ఓ లక్ష్యం కోసం కళ్లకు గంతలు కట్టుకొని పరీక్ష | Student writes exam with out seeking for target | Sakshi
Sakshi News home page

ఓ లక్ష్యం కోసం కళ్లకు గంతలు కట్టుకొని పరీక్ష

Sep 27 2015 4:27 AM | Updated on Sep 3 2017 10:01 AM

నగరంలోని ‘శ్రీ రామకృష్ణ మెట్రిక్యులేషన్ హైయ్యర్ సెకండరీ’ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న 12 ఏళ్ల ఆర్. మాధేశ్వరన్..

కోయంబత్తూర్: నగరంలోని ‘శ్రీ రామకృష్ణ మెట్రిక్యులేషన్ హైయ్యర్ సెకండరీ’ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న  12 ఏళ్ల ఆర్. మాధేశ్వరన్ తోటి విద్యార్థులకన్నా భిన్నమైన వాడు. తోటి విద్యార్థుల్లాగానే త్రైమాసిన పరీక్షలు రాయడానికి శుక్రవారం నాడు బడికి వెళ్లాడు. రెండు గంటల నిర్దేశిత కాల వ్యవధిలోనే ఆంగ్ల పరీక్ష పూర్తి చేశాడు. కానీ తోటి విద్యార్థులకు భిన్నంగా.... కళ్లకు గంతలు కట్టుకొని చక, చక ప్రశ్నలన్నింటికి సమాధానాలు రాశాడు. అతను గుడ్డివాడూ కాదు. కంటికి ఎలాంటి దెబ్బ తగల లేదు. ఇచ్చిన ప్రశ్న పత్రం బ్రెయిలీ లిపీలో కూడా లేదు. అందుకని ఆ విద్యారి కళ్లకు గంతలుకట్టుకొని పరీక్ష రాయడం తోటి విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు ఆశ్చర్యం వేసింది.

మాధేశ్వరన్ తనకున్న అసాధారణమైన నైపుణ్యాన్ని నలుగురు ముందు ప్రదర్శించడం కోసం అలా పరీక్ష రాయలేదు. దాని వెనుక అతనికో లక్ష్యం ఉంది. తోటి వారిలో, వీలైనంత వరకు సమాజంలో నేత్ర దానం పట్ల అవగాహన కల్పించేందుకు, చైతన్యం తీసుకరావడానికే అతను అలా పరీక్ష రాశాడు. విద్యార్థి పెద్ద మనసును అర్థం చేసుకున్న ఉపాధ్యాయులు కూడా మాధేశ్వరన్‌ను  ప్రశంసించారు. విద్యార్థి ఫొటోలు తీసి మీడియాకు కూడా విడుదల చేశారు.  తాను కళ్లకు గంతలు కట్టుకొని పరీక్ష రాయడమే కాదని, కళ్లు మూసుకొని పుస్తకాలు చదవగలనని, మొబైల్ ఫోన్‌లో మెస్సేజ్‌లు కూడా చదవగలనని మాధేశ్వరన్ చెప్పాడు. ప్రతి కాగితానికి ఓ వాసన ఉన్నట్టే ప్రతి పదానికి ఓ ప్రత్యేకమైన వాసన ఉంటుందని, అందుకనే తాను చూడకుండానే వాసన ద్వారా పదాలను గుర్తించగలనని తెలిపారు. ‘బ్రెయిన్ ఫోల్డ్ యాక్టివేషన్’ అనే ప్రోగ్రామ్‌కు మాధేశ్వరన్‌ను పంపించామని, అప్పటి నుంచి ఈ అసాధారణ నైపుణ్యం అతనికి వచ్చిందని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. వారి మాటలను నమ్మినా నమ్మకపోయినా, నేత్ర దానం పట్ల సమాజంలో చైతన్యం తీసుకరావాలనే ఆ విద్యార్థి పెద్ద మనసును అర్థం చేసుకుంటో చాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement