
భాగ్య నగరం మామిడి ప్రియత్వంతో ఉవ్విళ్లూరుతోంది. పండ్ల సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. విభిన్న రకాల మామిడి వెరైటీలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మామిడి విక్రయాల విషయంలో ఆఫ్ లైన్ మార్కెట్‌తో ఆన్‌లైన్ పోటీపడే స్థాయికి చేరుకోవడం ఈ సీజన్ విశేషం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నగర మామిడి మార్కెట్ స్థితిగతుల పై ఓ విశ్లేషణ.... – సాక్షి, సిటీబ్యూరో
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మామిడి పండ్లతో పాటు, హిమాయత్, దాసేరి, బెనిషాన్, అల్ఫోన్సో, రసాలు వంటి రకాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి నగరానికి వస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో అకాల వర్షాలు, ఈదురు గాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను తాకాయి. ఇది నగర ప్రాథమిక మామిడి సరఫరాదారులపై తీవ్ర ప్రభావం చూపింది. హోల్‌సేల్ మార్కెట్‌లను పండని, పక్వానికి రాని పండ్లు ముంచెత్తడానికి కారణమైంది.
ఇదీ చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్‌ప్రైజ్
ధరలు డౌన్.. సేల్స్ అప్..
నగరంలోని మామిడి కేంద్రమైన బాటసింగారం, పీక్ సీజన్‌లో ప్రతిరోజూ 3,000 నుంచి 5,000 క్వింటాళ్ల పండ్ల క్రయవిక్రయాలు నిర్వహిస్తోంది. సగటు ధరలు క్వింటాకు రూ.2,345గా ఉన్నాయి. మరో మార్కెట్ అయిన జాంబాగ్, సీజన్ ప్రారంభ రోజుల్లో 500–800 క్వింటాళ్లు ఏప్రిల్‌లో 1,000–1,500 క్వింటాళ్లు ప్రాసెస్ చేస్తుంది. రిటైల్ మార్కెట్ విషయానికి వస్తే సీజన్ ప్రారంభంలో పండ్ల ధరలు కిలో రూ.200, రూ.400 వరకూ పలికాయి. అయితే రానురానూ తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం మామిడి విక్రయాలు బాగా ఊపందుకున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ధరలు స్థిరంగా ఉన్నాయి. రకాన్ని బట్టి కిలోకు రూ.70 నుంచి రూ.200 వరకూ ఉన్నాయి.

చదవండి: వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదా
పచ్చడి మామిడిదీ అదే దారి..
‘గతానికి భిన్నంగా పచ్చడి, ఇతర అవసరాల కోసం కూడా సిటిజనులు ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తుండడం కనిపిస్తోంది. ‘ఈ సీజన్‌లో పచ్చి మామిడి పండ్ల అమ్మకాలు రోజుకు 30–40 సంచుల నుంచి 20 సంచులకు తగ్గాయి. దీనికి కారణం నగరవాసులు నేరుగా ఆంధ్రాకు వెళ్లి తెచ్చుకోవడమే.. లేకుంటే ఆన్‌లైన్‌లోనే పచ్చళ్లు ఆర్డర్ చేస్తున్నారు’ అని కూకట్‌పల్లి రైతుబజార్‌లో పండ్ల దుకాణం యజమాని పవన్ చెబుతున్నారు. ఊరగాయల కోసం టాంజీ, తెల్లగులాబి, షెల్ఫ్ లైఫ్ కోసం కొత్తపల్లి కొబ్బరి, సీజన్ చివరి రుచి కోసం జలాలు.. వంటివన్నీ నూజివీడు, కాకినాడ, విజయవాడ నుంచి వస్తాయి.

ఆర్గానిక్.. ఆన్‌లైన్‌లో క్లిక్..
కృత్రిమంగా పండించడం గురించిన ఆందోళనలు నగరవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇది కొత్త కొత్త విక్రయ మార్గాలను తెరుస్తోంది. అదే క్రమంలో పొలం నుంచి నేరుగా ఇంటికి వచ్చే ప్రత్యామ్నాయాలను ఇష్టపడే వినియోగదారులు కూడా పుట్టుకొచ్చారు. పెరిగిన డిమాండ్‌తో రిటైల్ దుకాణాలు సేంద్రీయ బంగినపల్లి రకాన్ని కిలోకు రూ.150 నుంచి రూ.400 చొప్పున విక్రయిస్తుండగా ఆన్‌లైన్‌లో అంతకన్నా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఆన్‌లైన్ స్టోర్ నడుపుతున్న రాఘవేంద్ర, తాను 2011లో ఆన్‌లైన్‌లో మామిడి పండ్లను అమ్మడం ప్రారంభించానని అంటున్నారు. ఆయన సదాశివపేట, షామిర్‌పేట నుంచి మామిడి పండ్లను సేకరించి నగరంలోని ఇళ్లకు డెలివరీ చేస్తున్నాడు. ఇతర నగరాలకు ఆర్డర్‌లు కార్గో బస్సుల ద్వారా సరఫరా చేస్తున్నాడు. ‘ఆన్‌లైన్ సేవలు విశ్వసించగల సురక్షితమైన, సేంద్రీయ పండ్లను అందిస్తాయి’ అని అత్తాపూర్‌కు చెందిన కస్టమర్ తహ్సీన్ ఫర్హా అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ మార్కెట్ ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం. ప్రస్తుతం సామాన్యులకు సైతం ప్రత్యేకమైన పండూరి వంటి తక్కువ–తెలిసిన రకాలను కూడా అందిస్తోంది.