ప్రధాని మోదీ దిగిపోయేవరకు అరగుండే.. | Kerala fast food vendor, shaves off half head, | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ దిగిపోయేవరకు అరగుండే..

Nov 28 2016 1:00 PM | Updated on Aug 15 2018 6:34 PM

ప్రధాని మోదీ దిగిపోయేవరకు అరగుండే.. - Sakshi

ప్రధాని మోదీ దిగిపోయేవరకు అరగుండే..

ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేరళకు చెందిన ఓ ఛాయ్‌ వాలా ఆయనపై శపథం చేశాడు.

తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేరళకు చెందిన ఓ ఛాయ్‌ వాలా ఆయనపై శపథం చేశాడు. మోదీ నిర్ణయాన్ని నిరసిస్తూ ఛాయ్‌ వాలా అర గుండు చేయంచుకున్నాడు. ప్రధాని పదవి నుంచి మోదీ దిగిపోయే వరకు అరగుండుతోనే ఉంటానని, అప్పటి వరకు వెంట్రుకలు పెంచనని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతకుముందు బట్టతలతో కొద్దిపాటి వెంట్రుకలతో కనిపించిన ఈ ఛాయ్‌ వాలా ఇప్పుడు అరగుండుతో వార్తల్లో నిలిచాడు.

కస్టమర్లు యహక్కక అని పిలుచుకునే 70 ఏళ్ల యహియా చిన్న హోటల్‌, టీ కొట్టు నడుపుతున్నాడు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తాను పడ్డ బాధలను ఏకరవు పెట్టాడు. కేరళ యూనివర్శిటీ అసిస్టెంట్‌ ప్రొఫెషర్‌ డాక్టర్‌ అష్రాఫ్‌ కాదక్కల్‌.. యహియా ఫొటోలను, ఆయన బాధలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

‘నా పేరు యహియా. సన్నిహితులు యహి అని, కస్టమర్లు యహక్కక అని పిలుస్తారు. నా వయసు 70 ఏళ్లు. మా సొంతూరు కొల్లాం జిల్లాలోని కొడక్కల్‌ ముక్కున్నమ్‌. నాకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేను చదవుకోలేదు. పేదవాడ్ని. కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేశా. గల్ఫ్‌ కూడా వెళ్లొచ్చా. చివరకు చిన్న హోటల్‌, టీకొట్టు పెట్టుకున్నా. కుమార్తె పెళ్లి కోసం చాలా కష్టపడ్డా. బ్యాంకు లోన్‌ తీసుకుని, చేతిలో ఉన్న కొంత డబ్బుతో పెళ్లి జరిపించాను. హోటల్‌లో మొత్తం పనిని నేనే చేస్తాను. వండటం నుంచి సర్వ్‌ చేయడం, క్లీన్‌ చేయడం నా పనే. అందుకే నేను నైటీ వేసుకుంటా. 500, 1000 రూపాయల నోట్లను ప్రధాని మోదీ రద్దు చేశారని తెలిసి షాకయ్యాను. కష్టపడి దాచుకున్న డబ్బు 23 వేల రూపాయలు ఉంది. అన్ని పెద్ద నోట్లు. వీటిని మార్చుకునేందుకు బ్యాంకుల ముందు రెండు రోజులు క్యూలో నిల్చున్నా. రెండో రోజు బీపీ తగ్గిపోయి కూలబడ్డాను. కొందరు దయగల వ్యక్తులు సాయం చేసి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కో ఆపరేటివ్‌ బ్యాంకులో లోన్‌ తీసుకున్నా, నాకు బ్యాంకు ఖాతా లేదు. దీంతో పాతనోట్లను ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు. ఎన్ని రోజులు బ్యాంకుల ముందు క్యూలో నిల్చోవాలి? పగలు రాత్రి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇది. నా డబ్బు చెల్లకుండా పోయింది. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత 23 వేల రూపాయల నోట్లను అన్నింటినీ కాల్చివేశాను. వెంటనే దగ్గరలోని బార్బర్‌ షాప్‌కు వెళ్లి బట్టతలను సగం గుండు చేయించుకున్నా. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బును బూడిదపాలు అయ్యేలా చేసిన ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోయేవరకు ఇలాగే ఉంటా. మోదీ గద్దె దిగిన తర్వాతే వెంట్రుకలను పూర్తిగా పెంచుతా. ఇది నా నిరసన. ప్రతిజ్ఞ’ అని యహియా తన ఆవేదన తెలియజేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement