
అమలకు ‘నారీ శక్తి’ పురస్కారాన్ని అందిస్తున్న ప్రణబ్
మహిళలపై పెరుగుతున్న నేరాలపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు.
అక్కినేని అమలకు నారీశక్తి పురస్కారం
న్యూఢిల్లీ: మహిళలపై పెరుగుతున్న నేరాలపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. వారికి భద్రత కల్పించకపోవడం క్షమార్హం కాదని, ఆధునిక భారతంలో లింగవివక్షకు చోటులేదని స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ఆయన.. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు ‘నారీశక్తి పురస్కార్’లను ప్రదానం చేసి ప్రసంగించారు. అవార్డులు అందుకున్న 31 మందిలో సంఘసేవకురాలు, నటి అమల కూడా ఉన్నారు. సమాజసేవకు గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు దక్కింది. అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె అన్నారు.
‘సామాజిక సేవకుగాను నా కుటుంబం నుంచి నాకు ఎంతో సాయం అందుతోంది. మరింత సేవ చేయడానికి నావద్ద ఒక ప్రణాళిక ఉంది, దీన్ని మహిళాశిశు సంక్షేమ శాఖకు అందించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తా’ అని అమల చెప్పారు. ‘నారీశక్తి’ గ్రహీతల్లో చంద్రయాన్, మంగళయాన్ ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు బి.కొడనన్యగయ్, అనట్టా, త్రిపునితుర కథాకళి కేంద్రానికి చెందిన మహిళా బృందం (దేశవిదేశాల్లో 1500 ప్రదర్శనలు ఇచ్చింది), తొలి మహిళా గ్రాఫిక్ నావెలిస్ట్ అమృత పాటిల్, ఆసియాలో తొలి డీజిల్ రైలు నడిపిన మహిళ ముంతాజ్ ఖాజీ, మానవ అక్రమ రవాణా బాధితురాలు అనోయరా ఖాతూన్ తదితరులు ఉన్నారు.