పన్నీర్‌ మైండ్‌ గేమ్‌ షురూ.. | O.Panneerselvam mindgame aginst Sasikala | Sakshi
Sakshi News home page

పన్నీర్‌ మైండ్‌ గేమ్‌ షురూ..

Feb 12 2017 3:14 AM | Updated on Sep 5 2017 3:28 AM

పన్నీర్‌ మైండ్‌ గేమ్‌ షురూ..

పన్నీర్‌ మైండ్‌ గేమ్‌ షురూ..

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చిన్నమ్మ శశికళ వర్గాన్ని విచ్చిన్నం చేయడానికి శనివారం నుంచి తన మైండ్‌గేమ్‌ వేగం పెంచారు.

- సెల్వం శిబిరానికి మంత్రి, నలుగురు ఎంపీలు సహా పలువురు మాజీలు, పార్టీ ముఖ్యనేతలు
- నష్ట నివారణకు నేరుగా రంగంలోకి దిగిన చిన్నమ్మ
- పన్నీర్‌ ఇంటికి చేరిన అన్నాడీఎంకే వ్యవస్థాపక నాయకుడు పొన్నయ్యన్‌


చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
తమిళ ప్రజలు, సినీ ప్రముఖులు, ప్రతిపక్ష పార్టీల మద్దతు, కేంద్ర ప్రభుత్వం అండతో ఊపు మీదున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చిన్నమ్మ శశికళ వర్గాన్ని విచ్చిన్నం చేయడానికి శనివారం నుంచి తన మైండ్‌గేమ్‌ వేగం పెంచారు. కేంద్రప్రభుత్వం, గవర్నర్‌ తనకే మద్దతుగా ఉన్నారనే సంకేతాలు పంపుతూ శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేల్లో గందరగోళం సృష్టించగలిగారు. మంత్రి పాండియరాజన్, ఎంపీలు టీఆర్‌ సుందరం, అశోక్‌కుమార్, సత్యభామ, వనరోజాలతోపాటు పలువురు పార్టీ ముఖ్యులను తన వైపునకు రప్పించుకోగలిగారు.

శశికళ నివాసం ఉంటున్న జయలలిత ఇంటిని అమ్మ స్మారక భవనంగా మార్చేందుకు సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. తమిళనాడుకు కేంద్ర బలగాలు రాబోతున్నాయని కార్యకర్తల సమావేశంలో ప్రకటించి ప్రత్యర్థి శిబిరంలో మరింత ఆందోళన కలిగించారు. తాజా పరిణామాలపై శశికళ పోయెస్‌ గార్డెన్‌లో పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. శిబిరంలోని ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఆ సమావేశం ముగియగానే అక్కడినుంచి ఐదుగురు మంత్రులు, ఒక ఎమ్మెల్యే కనిపించకుండా పోవడం వారికి ఆందోళన కలిగిస్తోంది.

మధుసూదనన్‌ మంత్రాంగం
అన్నాడీఎంకే వ్యవస్థాగత వ్యవహారాలు, కార్యకర్తలు, నాయకుల బలాబలాలపై లోతైన అవగాహన ఉన్న పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ను అనూహ్యంగా తన వైపునకు తిప్పుకోవడంతో పన్నీర్‌కు పెద్ద అండ దొరికింది. పార్టీలో ముఖ్యులు ఎవరిని ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే విషయాలు బాగా తెలిసిన మధుసూదనన్‌ పార్టీ కేడర్‌ను పన్నీర్‌ శిబిరంలోకి తేవడంలో నిమగ్నమయ్యారు. విస్తృతమైన తన సంబంధాలు, అవగాహనతో శనివారంనాటికి పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి సి.పొన్నయ్యన్‌తోపాటు ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా శాఖల ముఖ్యులను పన్నీర్‌ శిబిరానికి చేర్చారు. పార్టీ బైలా ప్రకారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికే చెల్లదని ఆయన ప్రకటించి పార్టీ శ్రేణుల్లో ఆలోచన రేకెత్తించగలిగారు.

శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు పన్నీర్‌ వైపునకు రావాలని వారి నియోజకవర్గ ప్రజలు, కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి చేయిస్తున్నారు. చిన్నమ్మ ఇక సీఎం కావడం జరగదు అనే ప్రచారాన్ని ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి విస్తృతంగా పంపగలిగారు. జయలలిత కుటుంబం మద్దతు పన్నీర్‌కే ఉందని చూపించడానికి ఆయన మద్దతుదారులు జయలలిత, పన్నీర్‌సెల్వం, దీపా జయకుమార్‌ ఫొటోలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాల్‌ పోస్టర్లు అంటించారు. ఈ నెల 24వ తేదీ జయలలిత జయంతి సందర్భంగా దీపా జయకుమార్‌ పన్నీర్‌ సెల్వంకు తన మద్దతు తెలుపుతారని ఇరు వర్గాల మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు జయలలితతో కలిసి చెన్నై చర్చ్‌పార్కు స్కూల్లో చదువుకున్న మిత్రులు ముగ్గురు పన్నీర్‌కు మద్దతు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement