
గ్యాంగ్ రేప్ నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష
దళిత మహిళపై సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ఒడిశాలోని బార్ఘర్ జిల్లా కోర్టు జడ్జి గురువారం తీర్పు వెలువరించారు.
భువనేశ్వర్: దళిత మహిళపై సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ఒడిశాలోని బార్ఘర్ జిల్లా కోర్టు జడ్జి గురువారం తీర్పు వెలువరించారు. అలాగే ఒక్కొక్క నిందితునికి రూ. 20 వేల జరిమాన విధించారు. ఓ వేళ నిందితులు జరిమాన కట్టలేకపోతే... మరో రెండేళ్లు జైలు శిక్ష విధించవలసి వస్తుందని తెలిపారు. నిందితుల్లో రాజకీయంగా పలుకుబడి ఉన్న బీజేడీ నాయకుడు మహేష్ అగర్వాల్, రాష్ట్ర మాజీ మంత్రి మేనల్లుడు కునాల్ సింగ్, బీజేడీ మరో నేత బిజయ్ రంజన్ సింగ్లతోపాటు వారికి ముగ్గురు అత్యంత సన్నిహితులు ఉన్నారు.
పిక్మల్ గ్రామంలోని 24 ఏళ్ల దళిత యువతి ప్రభుత్వ ఉద్యోగం కోసం స్థానిక బ్లాక్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడే ఉన్న మహేష్తోపాటు సదరు నాయకులు గోడౌన్లో వివరాలు వెల్లడిస్తామని చెప్పి... ఆమెను అక్కడకు తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... మహిళను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
సదరు మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదిక అందడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ జరిపి కోర్టు ఆరుగురు నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు బీజేడీ ప్రకటించింది.