
మోడీ భద్రతకు రాజకీయ రంగు!
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భద్రత అంశం రాజకీయ రంగు పులుముకుంది. కేంద్రం, బీజేపీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి.
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ భద్రత అంశం రాజకీయ రంగు పులుముకుంది. కేంద్రం, బీజేపీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. మోడీని హత్య చేసేందుకే పాట్నాలో పేలుళ్లకు పాల్పడ్డారని, ఆయన భద్రతను మరింత పెంచాలని బీజేపీ డిమాండ్ చేయగా.. గుజరాత్ సీఎంకు ఇప్పటికే అవసరమైన భద్రత కల్పిస్తున్నామని, ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) భద్రత ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టంచేసింది. మోడీకి ఎస్పీజీ భద్రత కల్పించాలన్న బీజేపీ డిమాండ్‌ను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే తోసిపుచ్చారు. చట్టాలకు అనుగుణంగానే ఈ భద్రత కల్పించడం జరుగుతుందన్నారు.
పశ్చిమబెంగాల్‌లోని పెట్రాపోలెలో బుధవారం జరిగిన కార్యక్రమంలో షిండే మాట్లాడుతూ, మోడీకి ఇప్పటికే ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పిస్తున్నామన్నారు. కాగా పాట్నా పేలుళ్లకు కేంద్రం, నితీశ్‌కుమార్ ప్రభుత్వాలదే బాధ్యత అని బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. పాట్నా సభకు సరైన భద్రత కల్పించలేదని విమర్శించారు. కాగా, మోడీకి ఇప్పటికే ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పిస్తున్నామని, ఆయనకు ఎస్పీజీ భద్రత ఇవ్వడం కుదరదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్‌పీఎన్ సింగ్ తెలిపారు. ‘మోడీ ఎక్కడకు వెళ్లినా ఆ ప్రాంతంలో ముందస్తు భద్రత డ్రిల్ చేపట్టాలని ఆదేశించాం. ఆయనకున్న ముప్పు తీవ్రత బట్టే భద్రత ఇస్తున్నాం’ అని చెప్పారు. చట్ట ప్రకారం ప్రధాని, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంటుందన్నారు.
రాజీవ్ భద్రతపై సింగ్ పొరపాటు
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ భద్రత అంశంలో బీజేపీపై ఆర్‌పీఎన్ సింగ్ పొరపాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలో ఉండగా, రాజీవ్ భద్రత విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించిందని, కనీసం సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి భద్రత కూడా కల్పించలేదని విమర్శించారు. దీంతో 1991 మేలో తమిళనాడులో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ ప్రాణాలు కోల్పోయారన్నారు. అయితే, రాజీవ్ హత్య సమయంలో చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నారు. జనతాదళ్(ఎస్) అధినేత అయిన చంద్రశేఖర్.. కాంగ్రెస్ మద్దతుతో 1990 నవంబర్ 10న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత రాజీవ్‌గాంధీ మద్దతు ఉపసంహరించుకోవడంతో 1991 మార్చి 6న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికలు రావడంతో 1991 జూన్ 21 వరకు చంద్రశేఖర్ ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు. అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉంది.