
ఫ్లాట్లకూ ఆన్‌లైనే!
వీధి వీధి తిరగాల్సిన అవసరం లేదు.
వీధి వీధి తిరగాల్సిన అవసరం లేదు. క్లాసిఫైడ్స్‌ను చూసి ఫోన్లు చేసి కనుక్కోవాల్సిన అవసరమూ అంతకంటే లేదు. ఇప్పుడిక ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లోనే ప్రాపర్టీలను కొనేయొచ్చు మరి. ఇప్పటివరకు తమ ప్రాజెక్ట్‌లు, వెంచర్ల గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే హైదరాబాద్ బిల్డర్లు.. మరో అడుగు ముందుకేసి ఆన్‌లైన్‌లోనే అమ్మేందుకూ సిద్ధమయ్యారు.
- సాక్షి, హైదరాబాద్
హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే మామూలు విషయం కాదు. బిల్డర్ ఎంపిక దగ్గర నుంచి ప్రాజెక్ట్ లొకేషన్, ధరలు, మౌలిక సదుపాయాలు.. ఇలా ఎన్నో విషయాలను పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే స్థిరాస్తులను కొనేముందు కొనుగోలుదారులు 95 శాతం వరకు సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకున్నాకే ముందుకొస్తున్నారన్నారు జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్స్ సీఎండీ రవీందర్ రెడ్డి. అందుకే హౌజింగ్.కామ్‌తో ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకున్నాం. దీంతో హైదరాబాద్‌లోని జనప్రియ సంస్థకు చెందిన ఐదు ప్రాజెక్ట్‌ల్లోని 1,900 ప్రాపర్టీలను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చన్నారు.
రెండు నెలల్లో 200 ఫ్లాట్లు..
దేశంలో గృహాలను విక్రయించడానికి 11 నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని హౌజింగ్.కామ్ సీఎఫ్‌ఓ అజీమ్ జైనుభాయ్ తెలిపారు. హైదరాబాద్‌లో అయితే జనప్రియే తొలి సంస్థ అని చెప్పారు. మరో 4-5 కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. దేశం మొత్తం మీద గత రెండు నెలల్లో 200 గృహాలను విక్రయించామని చెప్పుకొచ్చారు.
ఫ్లాట్లు అమ్మడంతోనే పనైపోదు..
ఆన్‌లైన్ అమ్మకాలతో నిర్మాణ సంస్థలకూ లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఆన్‌లైన్ కొనుగోలుదారులతో సత్సంబంధాలు కొనసాగిస్తే వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా పరిచయాలు పెరుగుతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత మార్కెట్ స్థితిగతులు, నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి అవకాశాలు, మార్కెట్ విధానాల వంటి వాటిని కొనుగోలుదారులతో చర్చించాలి. రోజురోజుకూ తమ ప్రాజెక్ట్, వెంచర్లలో వస్తున్న పురోగతిని ఫొటోల రూపంలో కొనుగోలుదారుల ముందుంచాలి. ఆ ప్రాంత సంస్కృతి, అక్కడి అభివృద్ధిని ఫొటోల రూపంలో చూపించాలి. అప్పుడే ఆయా నిర్మాణ సంస్థలను కొనుగోలుదారులు నమ్ముతారు. తమ కొనుగోలుదారులు ఫేస్‌బుక్, ట్వీటర్‌లలో చేస్తున్న పోస్ట్‌లకు రిప్లై ఇస్తుండాలి. అప్పుడే కొనుగోలుదారులు ఉత్సాహంగా ఉంటారు.
లాభాలెన్నో..
ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని బిల్డర్ ముందుగానే తెలియచేస్తాడు కాబట్టి స్థిరాస్తి రంగంలో పారదర్శకత పెరుగుతుంది.ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ రేటుందన్న విషయమూ కొనుగోలుదారులకు తెలుస్తుంది కాబట్టి బిల్డర్‌కూ తలనొప్పులుండవు. మార్కెటింగ్ కాస్ట్ తక్కువ. కాబట్టి ఆ తగ్గింపు కొనుగోలుదారులకు మళ్లేలా చేయవచ్చు. నిర్మాణ సంస్థల యజమానులతో ఆన్‌లైన్‌లో నేరుగా మాట్లాడే వీలుండటంతో మన అభిరుచులకు తగ్గట్టుగా నిర్మాణం చేసుకోవచ్చు. ఒకే సమయంలో వందల కొద్ది ప్రాజెక్ట్‌లవ వివరాలను తెలుసుకోవచ్చు. దీంతో సమయం, డబ్బు రెండూ ఆదా. ఇతర మెట్రో నగరాల అభివృద్ధి ఎలా ఉందో సులభంగా అర్థవువుతుంది. పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో రెట్టింపవుతుందో లేదో ఇట్టే తెలిసిపోతుంది.