స్మో'కింగ్'లు... శతకోటి! | One billion smokers in the world now: study | Sakshi
Sakshi News home page

స్మో'కింగ్'లు... శతకోటి!

May 16 2015 9:30 AM | Updated on Aug 17 2018 7:48 PM

స్మో'కింగ్'లు... శతకోటి! - Sakshi

స్మో'కింగ్'లు... శతకోటి!

సరదా సరదా సిగరెట్టు... అంటూ తెగ ఊదిపారేస్తున్నారు పొగరాయుళ్లు. కేన్సర్ వస్తుందని భయపెట్టినా డొంట్ కేర్ అంటున్నారు.

(సాక్షి వెబ్ ప్రత్యేకం)

సరదా సరదా సిగరెట్టు... అంటూ తెగ ఊదిపారేస్తున్నారు పొగరాయుళ్లు. కేన్సర్ వస్తుందని భయపెట్టినా డోంట్ కేర్ అంటున్నారు. లంగ్స్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని బెదిరించినా బేఫికర్ గా ధూమపానం చేసేస్తున్నారు. 'డేంబర్ సింబల్'తో హెచ్చరించినా పొగ మేఘాల సృష్టికర్తలకు బోధపడడం లేదు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పొగబాబుల సంఖ్య శతకోటికి చేరింది. ప్రపంచ వయోజన జనాభాలో 20 శాతంపైగా ధూమపానం చేస్తున్నారన్న దిగ్భ్రాంతికర వాస్తవాన్ని ప్రపంచ మత్తుపదార్థాల బానిసల నివేదిక-2014 వెల్లడించింది. దీని ప్రకారం వరల్డ్ వైడ్ ధూమపాన ప్రియుల సంఖ్య అక్షరాల 100 కోట్లు!

పొగరాయుళ్లకు తామేమి తీసిపోమని 'చుక్క'బాబులు చాటుతున్నారు. ప్రపంచంలో 24 కోట్ల మంది మందుబాబులు 'చుక్క' పడనిందే నిద్రపోరట. మద్యపానంతో జీవితం మధ్యలో ముగిసిపోతుందన్న పరిశోధకుల హెచ్చరికలు మందుబాబుల చెవికెక్కడం లేదు. 'మందు' వాడకంలో తూర్పు యూరప్ వాసులు అందరికంటే ముందున్నారు. ఒక్కొక్కరు ఏడాదికి సగటున 13.6 లీటర్ల లీక్కర్ గుటకాయ స్వాహా చేసేస్తున్నారు. 11.5 లీటర్ల వాడకంతో ఉత్తర యూరప్ వాసులు రెండో స్థానంలో ఉన్నారు. మధ్య, దక్షిణ, పశ్చిమాసియా మద్యపాన ప్రియులు కేవలం 2.1 లీటర్లతోనే గొంతు తడుపుకుంటున్నారు. ధూమపానంలోనూ తూర్పు యూరప్ దూసుకుపోతోంది. 30 శాతం స్మోకర్స్ తో ఫస్ట్ లో ఉంది. ఆసియాలో 29.5 శాతం, పశ్చిమ యూరప్ లో 28.5, ఆఫ్రికాలో 14 శాతం మంది స్మో'కింగ్'లున్నారు.

ధూమపానం, మద్యపానానికి తోడు మత్తుపదార్థాల్లో మునిగితేలుతున్న వారు కోట్ల సంఖ్యలో ఉండడం కలవరం కలిగిస్తోంది. హెరాయిన్, గంజాయి వంటి నిషేధిత మత్తుపదార్ధాలు సేవిస్తూ మరోలోకంలో విహరిస్తున్న డ్రగ్ అడిక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 కోట్ల మంది ఉన్నారు. ఉత్తర, మధ్య అమెరికా, కరేబియన్ దేశాల్లో 0.8 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ విషయంలో తూర్పు యూరప్(0.3 శాతం)  వెనుకబడివుంది. స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ పై తాజా గణంకాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. యువ శక్తిని నిర్వీర్యం చేస్తూ సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్న నిషేధిత మత్తు పదార్ధాల అడ్డుకట్ట విషయంలో ప్రపంచ దేశాలు తమ కార్యాచరణకు కోరలు తొడగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాటిచెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement