వడ్డీరేట్లు పైపైకే..? | Reserve Bank of India policy review to day | Sakshi
Sakshi News home page

వడ్డీరేట్లు పైపైకే..?

Dec 18 2013 1:05 AM | Updated on Sep 2 2017 1:42 AM

వడ్డీరేట్లు పైపైకే..?

వడ్డీరేట్లు పైపైకే..?

ఆహార వస్తువులు, ఇతరత్రా నిత్యావసరాల ధరలు చుక్కలు చూపుతున్న తరుణంలో... రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఏంచేస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 న్యూఢిల్లీ: ఆహార వస్తువులు, ఇతరత్రా నిత్యావసరాల ధరలు చుక్కలు చూపుతున్న తరుణంలో... రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఏంచేస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నేడు(బుధవారం) చేపట్టనున్న మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో ధరల కట్టడిపైనే ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పూర్తిగా దృష్టిపెట్టే అవకాశం ఉందని నిపుణులు అం టున్నారు. పాలసీ వడ్డీరేట్లు మరోవిడత పెంచడం ఖాయమనేది వారి అభిప్రాయం. ఇదే జరిగితే ఆర్‌బీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి రాజన్ వరుసగా మూడోవిడత రేట్లను పెంచినట్లవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ సమీక్షల్లో పావు శాతం చొప్పున రెపో రేటును పెంచడం తెలిసిందే. ధరల పెరుగుదల ఒత్తిడి అంతకంతకూ తీవ్రతరమవుతుండటంతో నేటి పాలసీ సమీక్షలో మరో పావు శాతం రెపో పెంపు తప్పకపోవచ్చని క్రిసిల్ పేర్కొంది. ప్రస్తుతం రెపో రేటు 7.75%, రివర్స్ రెపో 6.75%, నగదు నిల్వల నిష్పతి(సీఆర్‌ఆర్) 4% చొప్పున కొనసాగుతున్నాయి.
 
 వణికిస్తున్న ధరలు...
 నవంబర్ నెలలో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 14 నెలల గరిష్టానికి(7.52%) ఎగబాకడం తెలిసిందే. ప్రధానంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతరత్రా కూరగాయల రేట్లు దూసుకెళ్లడమే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇదే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 9 నెలల గరిష్టమైన 11.24 శాతానికి ఎగబాకింది. ఇదిలాఉండగా... పారిశ్రామిక రంగం మాత్రం కుదేలవుతోంది. అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి ఉత్పాదకత తిరోగమనంలోకి జారిపోయి మైనస్ 1.8% క్షీణించింది. దీనంతటికీ అధిక వడ్డీరేట్ల భారమే కారణమని, ఇప్పటికైనా ఆర్‌బీఐ రేట్లను తగ్గించి ఉపశమనం కల్పించాలంటూ కార్పొరేట్ వర్గాలు లబోదిబోమంటున్నాయి. అయితే, పరిశ్రమలు అల్లాడుతున్నా.. ఆర్‌బీఐ మాత్రం ప్రస్తుతానికి ధరలకు కళ్లెం వేసేందుకే మొగ్గుచూపుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంటోంది.
 
 అర శాతం పెంపునకూ అవకాశం...!
 బ్యాంకింగ్ వర్గాల్లో సైతం మెజారిటీ అభిప్రాయం రేట్ల పెంపు ఖామమనే వ్యక్తమవుతోంది. పావు శాతం పాలసీ రేట్ల పెంపునకు అత్యధికంగా అవకాశాలున్నాయని.. అయితే, అర శాతం పెంపునూ కొట్టిపారేయలేమని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ సౌగత భట్టాచార్య పేర్కొన్నారు. కాగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) సీఎండీ ఎం. నరేంద్ర మాత్రం ఆర్‌బీఐ ప్రస్తుత పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు.  హెచ్‌ఎస్‌బీసీ,  బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ సైతం పావు శాతం రెపో రేటు పెంపు ఉంటుందని పేర్కొన్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement