
యోగి హెయిర్‌కట్ ఉంటేనే రండి!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఒక పాఠశాల అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శలపాలైంది.
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఒక పాఠశాల అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శలపాలైంది. విద్యార్థులందరూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లా గుండు కొట్టించుకుని రావాలని అనుసరించాలని ఆదేశించింది. ఒకటి నుంచి 12 తరగతి విద్యార్థులందరికీ సీఎం యోగి తరహాలో హెయిర్ కట్ ఉండాలని రిషభ్ అకాడమీ ఆఫ్ కో-ఎడ్యుకేషనల్ ఇంగ్లీషు మీడియం స్కూలు పేర్కొనడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది మదర్సా కాదని పేర్కొంటూ విద్యార్థులు గడ్డాలు పెంచుకుని రాకూడదని, నమాజ్ చేసుకోవడానికి దుప్పట్లు తీసుకురాదని ఆంక్షలు విధించింది.
అక్కడితో ఆగకుండా విద్యార్థుల తిండిపై కూడా నియంత్రణలు పెట్టింది. మాంసాహారం తెచ్చుకోరాదని ఆదేశించింది. లింగ వివక్షను ప్రోత్సహించే విధంగా బాలురు, బాలికలను విడివిడిగా కూర్చొబెట్టింది. ‘లవ్ జిహాద్’ను నియంత్రించేందుకే బాలబాలికలను వేర్వేరుగా కూర్చొబెడుతున్నామని పాఠశాల యాజమాన్య కమిటీ కార్యదర్శి రంజీత్ జైన్ తెలిపారు. జైన్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న తమ పాఠశాలలో కోడి గుడ్డు కూడా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనలపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.