'హోదా, ప్యాకేజీ ఇవ్వకుంటే ప్రత్యక్ష యుద్ధమే'

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
కడప ఎడ్యుకేషన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుంటే ఈనెల 25 మధ్యాహ్నం నుంచి వామపక్షాలతో కలిసి ప్రత్యక్ష యుద్ధం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. నాయకులను ఎవరిని కూడా ఎక్కడా తిరగనివ్వమని, రాష్ట్రంలో సీఎంతోపాటు కేంద్ర మంత్రులను కూడా పర్యటనలకు అడ్డుకుంటామని చెప్పారు. సీపీఐ ఆధ్వర్యంలో కడప నగరం జెడ్పీ సభా భవనంలో రాయలసీమ సమగ్రాభివృద్ధిపై ఆదివారం రెండో రోజు సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానితో సమావేశం కానున్నారని, ఇందులో రాయలసీమకు న్యాయం జరగకపోతే ప్రత్యక్ష యుద్ధానికి దిగక తప్పదన్నారు. ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వారందరూ రాజకీయ నిరుద్యోగులని బీజేపీ నాయకులు చెబుతున్నారని, మరి గతంలో ప్రత్యేక హోదా గురించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడి సన్మానాలు చేయించుకోలేదా అని ప్రశ్నించారు.