సుకుమార్ స్నేహం ‘ఆర్య’ సినిమాతో మొదలైంది. ‘ఆర్య’తో దర్శకుడిగా పరిచయం అయ్యారు సుకుమార్. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్లో ‘ఆర్య 2’ వచ్చింది. ‘ఆర్య 2’ సినిమా రిలీజ్ అయి బుధవారానికి పదేళ్లు అయింది. ఈ సందర్భంగా ‘ఆర్య 2’ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్. ‘ఆర్య 2’ సమయంలో దిగిన ఫొటో ఒకటి, ఇటీవల దిగిన సెల్ఫీ ఒకటి పోస్ట్ చేసి – ‘‘సుక్కూ (సుకుమార్ నిక్‌నేమ్) జుట్టు రంగు మారింది. నా స్కిన్ మారింది. కానీ మా మధ్య ఉన్న ప్రేమ మారలేదు. మేమిద్దరం కలిసినప్పుడు ఉండే పిచ్చి మారలేదు. దాన్ని మళ్లీ త్వరలోనే చూడబోతున్నారు (వీళ్ల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూడో చిత్రాన్ని ఉద్దేశించి)’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. -
తీసుకుంటే నువ్వు ఊపిరి ...
కొత్త వ్యక్తీకరణతో రాసే పాటలు వినడానికి చెవులు కూడా ఉత్సాహపడతాయి. ఆర్య 2 చిత్రం కోసం బాలాజీ రాసిన ఈ పాట చూడండి. పల్లవి ఎంత ఫ్రెష్షుగా ఉంటుంది! ‘ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్లకీ లోకమంత ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో’ రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో? ప్రేమలోని అత్యున్నత గాఢతను ఇంతకంటే ఏ భావం తెలియజేస్తుంది! నాయకుడి స్వభావానికి తగిన పాదాలతో సాగే ఈ పాటలోని చరణంలో ఒకచోట– ‘తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి’ అని వస్తుంది. ఇది ప్రేమ తీవ్రతను మరింత తీవ్రంగా చెప్పిన వ్యక్తీకరణ. 2009లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్. సంగీత దర్శకుడు సుకుమార్ రెగ్యులర్ అయిన దేవిశ్రీ ప్రసాద్. పాడింది కేకే. కాజల్ అగర్వాల్, అల్లు అర్జున్ నటీనటులు. -
సెకనుకోసారి మరణిస్తూ జన్మిస్తే...అదే ప్రేమ!
‘‘చిన్ని గుండెలో సముద్రం పడితే.. అది ప్రేమే సెకనుకోసారి మరణిస్తూ జన్మిస్తే.. అది ప్రేమే ఒకరి శ్వాస మరొకర్ని బతికిస్తే.. అది ప్రేమే’’ అంటున్నారు పాటల రచయిత బాలాజీ. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్య 2’. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో బాలాజీ సాహిత్యం అందించిన పాట ‘ఉప్పెనంత ఈ ప్రేమకి...’. ఈ పాటతత్వం గురించి రచయిత బాలాజీ మాటల్లోనే.. సుకుమార్‌గారు ఈ పరిధిలోనే పాట రాయమని నాకు చెప్పలేదు. పాట సందర్భం ఏమిటో కూడా నాకు తెలీదు. పాట రాయడానికి ముందే బాణీకి తగ్గట్టు చిత్రీకరించారు. పాటలో ఏం చెప్పాలి? ఎలా రాయాలి? అని ఆలోచించా. ప్రేమ గురించి చెప్పేటప్పుడు ఎన్ని భావోద్వేగాలైనా ప్రేమలోనే ఉండాలి. ‘ప్రేమను అతిశయోక్తి చేస్తే బాగుంటుందా?’ అని ఆలోచించి రాశా. పల్లవిలో ప్రేమ గురించి, తొలి చరణంలో ప్రేమికుడు తన గురించి, రెండో చరణంలో ప్రేయసి కోసం తానేం చేయాలనుకుంటున్నాడనేది రాశా. పల్లవి: ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో తీయనైన ఈ బాధకి ఉప్పనీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ఓ.. నిన్ను చూసే ఈ కళ్లకి లోకమంత ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఇన్ని శిక్షలు ఎందుకో ఐ లవ్ యూ.. నా ఊపిరి ఆగిపోయినా ఐ లవ్ యూ.. నా ప్రాణం పోయినా (2) ప్రేమకి కొలత లేదు. మహా సముద్రం కంటే పెద్దది. మన గుండె మాత్రం గుప్పెడంత