ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు

ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు




 ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో షిండే  

విభజనకు రెండు మూడు నెలలు

 

 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు మరింత సమయం పట్టే అవకాశముందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరగవచ్చని ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘‘విభజన ప్రక్రియ పూర్తవడానికి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ మాదిరిగా కనీసం మరో రెండు లేదా మూడు నెలలు పట్టవచ్చు. సాధారణ ఎన్నికలు ఆలోపే వస్తున్నందున అవి ఉమ్మడి రాష్ట్రంలోనే జరగవచ్చు’’ అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా లోక్‌సభతో పాటే ఎన్నికలున్న విషయాన్ని ప్రస్తావించగా, అవి కూడా సమైక్య రాష్ట్రంలోనే జరగవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమన్నారు. విభజన ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని ప్రధాని చెప్పారని గుర్తు చేయగా, అది కొంత సమయం తీసుకుంటుందని షిండే అన్నారు. ‘‘కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాల్సిన ఆర్థిక సాయంపై అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే ఇందుకు డిమాండ్ చేసింది. కాబట్టి అధ్యయనం జరగాలి’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధింపుపై ఇప్పటికైతే స్పష్టత లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే అందుకు వున్న అవకాశాలను పార్టీ పరిశీలిస్తుందన్నారు. తదుపరి సీఎం ఎవరని ప్రశ్నించగా.. దానిపై తనెలాంటి అభిప్రాయాలూ లేవని, పార్టీయే నిర్ణయిస్తుందని బదులిచ్చారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top