గురుదక్షిణ ఇలాగేనా?!

గురుదక్షిణ ఇలాగేనా?! - Sakshi


రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గురువులకు ఇది కాని కాలంలా కనబడుతోంది. బోధనలో నిమగ్నం కావలసిన అధ్యాపకులు రోడ్డెక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కాంట్రాక్టు లెక్చెరర్లు నిరవధిక సమ్మె సాగిస్తుండగా, తెలంగాణలో సైతం అదే బాటలో ఉన్నారు. ఈ అధ్యాపకుల కోర్కెలు న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమై నవి. తమ కొలువులకు ముందున్న ‘కాంట్రాక్టు’ పదాన్ని తొలగించి గౌరవ ప్రదమైన బతుకునిమ్మని వీరంతా ప్రాధేయపడుతున్నారు. తమ కుటుంబాలు మెరుగైన జీవనం సాగించడానికి సరిపడా కనీస వేతనం ఇవ్వమని కోరుకుంటు న్నారు.


కడుపు మాడ్చుకుని పాఠాలు చెప్పడం ఇక తమ వల్ల కాదంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఉద్యమంపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం తన వెనకటి గుణాన్ని ప్రదర్శించి అణచివేతకు పూనుకుంది. సమ్మెలో ఉన్నవారందరినీ విధుల నుంచి తొలగిస్తామంటూ బెదిరించడం మొదలుపెట్టింది. ఆ మేరకు నోటీ సులు కూడా జారీ చేయించింది. ‘మా బెదిరింపులకు చాలామంది భయపడ్డారు. కొందరు విధుల్లో కూడా చేరారు’ అని సంబరపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నాలు గైదు రోజులుగా ఆమరణ నిరశనలో ఉన్న అధ్యాపకుల్ని అరెస్టు చేయిస్తోంది. నూతన సంవత్సర ఆగమన వేళ అధ్యాపకుల కుటుంబాలపై పగబట్టినట్టు ప్రవర్తిస్తోంది.


అధ్యాపక వృత్తి సమాజంలో ఎంతో గౌరవప్రదమైనది. వివిధ రంగాలకు మెరి కల్లాంటి ప్రతిభావంతుల్ని అందించే పనిలో నిత్యం నిమగ్నం కావలసిన పవిత్ర మైన వృత్తి అది. ఏపీలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఇలా ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నవారి సంఖ్య దాదాపు 6,000. తెలంగాణ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఇలాంటివారు 4,000మంది ఉన్నారు. గుజరాత్, బిహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అడ్‌హాక్‌ టీచర్ల నియామకంపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ రాష్ట్రాలపై నిప్పులు చెరిగింది. తగిన అర్హతలున్నపక్షంలో నేరుగా ఆ విధంగానే తీసుకోకుండా డొంకదారులు వెదక డానికి ప్రయత్నించడం సిగ్గుగా లేదా అని నిలదీసింది. గురువులకు అరకొర వేతనాలివ్వడానికి తప్ప మీ తెలివితేటలు మరెందుకూ కొరగావా అని ప్రశ్నించింది. నిజానికి ఆ చీవాట్లు ఆ రాష్ట్రాలకు మాత్రమే కాదు.


ఆ బాపతు పనులకే పాల్పడు తున్న ప్రతి ప్రభుత్వానికీ అవి తగులుతాయి. కానీ మన పాలకులకు సిగ్గెక్కడ? ఆ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానిది మరింత హీనమైన చరిత్ర. రెండున్నరేళ్ల క్రితం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదల చేసిన పార్టీ మ్యాని ఫెస్టోలో కాంట్రాక్టు లెక్చెరర్లను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. బాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆందోళన చేస్తున్న అధ్యాపకుల్ని కలిసి వారికి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు సరిగ్గా అందుకు భిన్నమైన చర్యలకు ఒడిగడు తున్నారు. అధ్యాపకులకు బాబు పోకడలు వింతగొలిపి ఉండవచ్చు. ఈ మనిషికి కనీస విలువలైనా ఉండవా అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఏపీలో వివిధ వర్గాలకు ఇప్పటికే అలాంటి అనుభవాలున్నాయి. ఇప్పుడా మ్యానిఫెస్టోను తిరగేస్తే అది ‘దొంగ వాగ్దానాల పద్దు’గా కనబడుతుంది. బాబు వచ్చినా యువతకు జాబు రాలేదు సరిగదా వారికి నిరుద్యోగ భృతి కూడా అందడం లేదు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, చేనేత రుణాల మాఫీ తూ తూ మంత్రంగా సాగింది. సేద్యానికి 9 గంటల విద్యుత్తు, ఆపదలో ఉన్న మహిళలకు 5 నిమిషాల్లో సాయం, బెల్టు షాపుల రద్దు, కాపులకు బీసీ హోదా వంటివన్నీ ఎటో పోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిరుపేద రోగుల కోసం ఎంతో ఆపేక్షతో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారు. ఇన్ని చేసిన వ్యక్తి కాంట్రాక్టు లెక్చెరర్లకిచ్చిన హామీకి ఎగనామం పెట్టడంలో వింతేమీ లేదు.


ఇతర వృత్తులకూ, అధ్యాపక వృత్తికీ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. జీవి తంలో కీలకమైన మలుపులో ఉండే కౌమార దశ పిల్లలతో అధ్యాపకులు వ్యవ హరించాల్సి ఉంటుంది. వారికి వివిధ అంశాల్లో అవగాహన పెంపొందించి భవిష్య త్తుపై భరోసా కల్పించాల్సిన భారం, ఉత్సాహాన్ని దట్టించాల్సిన బాధ్యత వారిదే. తమ భవిష్యత్తు గురించిన బెంగలేనివారే ఆ పని చేయగలరు. అధ్యాపకులు ఒక గంట పాఠం చెప్పాలంటే అందుకు కొన్ని గంటలపాటు శ్రమపడవలసి ఉంటుంది. ఆ పాఠ్యాంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అందుకు సంబంధించిన ఇతరత్రా అంశాలను సైతం పరిశీలించాలి. అప్పుడు మాత్రమే పిల్లలకు సృజనాత్మకంగా బోధించగలరు. అధ్యాపక వృత్తితోనే తమ భవిష్యత్తు ముడిపడి ఉంటుందని నిర్ధారణగా తెలిసినప్పుడే ఎవరైనా అందులో నైపుణ్యాన్ని పెంపొందించుకోగలరు. కానీ కాంట్రాక్టు లెక్చెరర్లు నిత్యం అభద్రతలో ఉంటారు. వారి కొలువు ఎప్పుడైనా పోవచ్చు. జిల్లా సగటు ఉత్తీర్ణతను అందుకోలేకపోయినా... నిర్ణీత సంఖ్యలో విద్యా ర్థులు లేకపోయినా వారి ఉద్యోగాలకు రెన్యువల్‌ ఉండదు.


నెలనెలా ఠంచన్‌గా జీతాలందవు. నెలకో సెలవు మాత్రమే ఉంటుంది. విధి నిర్వహణలో మరణించినా కుటుంబాన్ని ఆదుకొనే దిక్కులేదు. మహిళా లెక్చెరర్ల పరిస్థితి మరింత ఘోరం. వారికి వేతనం లేని ప్రసూతి సెలవు రెండు నెలలిస్తారు. ఆ సెలవు తీసుకుని మరిన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోవాలో... ఉద్యోగానికి వెళ్లి కడుపులో ఉన్న శిశువును అనారోగ్యం బారిన పడేయాలో వారు తేల్చుకోవాలి. ఇంతకన్నా అమానవీయత, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? తమ వలెనే శ్రమిస్తున్న రెగ్యులర్‌ సహోద్యో గులు తమకన్నా అధికంగా వేతనాలనూ, ఇతర భత్యాలనూ పొందుతుంటే... పలు సౌకర్యాలను అనుభవిస్తుంటే తాము మాత్రం శాపగ్రస్తుల్లా క్షణక్షణ గండంగా బతుకీడ్చవలసి రావడం ఎంత విషాదం! బాబు సర్కారు ఇకనైనా కపట నాటకాలు చాలించి కాంట్రాక్టు అధ్యాపకులకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. తమ ప్రభుత్వం వచ్చిననాటినుంచీ వారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా పరిగణించి బాకాయిలను సైతం చెల్లించాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా వివేకంతో ప్రవర్తించి తమ ఉద్యోగుల వెతలు తీర్చాలి.

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top