breaking news
Archery Academy
-
ఆర్చరీ సమాఖ్య అధ్యక్షుడిగా పాపారావు
న్యూఢిల్లీ: జాతీయ ఆర్చరీ సమాఖ్య అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి బీవీ పాపారావు ఎన్నికయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన ఎలక్షన్స్‌లో త్రిపురకు చెందిన రూపక్ దేబ్‌రాయ్‌పై ఆయన 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ద్వారా నియమితులైన పర్యవేక్షకుడి సమక్షంలో జరి గిన ఎన్నికల్లో పాపారావుకు 49 ఓట్లు రాగా, రూపక్‌కు 36 ఓట్లు పడ్డాయి. కొత్తగా ఎన్నికైన ప్యానల్లో మహాసింగ్ కార్యదర్శిగా, డీకే విద్యార్థి కోశాధికారిగా, సునీల్ శర్మ సీనియర్ ఉపాధ్యక్షుడుగా, రాజేంద్ర సింగ్ తోమర్, పూర్ణిమ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తాజా ఎన్నికల ఫలితంతో ఆర్చరీ సమాఖ్యలో నాలుగు దశాబ్దాల పాటు సాగిన విజయ్ మల్హోత్రా ఆధిపత్యానికి తెర పడింది. 1973 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించిన మల్హోత్రా కొత్త స్పోర్ట్స్ కోడ్ ప్రకారం పదవినుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తన మనిషి రూపక్‌ను ఆయన ఎన్నికల బరిలోకి తెచ్చి మళ్లీ అధికారం అందుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం లింబారామ్, చక్రవోలు స్వురో తదితర ఆర్చర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాస్తూ ఎన్నికలు ప్రజాస్వామికంగా జరిగాయని, వీటిని గుర్తించాలని కోరారు. అస్సాం కేడర్‌కు చెందిన పాపారావు గతంలో ఈశాన్య రాష్ట్రాల ఆర్చరీ సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1985–90 మధ్యలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ప్రత్యేకాధికారిగా పని చేసిన సమయంలో స్పెషల్ ఏరియా గేమ్స్ నిర్వహించి లింబారామ్ తదితర ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చారు. రిటైర్మెంట్ అనంతరం అశ్విని నాచప్ప, పర్గత్ సింగ్ వంటి మాజీ ఆటగాళ్లతో కలిసి ‘క్లీన్ స్పోర్ట్స్ ఇండియా’ పేరుతో ఉద్యమాన్ని నడిపించారు. ‘సాయ్’ గవర్నింగ్ బాడీలో సభ్యుడిగా కూడా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరిగా వ్యవహరించిన పాపారావు ఆర్చరీ ఎన్నికల కోసం తన పదవికి రాజీనామా చేశారు. -
లెనిన్ ఆశయాలు సాధించాలి
విజయవాడ స్పోర్ట్స్ : అంతర్జాతీయ ఆర్చర్, కోచ్ చెరుకూరి లెనిన్ నాలుగో వర్ధంతి నగరంలో చెరుకూరి లెనిన్ -వీఎంసీ ఆర్చరీ అకాడమీలో శుక్రవారం జరిగింది. అకాడమీ ఆవరణంలో లెనిన్ విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. అనంతరం నగర మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు ప్రసంగించారు. గద్దె రామ్మోహన్రావు మాట్లాడుతూ సంప్రదాయ విలువిద్య క్రీడలో అహర్నిశలు శ్ర మించి కామన్వెల్త్ గేమ్స్‌లో తన శిష్యబృందంతో పతకాలు సాధించడంలో సఫలీకృతుడయ్యారని గుర్తుచేశారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని క్రీడా రాజధానిగా తీర్చిది ద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్‌లో దేశానికి ఆర్చరీ పతకాన్ని అందించే క్రీడాకారులు శిక్షణ పొందుతున్న చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి అవసరమైన కొరియన్ కోచ్ నియామకంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. చెరుకూరి లెనిన్ స్ఫూర్తితో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సూచించారు. మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ చిన్నతనంలో ద్రాణాచార్యుడిగా పిలిపించుకున్న ఘనత ఒక్క లెనిన్కే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు నగర పాలక సంస్థ సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్ పతక విజేత పూర్వాష సుధీర్ షిండే సన్మాన కార్యక్రమంలో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ రఘునందన్‌రావు, పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు సమక్షంలో కొరియన్ కోచ్ కావాలని లెనిన్ తండ్రి చెరుకూరి సత్యనారాయణ కోరారని, స్పందించిన సీపీ తక్షణమే బడ్జెట్ ఎంత కావాలని కోరగా, రూ.1.39 కోట్లకు నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి, స్పాన్సర్ల నుంచి సేకరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పి.రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్డీవో పి.రామకృష్ణ, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ రామ్ బొబ్బా, జిల్లా చైర్మన్ కె.పార్థసారథి, కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, చెన్నుపాటి గాంధీ, దాసరి మల్లేశ్వరి, కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఐద్వా నాయకురాలు వనజకుమారి, అకాడమీ ఆర్చర్లు, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అకాడమీకి రూ.లక్ష విరాళం ఆసియా క్రీడల్లో తన కుమార్తె కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన చెరుకూరి ఓల్గా-వీఎంసీ అకాడమీకి పూర్వాష సుధీర్ షిండే తండ్రి సుధీర్షిండే (మహారాష్ట్ర-అమరావతి) లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. తొలుత విశాఖపట్నం హుదూద్ బాధితల కోసం సీఎం సహాయ నిధికి ఇవ్వాలని రూ.లక్ష చెక్కును ఆయన ఎమ్మెల్యేలకు ఇవ్వగా వారు అకాడమీకి ఇవ్వాలని సూచించా రు. ఈ మేరకు ఆ చెక్కును తన కుమార్తె పూర్వాషతో కలిసి ఎమ్మెల్యేల చేతులు మీదుగా చెరుకూరి సత్యనారాయణకు అందజేశారు.