breaking news
ADGP house
-
టార్గెట్ స్యాంట్రో రవి..నాలుగో భార్య ఫిర్యాదు
సాక్షి, మైసూరు: రాష్ట్రంలో సంచలనంగా మారిన ప్రముఖ నేరారోపి స్యాంట్రో రవిని అరెస్టు చేయడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏడీజీపీ అలోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం మైసూరుకు వచ్చిన అలోక్ కుమార్ పోలీసు కమిషనర్ రమేశ్ కార్యాలయంలో స్యాంట్రో రవి కేసుల తనిఖీ గురించి పోలీసు అధికారులతో చర్చించారు. స్యాంట్రో రవి ఆర్థిక వ్యవహారాలు, అత్యాచార కేసులను సమగ్రంగా తనిఖీ చేయాలని ఏడీజీపీ సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ గీతా, ఎస్పీ సీమా లట్కర్, ఏసీసీ శివశంకర్, ఇన్స్పెక్టర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులపై నాలుగో భార్య ఫిర్యాదు కాగా, ఏడీజీపీ ఎదుట స్యాంట్రో రవి నాలుగో భార్య, ఆమె చెల్లెలు హాజరయ్యారు. వారిద్దరిని ఏడీజీపీ సుమారు గంటకు పైగా విచారించారు. ఈ సమయంలో రవితో పాటు బెంగళూరు కాటన్‌పేట ఏడు మంది పోలీసులు తనను వేధించిన తీరు, అలగే గూగుల్ పే ద్వారా ఆ పోలీసు అధికారులకు చెల్లించిన డబ్బుల వివరాలు ఏడీజీపీకి ఆమె తెలిపారు. తనను వేధించిన పోలీసులను సస్పెండ్‌చేయాలని, రవిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాటన్‌పేట సీఐ ప్రవీణ్ సస్పెండ్ స్యాంట్రో రవి కేసులో బెంగళూరు కాటన్‌పేట ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌ను డీజీపీ ప్రవీణ్ సూద్ సస్పెండ్ చేశారు. స్యాంట్రో రవికి మద్దతుగా ఇద్దరు మహిళలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారనే ప్రవీణ్‌పై ఆరోపణలువవచ్చాయి. హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఆదేశాలతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకున్నారు. దోపిడీ కేసులో వారి పాత్ర లేకపోయినా రవి భార్య, ఆమె సోదరిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని తేలింది. రవిపై నిఘా ఉంచాం మీడియాతో అలోక్ కుమార్ మాట్లాడుతూ స్యాంట్రో రవి కేసు విచారణ నిమిత్తం మైసూరుకు వచ్చినట్లు , అతనిపై రేప్, అట్రాసిటీ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అతని ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విమానాశ్రయాల్లో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. బెంగళూరు రాజరాజేశ్వరి లోని రవి మరో భార్య వనజాక్షిని కూడా విచారించినట్లు చెప్పారు. స్యాంట్రో రవి ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. రవి ప్రస్తుతం మొబైల్ వినియోగించడం లేదన్నారు. అతి త్వరగా అతన్ని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తొదరలోనే పట్టుకుంటాం: హోంమంత్రి శివాజీనగర: పలు నేరారోపణలు ఉన్న స్యాంట్రో రవి అరెస్ట్‌కు ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించినట్లు, త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. మంగళవారం బెంగళూరులో మాట్లాడిన ఆయన, రవి కదలికలపై నిఘా ఉంది, అతని అనుచరులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడతాం. అన్నివిధాలా గాలింపు జరుగుతోంది. త్వరలోనే రవి అరెస్ట్ అవుతారని చెప్పారు. అతనిపై ఉన్న అన్ని కేసులపై విచారణ చేస్తామన్నారు. అంతేకాకుండా మహిళపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడంపై స్పందిస్తూ తప్పుడు కేసులు వేసి అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే నివేదిక సిద్ధంగా ఉంది. ఇందులో ఏ అధికారి ఉన్నా కూడా వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వమే రవిని దాచిపెట్టిందన్న జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపణపై మాట్లాడుతూ కుమారస్వామి మాటలకు సమాధానం చెప్పను అన్నారు. (చదవండి: హాట్ టాపిక్‌గా స్యాంట్రో రవి..రెండో భార్య వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లో ఏముంది?) -
ఐపీఎస్ కూతురు డ్రైవర్‌పై దాడి
-
డ్రైవర్‌పై ఐపీఎస్ కూతురి నిర్వాకం
తిరువనంతపురం: తమ ఇంటి వద్ద కాపలాగా పనిచేస్తున్న పోలీసుపై దాడి చేసినందుకు కేరళ ఐపీఎస్ అధికారి కూతురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. పరుష పదజాలంతో దూషించడమే కాకుండా, తనపై దాడి చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటన గురువారం తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాలు.. కేరళ పోలీసు శాఖలో అసిస్టెంట్ డీజీపీగా పనిచేస్తున్న సుదేష్ కుమార్ వద్ద హోంగార్డు గవాస్కర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సుదేష్ కుమార్ భార్యాబిడ్డలు వాకింగ్‌కు వెళ్లారు. వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు డ్రైవర్ గవాస్కర్ కాస్త ఆలస్యంగా రావడంతో ఐపీఎస్ కూతురు అతన్ని బూతులు తిట్టారు. ఆలస్యానికి గల కారణాన్ని చెప్తున్నా వినకుండా ఆమె నానా రభస చేయడంతో.. గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. అనవసరంగా నోరుపారేసుకోవద్దని కోరాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ యువతి అతన్ని తోసేసి దాడికి దిగారు. మొబైల్ ఫోన్‌తో అతడి మెడపై బాది గాయం చేశారు. బాధితుడు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, మహిళల గౌరవానికి భంగం కలిగించాడంటూ డ్రైవర్‌పై సదరు ఏడీజీపీ కుటుంబం ఫిర్యాదు చేయడంతో అతడిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసుల విచారణను డీఎస్సీ స్థాయి వ్యక్తి చేపడతారని సమాచారం. గవాస్కర్ ఘటన తర్వాత కేరళలోని పోలీసు ఉన్నతాధికారుల నివాసాల వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న అనేక మంది కింది స్థాయి సిబ్బంది తమ గోడు వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వాళ్ల ఇద్ద చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కనీస గౌరవం లేకుండా మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అడిషనల్ డీజీపీ ఇంట్లో పాము!
చిలకలగూడ: అడిషనల్ డీజీపీ ఇంట్లో పాము కలకలం సృష్టించింది. చిలకలగూడ ఠాణా కానిస్టేబుల్ వెంకటేష్‌నాయక్ ఆ పామును పట్టుకుని ఫ్రెండ్ ఆఫ్ స్నేక్ సొసైటీకి అప్పగించాడు. వివరాలు.. లక్డీకాపూల్‌లోని తెలంగాణ డీజీపీ కార్యాలయం సమీపంలోని భవనంలో అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) సుదీప్ లక్తాకియా నివసిస్తున్నారు. ఆదివా రం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అడిషనల్ డీజీపీ ఇంట్లోకి పాము దూరింది. ఇది గమనించిన ఆ ఇంట్లోని వారు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వారి సమాచారం మేరకు డీజీపీ కార్యాలయం సెక్యూరిటీ అధికారులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యుడు, పాముల పట్టడంలో దిట్ట అయిన చిలకలగూడ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్‌ను పిలిపించారు. అతను అరగంట పాటు శ్రమించి ఆరు అడుగుల పాము (జెర్రిపోతు)ను పట్టుకున్నాడు. దీంతో అడిషనల్ డీజీపీ కుటుంబసభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చాకచక్యంగా పామును పట్టుకున్న వెంకటేష్నాయక్ను పోలీస్ అధికారులు అభినందించారు. పట్టుకున్న పాములను ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో అడవుల్లో విడిచిపెడతామని వెంకటేష్‌నాయక్ చెప్పాడు.