ఏ1 క్యాటగిరీలోని 75 స్టేషన్లకు డైరెక్టర్లను నియమిస్తామని రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ చెప్పారు.
న్యూఢిల్లీ: దేశంలోని 7,112 రైల్వే స్టేషన్లలో ఏ1 క్యాటగిరీలో చోటు పొందిన 75 స్టేషన్లకు డైరెక్టర్ల నియామకాలపై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. ఈ అంశంపై వైఎస్సార్ సీపీ ఎంపీ(రాజ్యసభ) వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహైన్ బుధవారం పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి స్టేషన్లతోపాటు తెలంగాణలోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లు ఏ1 క్యాటగిరీలో ఉన్నాయని, వీటిలో సికింద్రాబాద్ స్టేషన్‌కు డైరెక్టర్ నియామకం ఇప్పటికే పూర్తయిందని, మిగిలిన చోట్లా త్వరితగతిన నియామకాలు చేపడతామని మంత్రి రాజెన్ వివరించారు. ఆయా రైల్వే స్టేషన్లలో బుకింగ్ కౌంటర్లు, రైళ్ల రాకపోకలు, స్టేషన్ భద్రత, పరిశుభ్రత, ప్రచారం తదితర వ్యవహారాలన్నీ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని, తద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు. అయితే అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని స్టేషన్ డైరెక్టర్లను నియమిస్తామేతప్ప, ఈ పోస్టు కోసం అదనపు ఖర్చు పెట్టేఉద్దేశం రైల్వే శాఖకు లేదని మంత్రి రాజెన్ తెలిపారు.