పాపం.. బడి పిల్లలు | Sakshi
Sakshi News home page

పాపం.. బడి పిల్లలు

Published Fri, Jan 26 2018 1:09 PM

students injured in Republican celebration - Sakshi

వల్లూరు: తమ పాఠశాలలో శుక్రవారం జరగనున్న గణతంత్ర వేడుకల్లో జెండాను ఎగురవేసేందుకు సిద్ధం చేస్తుండగా పాఠశాల ముందు భాగంలో ఉన్న విద్యుత్‌ తీగలు తగులుకుని నలుగురు విద్యార్థులకు గాయాలైన సంఘటన మండలంలోని పెద్దలేబాక ఎస్సీ కాలనీలో గురువారం జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు మండలంలోని పెద్దలేబాక ఎస్సీ కాలనీలోని మండల పరిషత్‌ ప్రాథమిక ( స్పెషల్‌ ) పాఠశాల ఉపాధ్యాయుడు దీన్‌ దయాల్‌ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం జరిగే వేడుకలకు అవసరమైన ఏర్పాట్లను చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుని సూచన మేరకు  పాఠశాల తరగతి గదిలో ఉన్న జెండాను ఎగురవేసే ఇనుప పైపును నలుగురు విద్యార్థులు  గది బయటకు తీసుకుని వచ్చారు.

పైపును నిలబెట్టే క్రమంలో  పాఠశాల ఆవరణలో గదికి సమీపంలో వెళుతున్న 11 కేవీ విద్యుత్‌ తీగలకు పొరబాటున తగిలింది. దీంతో పైపు గుండా విద్యుత్‌ ప్రవహించడంతో పైపును పట్టుకున్న 5 వ తరగతి విద్యార్థులు ఆది  జాషువా పాల్, బి.ఈశ్వర వర్దన్, ఆది రామకృష్ణ , నాలుగవ తరగతి విద్యార్థి పెరికెల అజిత్‌ చంద్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయుడు దీన్‌ దయాల్‌ అప్రమత్తమై వారిని రక్షించాడు. దీంతో విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు , స్థానికులు విద్యార్థులను ఆటోలో కమలాపురం ఆసుపత్రికి  తరలించారు.  ఈశ్వర వర్దన్, జాషువా పాల్‌ అనే విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. కాలికి తీవ్ర గాయమైన జాషువా పాల్‌ , షాక్‌లో ఉన్న  ఈశ్వర వర్దన్‌లు కోలుకుంటున్నారు. తహసీల్దార్‌ మహాలక్ష్మి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు.

పరామర్శించిన ఎమ్మెల్యే
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను జెడ్పీటీసీ సభ్యుడు అబ్బిరెడ్డి వీరారెడ్డితో కలిసి కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథరెడ్డి పరామర్శించారు. వారి తల్లి దండ్రులతో ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స  అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ చల్లా రాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ నాయకుడు చిట్టిబాబు ఉన్నారు.

Advertisement
Advertisement