గవర్నర్ను డమ్మీగా ఉండాలంటున్నారు! | leftinent governer kiran bedi comments | Sakshi
Sakshi News home page

గవర్నర్ను డమ్మీగా ఉండాలంటున్నారు!

Jan 10 2017 8:52 PM | Updated on Sep 5 2017 12:55 AM

గవర్నర్ను డమ్మీగా ఉండాలంటున్నారు!

గవర్నర్ను డమ్మీగా ఉండాలంటున్నారు!

పుదుచ్చేరి ప్రభుత్వం తానొక డమ్మీగా ఉండాలని కోరుకుంటోందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌: పుదుచ్చేరి ప్రభుత్వం తానొక డమ్మీగా ఉండాలని కోరుకుంటోందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారాయణసామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కిరణ్‌ బేడీకి విభేదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన విధులు, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేందుకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 35వ ఆలిండియా పోలీస్‌ ఈక్వెష్ట్రియన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.

వచ్చే మే 29వ తేదీన పదవి నుంచి వైదొలగనున్నట్లు గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఒక లక్ష్యం కోసం పదవిని చేపట్టానని, పదవీకాలం ముగిసేవరకు ఉండాలని అనుకోవటం లేదని ఆమె చెప్పారు. ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మెమోరాండం ఇచ్చిన తర్వాతి రోజే ఆమె రిటైర్మెంట్‌ ప్రకటన చేశారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ రెండేళ్లపాటు మాత్రమే ఉండాలని మొదటే అనుకున్నానని చెప్పారు. అవినీతి, నేర నిర్మూలన కోసం పలు చర్యలు తీసుకున్నానని తెలిపారు. స్వచ్ఛ పుదుచ్చేరి లక్ష్యంగా తాను చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని ఆరోపించారు. పుదుచ్చేరి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దాని నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని కిరణ్‌ బేడి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement