
వెంకయ్యా... ఇకనైనా బుకాయింపు ఆపు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే వ్యవహారం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుకాయించడం సబబు కాదని సీపీఐ ధ్వజమెత్తింది.
- తక్షణమే అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలి
- సీపీఐ కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే వ్యవహారం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుకాయించడం సబబు కాదని సీపీఐ ధ్వజమెత్తింది. విభజన సమయంలో ప్రతిపక్ష నాయకునిగా, తర్వాత కేంద్ర మంత్రి వర్గ సభ్యునిగా ఉన్న తమకీ విషయం కొత్తగా తెలిసిందా? అని నిలదీసింది. రాజధాని అమరావతికి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం వెంకయ్య నాయుడికి సుదీర్ఘ లేఖ రాశారు.
పార్లమెంటులో చర్చ సందర్భంగా పదేళ్ల ప్రత్యేక హోదా కావాలని, రాజధాని నిధులు ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక చట్టం కావాలని పట్టుబట్టిన వ్యక్తే నాలుక మడత వేసి మాట మార్చడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రం రూ.15,200 కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.2,303 కోట్లేనని వివరించారు. విశాఖ రైల్వే జోన్, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటి వాటి ప్రస్తావనే లేకుండా అనుకున్న దాని కంటే ఎక్కువే చేస్తున్నామంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బాధ్యతాయుతమైన కేంద్రమంత్రిగా ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న అన్ని పార్టీలు, సంఘాలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని వెంకయ్యనాయుడికి విజ్ఞప్తి చేశారు.