ఫోన్ ట్యాపింగే పెద్ద నేరమా? | Sakshi
Sakshi News home page

ఫోన్ ట్యాపింగే పెద్ద నేరమా?

Published Thu, Jun 11 2015 2:10 PM

ఫోన్ ట్యాపింగే పెద్ద నేరమా?

న్యూఢిల్లీ: అవినీతికన్నా ఫోన్ ట్యాపింగ్ అతి పెద్ద నేరం అన్నట్టుగా ‘నోటుకు ఓటు’ కుంభకోణంలో అడ్డంగా దొరికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడుతున్నారు. కుంభకోణంలో రేవంత్ నిర్వహించిన పాత్ర గురించి, ఆయన ‘బాస్’ అన్న సంబోధన ఎవరి గురించంటూ ఎవరు, ఎన్ని ప్రశ్నలడిగిన పాడిందే పాటరా... చందంగా ‘నా ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం వీరికి ఎవరిచ్చారు ? వీళ్ల అంతుచూస్తా’ అని అంటున్నారే తప్పా సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. ఆ ఫోన్‌లో వినిపించిన ‘వాయిస్’ మీదేనా మహాప్రభో! అంటూ విసిగెత్తి విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

మరో పక్క ఫోన్ ట్యాపింగ్ తాము చేయలేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు వివరించినా పట్టించుకోవడం లేదు. తర్కం కోసం చంద్రబాబు ఫోన్‌ను కేసీఆర్ ట్యాపింగ్ చేయించారనుకుందాం.. అప్పుడు చంద్రబాబు ఏం చేయాలి? చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఫోన్ ట్యాపింగ్‌ను భారతీయ చట్టాలు ఎలా నిర్వచిస్తున్నాయి? నిజంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వ్యక్తి లేదా ప్రభుత్వానికి చట్టంలో ఎలాంటి శిక్షలు విధించే అవకాశం ఉంది ? అన్న ప్రశ్నలకు సమాధానం వెతకాలిగదా! ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం భారతీయ టెలిగ్రాఫ్ చట్టం పరిధిలోకి వస్తోంది.

దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమత్వానికి, ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తున్నారనే అనుమానం కలిగిన సందర్భాల్లో మాత్రమే ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేయవచ్చంటూ 1885 నాటి భారత టెలిగ్రాఫిక్ చట్టం నిర్ధేశిస్తోంది. దేశ స్వాతంత్య్రానంతరం 1951లో మొదటి సారి ఈ చట్టంలో కొన్ని సవరణలు వచ్చాయి. ఆ తర్వాత టైస్టులు, పొరుగు దేశాల నుంచి దేశ భద్రతకు ముప్పు వాటిల్లిన సందర్భాల్లో 1971లో మళ్లీ ఈ చట్టాన్ని సవరించారు. ఆ తర్వాత పలు ఆర్థిక నేరాలు వెలుగులోకి రావడం, పార్లమెంట్‌లో ‘నోటుకు ఓటు’ కుంభకోణాలు బయటపడడం, తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ అజిత్ జోగి లాంటి నాయకులు మీడియా ముందు దుమారం సృష్టించడం, కాలక్రమంలో మరికొంత మంది ప్రతిపక్ష నాయకులు పాలకపక్షంపై ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు సంధించడం, ఫోన్ ట్యాపింగ్ పేరిట వ్యక్తిగ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ ప్రజా హక్కుల సంఘాలు సుప్రీం కోర్టుదాకా వెళ్లడం తదితర పరిణామాల కారణంగా 2008, 2009, 2011 సంవత్సరాల్లో ఈ చట్టాల్లో మరికొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం టైస్టు, ఆర్థిక, రాజకీయ నేరాలకు సంబంధించిన కేసుల్లో సాక్షాధారాల సేకరణకు ముందస్తు అనుమతితో  ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసే అధికారం సంబంధిత కేసు దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి ఉంది. కేసు విచారణలో భాగంగా హైకోర్టు లేదా సుప్రీం కోర్టు అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. కేంద్ర లేదా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ కోసం ఓ సమీక్ష కమిటీని కూడా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్ చేయాలనుకుంటే రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతితో సంబంధిత దర్యాప్తు సంస్థలు ట్యాప్ చేయవచ్చు. కేసీఆర్ అది కూడా చేయలేదంటున్నారు.

ఇలాంటి సందర్భంలో మరి చంద్రబాబు ఏం చేయాలి? భారత టెలిగ్రాప్ చట్టంలోని సెక్షన్ 26(బీ) ప్రకారం సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి అక్రమంగా తన ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు చేయాలి. ఈ సెక్షన్ కింద దోషులకు గరిష్టంగా మూడేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది. ఓ కేసులో నిందితులుగా భావించి వారికి సంబంధించిన ఫోన్ సంభాషణల సమాచారాన్ని కాల్ ప్రొఫైడర్లు, కంపెనీలు దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వని పక్షంలో ఇదే చట్ట ప్రకారం కాల్ ప్రొఫైడర్లకు, కంపెనీలకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం  ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement