
స్వర్ణాభరణాల దిగుమతులు పెరిగాయ్
బంగారు ఆభరణాల దిగుమతులు గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ కాలానికి 20 టన్నులకు పైగా ఉన్నట్లు బాంబే బులియన్ అసోసియేషన్ తెలియజేసింది.
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల దిగుమతులు గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ కాలానికి 20 టన్నులకు పైగా ఉన్నట్లు బాంబే బులియన్ అసోసియేషన్ తెలియజేసింది. గతేడాది ఇదే కాలంలో దిగుమతులు అస్సలే లేవని, మరోవంక బంగారు కడ్డీలు, నాణాల దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ ఈ స్థాయిలో దిగుమతులు పెరగడం విశేషమని బాంబే బులియన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సురేష్ హుండియా వ్యాఖ్యానించారు.
రానున్న నెలల్లో బంగారు ఆభరణాలు దిగుమతులు మరింతగా పెరుగుతాయని చెప్పారు. పుత్తడిపై ప్రభుత్వ ఆంక్షల వల్ల బంగారం దిగుమతులు కష్టంగా ఉన్నాయని, ఆభరణాల తయారీదారులు పుత్తడి కొరతను ఎదుర్కొంటున్నారని ఆయన తెలియజేశారు. ‘‘దేశీయ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి ఆభరణాల వ్యాపారులు యునెటైట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి బంగారు ఆభరణాలను దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని భారతీయుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి విక్రయిస్తున్నారు’’ అని తెలియజేశారు.