చీకటి బ్యారక్‌లలో మగ్గుతున్న జైలు జీవితాలు

Solipeta Ramalinga Reddy Article On Prisoners - Sakshi

జైళ్లు రక్షణ గృహాలనీ, శిక్షా గృహాలు కావనీ, ఖైదీల పట్ల గౌరవ మర్యాదలతో సిబ్బంది ప్రవర్తించాలనీ, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. ఇన్ని చట్టాలున్నా..ఏవీ కూడా ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాకు వర్తించవా అనేది నా మనసును ఎప్పటి నుంచో తొలుస్తున్న ప్రశ్న. ఆయన పరిస్థితి ప్రత్యేకమైనది. 90 శాతం వైకల్యంతో పాటు ఎన్నో ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను సుదీర్ఘకాలంగా వేధిస్తున్నాయి. అన్ని వ్యాధులతో, కదల్లేని స్థితిలో ఉన్న నిస్సహాయుడైన ఇలాంటి ఖైదీ ఉండాల్సినది ఆసుపత్రిలో, వైద్యుల పర్యవేక్షణలో. కానీ సాయిబాబాని ఉంచింది నాగ్‌పూర్‌ జైల్లో గాలీ వెలుతురూ సోకని అండా సెల్‌ అనే చీకటి గుహలో.

అగ్నిధార పుస్తకంలో దాశరథి రంగా చార్యులు నిజామాబాదు జైలు జీవితం అనుభవానికి  ఇచ్చిన అక్షర రూపం ‘ఇట వసంతము లేదు....’ అనే సుప్రసిద్ధ పద్యం.  నా గదిలో ఓ మూలకు పడి ఉన్న ఈ ఖండకావ్యాన్ని ఈ మధ్యనే  మరో సారి చేతిలోకి తీసుకొని పుటలను తిర గేస్తుంటే.. అవి నన్ను నా గతంలోకి, అప్పటి నా జైలు జీవితం వైపుకు తీసు కుపోయాయి. చీకటి బ్యారక్‌లలో  మగ్గి పోయిన మేరీ టేలర్, జూలియస్‌ ఫ్యూజిక్, నెల్సన్‌ మండేలాను గుర్తు చేశాయి. అండా సెల్‌లో కుంగిపోతున్న ప్రొఫెసర్‌ సాయి బాబాను యాదిజేశాయి. అయితే నేను వాళ్లంత గొప్పవాణ్ణి, త్యాగశీలిని కాదు గానీ ఈ సందర్భంగా వాళ్లను గుర్తు చేసు కుంటూ జైళ్ల చట్టాలపై ఓ చర్చ చేయడానికి అవకాశం దొరికింది.

1991లో నా మీద టాడా కేసు పెట్టి  ముషీరాబాద్‌ జైల్లో పెట్టారు. (ఇప్పటి గాంధీ ఆసుపత్రి) మావోయిస్టు ఉద్యమకా రుణ్ణి, పైగా జర్నలిస్టులను  కాబట్టి సాధారణ బ్యారక్‌లో ఖైదీలతో కలిసి ఉంటే వారిని చెడగొట్టి, ఉద్యమం వైపుకు మలుపుతాననే ఆలోచనతో నన్ను అత్యంత ప్రమాదకర నేరస్తునిగా ముద్రవేసి చీకటి బ్యారక్‌లోకి పంపారు. గాలి, వెలుతురు సోకని చీకటి గది అది. ఓ నీళ్ల కుండ ఉండేది. చేతి సైగతో తడిమి కుండలోని నీళ్లు తాగాల్సి వచ్చేది. 15 రోజులకు ఒక్కసారి జాలి ములాఖత్‌ ఇచ్చే వాళ్లు. వందల మంది ఖైదీల బంధువులను ఒక్కసారే వదిలేవారు.  ఇరుకైన చిన్న ప్రదేశం జనం తోసుకుంటూ వచ్చేవాళ్లు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అయ్యేది కాదు.. నేను జైలుకు  వెళ్లేటప్ప టికి సుజాత (నా భార్య)  నిండు గర్భిణి. పొత్తికడుపును జాగ్ర త్తగా దాచుకుంటూ జనం, తనూ ఒకతై ఆయాసపడుకుంటూ ములాఖత్‌కు వచ్చేది. మా ఇద్దరి మధ్య 10 ఫీట్ల ఇనుపజాలి అడ్డంగా ఉండేది. ఆమె కన్నీళ్లు తప్ప నాకు ఇంకేమీ కనిపించేది కాదు, వినిపించేది కాదు. చాలామంది విప్లవ ఖైదీలు ఈ పరిస్థితిని అనుభవించారు. ‘జాలి ములాఖత్‌’ తొలగించాలనే  డిమాండ్‌ను మావోయిస్టు పార్టీ బలంగా రాజ్యం ముందు ఉంచింది.

జైలుశిక్ష పడినంత మాత్రాన వారికి పౌరహక్కులు లేకుండా పోవు . కానీ  మన జైలు చట్టాలు1836 నాటి బ్రిటిష్‌ ఏలుబడిలో అరువు తెచ్చుకున్న చట్టాలు.. 1877లో కారాగార చట్ట రూప కల్పన ప్రారంభమయింది. స్వాతంత్య్ర కాంక్షతో ఉద్యమించిన వాళ్లను జైళ్లలోనే కుక్కి చంపాలనే  రాజ్య హింసను మనసులో పెట్టుకొని  చేసిన చట్టాలవి. కారాగారాలను శిక్షాలయాలుగా తీర్చి దిద్దారు. బ్రిటిష్‌ వారి ఏలుబడిలోనే 1894లో ప్రిజన్స్‌యాక్టు అమ లులోకి వచ్చిన తరువాత 2012 వరకు వివిధ జైలు సంస్కరణ కమిటీలు ఖైదీలకూ పౌర హక్కులు ఉన్నాయని తేల్చిచెప్పాయి. జైళ్లు రక్షణ గృహాలనీ, శిక్షా గృహాలు కావనీ, వారికి ఉచిత, న్యాయ సహాయం అందచేయటం సర్కారు బాధ్యత అనీ, ఖైదీల పట్ల గౌరవ మర్యాదలతో సిబ్బంది ప్రవర్తించాలనీ జైళ్లల్లో సంస్కరణ పర్వానికి మానవతా విలువలు జోడించాలనీ (రతీరామ్‌ కేసు 2012) సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. ఖైదీలందరికీ పౌరహక్కులు లభిస్తాయని చల్లా రామకృష్ణారెడ్డి కేసు (2000)లో సుప్రీం ప్రకటించగా, మానవహక్కుల కొనసాగింపునకు జైలు గోడలు అడ్డంకి కారాదనీ, రాజ్యాంగం ప్రసాదించిన సమానతా హక్కు, వాక్‌ స్వాతంత్య్రం, జీవించే హక్కు ఖైదీలకు సైతం నిరా టంకంగా వర్తిస్తాయని జస్టిస్‌ చిన్నపరెడ్డి 1983లో స్పష్టం చేశారు.

ఇన్ని చట్టాలున్నా.. ఏవీ కూడా ప్రొఫెసర్‌ సాయిబాబాకు వర్తించవా అనేది నా మనసును ఎప్పటి నుంచో తొలుస్తున్న ప్రశ్న.  సాయిబాబా పరిస్థితి ప్రత్యేకమైనది. 90 శాతం వైకల్యంతో పాటు ఎన్నో ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను సుదీర్ఘకాలంగా వేధిస్తున్నాయి. సాయిబాబా గత 15 ఏళ్లుగా హైబీపీతో బాధపడుతున్నారు. పోలీసుల విచారణలో ఒక చేయి పూర్తిగా పనిచేయని స్థితికి వచ్చింది. గుండె కండరాలకు సంబం ధించిన వ్యాధి.. గాల్‌ బ్లాడర్‌లో రాళ్ల సమస్య తీవ్రంగా ఉంది. అన్ని వ్యాధులతో, కదల్లేని స్థితిలో ఉన్న నిస్సహాయుణ్ణి గాలీ వెలు తురూ సోకని అండాసెల్‌ అనే చీకటి గదిలో ఉంచడంతో ఒక్కొక్క అవయవం ఆగిపోతోంది. ఇలాంటి ఖైదీ ఉండాల్సినది ఆసుప త్రిలో, వైద్యుల పర్యవేక్షణలో. కానీ సాయిబాబాని ఉంచింది అండా సెల్‌ అనే చీకటి గుహలో. మన ౖజైళ్ల చట్టంలోని 37, 38, 39 సెక్షన్‌ల ప్రకారం జైలు అధికారులు ఖైదీలకు అనారోగ్య సమ స్యలు ఏర్పడినప్పుడు వారిని వెంటనే జైలు లోని ఆసుపత్రికి తర లించాలి. ఇంకా అదనపు వైద్య సహాయం అవసరమైన పుడు ప్రత్యేక సదుపాయాలు కలిగిన బయటి ఆసుపత్రుల్లో అవసర మైన వైద్య సహకారం అందించాలి. నిర్బంధంలో ఉన్నప్పుడు అతను ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

ఇక్కడో సంఘటన గుర్తు చేయాలి. ఎన్‌సీఆర్‌బి (నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో) రికార్డుల ప్రకారం విచారణ పూర్తికాని 2.52 లక్షల మంది నిందితుల్లో 55 శాతం మంది ముస్లింలు, దళితులు, గిరిజనులే. 2010 నుంచి 2014 వరకు 25 శాతం నిందితులు ఏడాదికి మించి జైలులో విచారణ పేరుతో మగ్గిపోవలసి వచ్చింది. 2014లో ప్రతి 10 మంది ఖైదీల్లో ఏడుగురు విచారణ ఖైదీలుగానే ఉన్నట్టు వెల్లడయింది.. దేశంలోని 1,402 జైళ్లు  5 లక్షల మంది ఖైదీలతో కిక్కిరిసి ఉంటున్నాయి. జార్ఖండ్‌లో 27 జైళ్లు, ఛత్తీస్‌గఢ్‌లో 28 జైళ్లు ఉన్నాయి. ఇక్కడ  7,550 మంది  ఖైదీ లకన్నా ఎక్కువ మంది ఉంటే నరకమే .. కానీ  ప్రస్తుతం జార్ఖండ్‌ జైళ్లలో 20 వేల మంది, ఛత్తీస్‌ఘడ్‌ జైళ్లలో 17,662 మంది వరకు ఖైదీలున్నారు. దేశం మొత్తం మీద జైళ్లలో ఆక్యుపెన్సీ సరాసరిగా 114.4 శాతం మించకూడదు. దీన్ని బట్టి దేశంలో ఏ జైలులో లేని ఆక్యుపెన్సీ శాతం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లోనే ఉండడం గమనార్హం.  

అటువంటి జార్ఖండ్‌ జైలులో ఒక విచారణ ఖైదీ మాలతి. ఆమె మావోయిస్టు పార్టీ జార్ఖండ్‌ రాష్ట్ర కార్యదర్శి రవిశర్మ జీవిత భాగస్వామి. ఆమె కూడ పార్టీ మహిళా విభాగంలో పని చేస్తు న్నారు. నరక కూపం లాంటి అక్కడి జైల్లో ఉండలేక తనను తెలం గాణ జైలుకు మార్చాలంటూ దాదాపు ఆరేళ్ల్ల కిందట దరఖాస్తు పెట్టుకుంది. ఆమె అభ్యర్థన ఎవరికీ పట్టలేదు. గత ఏడాది నేను అంచనా పద్దుల కమిటీ చైర్మన్‌ హోదాలో జైళ్ల శాఖపై సమీక్షా సమావేశం పెట్టినప్పుడు  ఆమె లేఖ నా దృష్టికి వచ్చింది. ఆ లేఖపై మీరు ఎందుకు స్పందించలేదని జైలు అధికారులను అడి గితే నాకు సరైన సమాధానం దొరకలేదు. మొత్తానికి  ఎలాగోలా కసరత్తు చేస్తే ఆమెను ఇప్పుడు తెలంగాణ జైలుకు మార్చారు. కానీ మాలతి లాంటి ఎంతమంది అర్జీలు బుట్టదాఖలయ్యాయో తల్చుకుంటే హృదయం ద్రవిస్తోంది.

సోలిపేట రామలింగారెడ్డి,  వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు
మొబైల్‌ : 94403 80141

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top