ఉంటుంది. మహా సముద్రం ఈ చిన్ని గుండెలో ఎలా పడుతుంది? ప్రేమికుడి మదిలో సందేహం. అంతలోనే.. ప్రేమలో ఈ అనుభూతి, హాయి చెప్పడానికి భాష అవసరమా? అసలు భాష ఉందా? ఉంటే ఎందుకు? అనుకుంటాడు. ఈ లోకంతో ప్రేమికుడికి పనిలేదు. ఎప్పుడూ అమ్మాయి కళ్ల ముందు కనిపిస్తే చాలు. కళ్లు మూసి తెరిచే సమయం.. రెప్పపాటులో తను లేదు గనుక విరహంగా భావిస్తున్నాడు. నాకీ శిక్ష ఏంటని ఆలోచిస్తున్నాడు. ‘ఐ లవ్ యూ.. నా ఊపిరి ఆగిపోయినా’ అంటే మరణించిన తర్వాత కూడా ప్రేమిస్తానని అర్థం కాదు. ‘నీ ప్రేమ కోసం నేను మరణిస్తాను’ అని చెప్పడం. చరణం1: కనులలోకొస్తావు.. కలలు నరికేస్తావు సెకనుకోసారైన చంపేస్తావు మంచులా ఉంటావు.. మంట పెడుతుంటావు వెంటపడి నా మనసు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు ఊపిరి.. పోసుకుంట నా ఆయువే చెలి గుచ్చుకోకు ముల్లులా మరి గుండెల్లో సరాసరి కలలకు చోటెక్కడుంది, సెకనుకోసారి కనులలోకొచ్చి ప్రేయసి చంపేస్తుందంటే.. తర్వాతి సెకన్ ప్రేయసి కోసం మళ్లీ జన్మిస్తున్నట్టే కదా. నీకోసం.. ఎన్నిసార్లైనా జన్మిస్తానంటున్నాడు. నా కన్నుల నిండా నువ్వే ఉంటే కలలు ఎక్కడ వస్తాయనేది మరో అర్థం. చూపులకు అందంగా, చల్లటి హాయినిస్తూ మంచులా ఆ అమ్మాయి కనిపిస్తుంది. అదే కోపంలో అమ్మాయి చూపులు మాత్రం అబ్బాయి మనసుకు మంట పెడతాయని చెప్పడం ఇక్కడ. మంచు ఎప్పటికీ మంట కాదు. కానీ, ప్రేమికుడు పరస్పర విరుద్ధమైన ఆ రెండింటినీ ఒకేసారి అనుభూతి చెందుతాడు. ‘తీసుకుంటే నువ్వు ఊపిరి..’ పాటలో నాకు బాగా ఇష్టమైన లైన్ ఇది. ఎవరి ఊపిరి వాళ్లు తీసుకుంటేనే ప్రాణం నిలబడుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయి ఊపిరి తీసుకుంటే చాలు.. నేను ఆయువు పోసుకుంటానంటున్నాడు. ‘నా ప్రాణం కూడా నువ్వే బతికేస్తున్నావ్.. నీ శ్వాసే నా ఊపిరిగా బతుకుతున్నా’ అని చెప్తున్నాడు. ప్రేమలో ఒకరి జీవితం మరొకరు గడుపుతారన్నమాట. చరణం2: చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే మబ్బులే పోగేసి.. కాల్చేయనా చిలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే తొలకరే లేకుండా పాతేయనా నిన్ను కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడేస్తా ఆ కళ్ళనే ‘ఈ అమ్మాయి నాకు కావాలి. అమ్మాయి ప్రేమ గురించి ఏదైనా చేస్తాను’ అనే స్వార్థం ఈ సృష్టిలో ప్రతి వ్యక్తికీ ఉంటుంది. అందులోనూ ఇక్కడ అబ్బాయి మాత్రమే ప్రేమిస్తున్నాడు. రెండువైపులా ప్రేమ ఉంటే మనకు ఇంత ఎమోషన్ కనిపించదు. కేవలం ప్రేమే ఉంటుంది. ప్రేయసిని తాకి ఆ చినుకులు మెరుస్తానంటే మబ్బులను కాల్చేస్తానంటాడు. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్తున్నాడు. ఈ పాట విన్న తర్వాత చాలామంది తొలకరికి, చిలకలకూ సంబంధం ఏంటని అడిగారు. ‘తొలకరి చినుకులు పడినప్పుడు విత్తులు మొక్కలవుతాయి. మొక్కలు పెరిగి చెట్లవుతాయి. చెట్టుకి కాయలు కాస్తాయి. కాయలు ముగ్గితే పండ్లు.. ఆ పండు కోసం చిలక వస్తుంది’ - అసలు తొలకరే లేకుండా పాతేస్తే చినుకు, మొక్క, కాయ, పండు, చిలక ఏవీ ఉండవు. కానీ, మబ్బులను కాల్చేయడం.. తొలకరిని పాతేయడం సాధ్యమా? మనం చేయలేని పనులు అన్నింటినీ ప్రేమలో ఉన్న యువకులు చేయగలమనే అనుకుంటారు. ఎన్నో ప్రశంసలు.. మరెన్నో అభినందనలు.. రచయితగా నాకు వందశాతం సంతృప్తి ఇచ్చిన పాట. ఇంటర్వ్యూ: సత్య పులగం