‘చెత్త’శుద్ధి

‘చెత్త’శుద్ధి


జీవన కాలమ్‌



బస్సు కదులుతుంటే ఒకే ఒక్క సమస్య నా కళ్లకు కట్టింది. ఇన్ని లక్షల మంది నివసించే దేశంలో ‘చెత్త’ సమస్య కదా! అదీ జపాన్‌లో నేను మా మిత్రుడిని అడిగిన మొదటి ప్రశ్న. ఆయన నవ్వాడు: ‘‘అడగాల్సిన మొదటి ప్రశ్న ఇదే’’ అన్నాడు.



జపాన్‌లో టోక్యో నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో నారిటా అనే ఊరిలో విమానాశ్రయం. అక్కడి నుంచి టోక్యోకి బస్సులో రెండు గంటల ప్రయాణం. మా మిత్రుడు తీసుకెళ్లాడు. దారి పొడుగునా ముప్పయ్‌ నలభై అంతస్తుల భవనాలు. లక్షలాది ఇళ్లు. జపాన్‌ చిన్న ద్వీపం. పురోగతిలో ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంది. ఏమిటి దీని గొప్పతనం? బస్సు కదులుతుంటే ఒకే ఒక్క సమస్య నా కళ్లకు కట్టింది. ఇన్ని లక్షల మంది నివసించే దేశంలో ‘చెత్త’ సమస్య కదా! అదీ జపాన్‌లో నేను మా మిత్రుడిని అడిగిన మొదటి ప్రశ్న. ఆయన నవ్వాడు: ‘‘అడగాల్సిన మొదటి ప్రశ్న ఇదే’’ అన్నాడు.



జపాన్‌లో చెత్త చాలా విలువైన వస్తువు. మరో విలువైన వస్తువు– స్థలం– చిన్న దేశం కనుక. పాలకులు తాటిచెట్టుకీ, తాత పిలకకీ ముడివేశారు. ప్రతిచోటా రెండు రకాలైన చెత్తని వేయడానికి డబ్బాలుంటాయి. తడి చెత్త, పొడి చెత్త. పొడి చెత్తని కొన్ని రసాయనాలతో కలిపి ఇటుకలుగా చేస్తారు. దేశం చుట్టూ ఉన్న సముద్ర జలాలలో నింపి– స్థలాన్ని పెంచుకుంటారు. అలా పూడ్చిన స్థలం మీదే ఒసాకా విమానాశ్రయాన్ని నిర్మిం చారు. అంతేకాదు. 2020లో జరుగుతున్న ఒలింపిక్స్‌ స్టేడియం– కెంగో కుమాలోన స్టేడియంని ఇలాంటి స్థలం మీదే నిర్మించారు. మా మిత్రుడు– తెలుగు మిత్రుడు– కిళ్లీ వేసుకుని నడిరోడ్డు మీద తుపుక్కున ఉమ్మడం హక్కుగా భావించే తెలుగు మిత్రుడు– నేను తాగిన కూల్‌డ్రింక్‌ డబ్బాలో కొంచెం ఉండిపోయిందని దాన్ని పడేసే చెత్తబుట్టని వెతుక్కుంటూ కిలోమీటరు నడిచాడు! దేశంలో నేలబారు పౌరుడికి తన కర్తవ్యాన్ని వంటబట్టించిన దేశం ప్రపంచానికి మార్గదర్శి కాక ఏమౌతుంది?



ఇప్పుడు మన చెత్తకథ. భారతదేశంలో–125 కోట్ల పైబడిన జనాభా ఉన్న దేశంలో–చెత్తకి కొద్దిరోజుల్లో సంవత్సరానికి ఢిల్లీ నగరమంత స్థలం కావలసి ఉంటుందట. ఈ విషయాన్ని శాస్త్ర, పర్యావరణ పరిరక్షక కేంద్రం ప్రకటించింది. మనది సమృద్ధిగా చెత్తని ఉత్పత్తి చేసే దేశం. చెత్తని గుట్టలు గుట్టలుగా పోయడం కార్పొరేషన్ల హక్కు. వాటి కాలుష్యం వర్ణనాతీతం. ఎవరికీ పట్టదు. ఈ మధ్యనే తడి చెత్త, పొడి చెత్త అంటున్నారు కాని, కేరళలో అళప్పుళ, గోవా రాష్ట్రాలు తప్ప ఎవరూ పట్టించుకోవడంలేదట. చెత్త మన హక్కు.



ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే– అతి చిన్నదేశం స్వీడన్‌– అలా చెప్తే చాలామందికి తెలియదు. ప్రపంచానికి నోబెల్‌ బహుమతులని ఏటేటా ఇచ్చే, మన సౌకర్యాలకి ఓల్వో బస్సులని తయారుచేసే దేశం– చెత్తతో బయోగ్యాస్‌నీ, విద్యుచ్ఛక్తినీ, ఇంటి ఉష్ణోగ్రతలని పెంచే సాధనాలనీ తయారు చేసుకుంటోంది. ఎంత ముమ్మరంగా చేస్తోందంటే– వారి దేశంలో తయారయే చెత్త చాలక 980 లక్షల టన్నుల చెత్తని సాలీనా దిగుమతి చేసుకుంటోందట. ఇది అనూహ్యమైన విషయం. దిగుమతి అవుతున్న చెత్త ఫొటో చూడండి. ఇందులో మళ్లీ ఇళ్లలో తయారయే చెత్తని– జపాన్‌లాగే సముద్రాన్ని నింపి స్థలాన్ని పెంచుకునే కార్యానికి వినియోగిస్తున్నారు. 2011 నుంచి ఇలా సముద్ర స్థలాన్ని కలుపుకోవడానికి ప్రతీ ఇంటిలో తయారవుతున్న చెత్తలో ఒక శాతాన్ని వినియోగిస్తున్నారట. 2012లో ఈ చెత్త వినియోగ విభాగం సలహాదారుడు కాటన్నా ఓస్ట్‌లుండ్‌– మా దేశం మాకు కావలసినంత చెత్తని ఇవ్వడం లేదని వాపోయాడు. నార్వే, ఇంగ్లండ్, ఇటలీ, రుమేనియా, బల్గేరియాల నుంచి చెత్తని వీరు దిగుమతి చేసుకుంటున్నారు.



మనం స్వీడన్‌ దాకా వెళ్లనక్కరలేదు. జపాన్‌లో బతుకుతున్న తెలుగువారిని దిగుమతి చేసుకుని– ఆ దేశపు క్రమశిక్షణని ఎలా పాటించాలో నేర్చుకుంటే ‘ఎందుకు పాటించాలో’ పెద్దలు చెప్తారు. అయితే చెత్తలో మనతో పోటీ పడే దేశం మరొకటి ఉంది. అమెరికా. చెత్త గుట్టలు గుట్టలుగా ప్రారంభమయి ప్రస్తుతం అవి కొండలని తలపిస్తున్నాయట.  ఏతావాతా దేశానికి కావలసింది వ్యక్తిగత సంస్కారం. పరిపాలకులకు కావలసింది వారిని, వారి ఆలోచనా సరళిని మార్చే చిత్తశుద్ధి. రోజూ దైనందిన జీవితంలో సతమతమయ్యేవారి పొట్ట కొట్టే నాయకుడో, అధికారో పౌరుని అక్రమ శిక్షణని సంస్కరించలేడు. నిజానికి మన దేశంలో చెత్తని మించిన ‘చెత్త’ వ్యక్తుల బుర్రల్లో ఉంది. మనం చేసే పనుల్లో చెత్తపనులు కోకొల్లలు. మొదట వాటిని గుర్తు పట్టి, వేరు చేసి recycle చేసుకోగలిగితే మన మనస్సుల్ లోenergy levels పెరుగుతాయి. అనవసరమైన వ్యర్థాలు తొలగుతాయి. పరిశుభ్రపరుచుకోవడంలో సమాజానికి, వ్యక్తికి పెద్ద తేడా లేదు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి నిలపాలనే జపాన్‌ లోని తెలుగు మిత్రుడి బుర్రలో ‘అక్రమ శిక్షణ’ అనే చెత్తని ఆ దేశం తొలగించగలిగిందని మనం గుర్తించాలి.





గొల్లపూడి మారుతీరావు

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top