Sakshi News home page

అక్కడ హిట్లర్.. ఇక్కడ ఇందిర!

Published Sat, Nov 28 2015 2:42 AM

అక్కడ హిట్లర్.. ఇక్కడ ఇందిర! - Sakshi

న్యూఢిల్లీ: అసహనంపై విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు కేంద్రం హిట్లర్‌ను రంగంలోకి దింపింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యసభలో శుక్రవారం చర్చను ప్రారంభించిన కేంద్ర మంత్రి జైట్లీ.. కాంగ్రెస్ హయాం నాటి ఎమర్జెన్సీని 1930లలో జర్మనీలో హిట్లర్ చేపట్టిన చర్యలతో పోలుస్తూ ఎదురుదాడి చేశారు. అత్యవసర పరిస్థితి సమయంలో రాజ్యాంగాన్ని బలహీనపర్చారని,  స్వేచ్ఛాహక్కు, జీవించే హక్కులను  కాలరాచారని ధ్వజమెత్తారు.  ‘చరిత్రలో రాజ్యాంగాన్ని బలహీన పర్చేందుకు రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకున్న సందర్భాలున్నాయి.

1933లో జర్మనీలో హిట్లర్ హయాంలో జరిగిందదే. జర్మనీ పార్లమెంటును తగలబెడ్తామన్న హెచ్చరిక ను సాకుగా చూపుతూ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రతిపక్షాన్ని జైల్లోపెట్టి, పార్లమెంట్లో మెజారిటీ సంపాదించి, రాజ్యాంగాన్ని సవరించారు. ప్రెస్‌పై ఆంక్షలు పెట్టి, 25 పాయింట్ల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాలను ఏ కోర్టు కూడా ప్రశ్నించకుండా చట్టం తీసుకువచ్చారు’ అని అన్యాపదేశంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన నాటి ఘటనలను పోల్చారు. ‘ఇండియా అంటే ఇందిర.. ఇందిర అంటే ఇండియా’ అనే నినాదం గుర్తొచ్చేలా.. ‘జర్మనీ అంటే అడాల్ఫ్ హిట్లర్.. హిట్లర్ అంటే జర్మనీ’ అన్న హిట్లర్ ముఖ్య సలహాదారు రుడాల్ఫ్ హెస్ నినాదాన్ని గుర్తు చేశారు.

‘ఆ తరువాత జర్మనీ చర్యలను ఆధారంగా చేసుకుని ఇతర దేశాలు చేపట్టిన చర్యలపై జర్మనీ కాపీరైట్ తీసుకోలేదు’ ఇండియాలో ఎమర్జెన్సీని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యంగ్య వ్యాఖ్య చేశారు. జీవించేహక్కును కల్పించే రాజ్యాంగ అధికరణ 21ను రద్దు చేయడం ఇకపై కుదరదంటూ ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత రాజ్యాంగాన్ని సవరించుకున్నామని గుర్తు చేశారు. ఉమ్మడి పౌర స్మృతి అమలుకు సంబంధించిన రాజ్యాంగ అధికరణ 44, గోవధ నిషేధాన్ని సమర్ధించే ఆర్టికల్ 48 అమలుకు మద్దతుగా 1949 నవంబర్‌లో అంబేద్కర్ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఇప్పుడు ఈ సభలో ఆ ప్రసంగం ఆయన ఇచ్చి ఉంటే విపక్షం ఎలా స్పందించేదో!?’ అని వ్యాఖ్యానించారు. ఈ స్వాతంత్య్రాన్ని దేశం కాపాడుకోగలుగుతుందా? అనే అనుమానాన్ని ఆ సందర్భంగా అంబేద్కర్ వ్యక్త పరిచారన్నారు.

 టైజంపై..
 ‘ప్రపంచదేశాల రాజ్యాంగ వ్యవస్థలకు ఉగ్రవాదం పెను సవాలుగా మారింది. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఉగ్రవాదంపై మెతక వైఖరి అవలంబించడం కాకుండా ఆ మహమ్మారిపై ఐక్యంగా పోరు సాగించాలి’ అన్నారు. ఈ సందర్భంగా 2001 పార్లమెంటపై దాడి, 1993 ముంబై పేలుళ్లు తదితర ఘటనలను ప్రస్తావించారు. ముంబై పేలుళ్ల దోషి ఉగ్రవాది యాకూబ్ మెమన్‌ను ఉరితీసిన తరువాత.. ఆయనను అమరుడిగా కీర్తించిన పరిస్థితి నెలకొందని, ఇలాంటి వాటికి అంబేద్కర్ ఎలా స్పందించేవారోనని వ్యాఖ్యా నించారు.

 న్యాయవ్యవస్థపై..
 ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత కచ్చితంగా అత్యవసరం. అయితే, ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం సంప్రదింపుల ద్వారానే జరగాలి. అంబేద్కర్ ఆలోచనలకు భిన్నంగా నేడు జరుగుతోంది. ఇతర జడ్జీలనందరినీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే నియమించే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. దీన్ని సమర్ధించడం ఏ చట్టానికీ సాధ్యం కాదు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు సంబంధించి.. లక్ష్మణ రేఖను జ్యుడీషియరీ దాటకూడదన్న వాదన కూడా ఉంది. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమతుల్యత సాధించాలి’ అని జైట్లీ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తప్పుడు విధానాలు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హత్యలకు దారితీశాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ తన వ్యాఖ్యలపై శుక్రవారం విచారం వ్యక్తం చేశారు.
 
 విభజన శక్తులపై చర్యలు లేవు: విపక్షం
 విభజన శక్తులపై చర్యలు తీసుకోవడం లేదని రాజ్యాంగ దినోత్సవ చర్చ సందర్భంగా రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. దేశంలో నెలకొన్న అసహన వాతావరణం, వెనకబడిన వర్గాల పరిస్థితి, సమాఖ్య విధానం బలహీనపడటం.. తదితరాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో అసహన వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు.  అంటే జవహర్‌లాల్ నెహ్రూను ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై స్పందిస్తూ.. ‘రాజ్యాంగ ప్రవేశికకకు కారణమైన వ్యక్తిని మీరు గుర్తించరు.

రాజ్యాంగ నిర్మాణంలో ఆ వ్యక్తి కృషిని ప్రశంసించరు. దాన్నే అసహనం అంటారు’ అని విమర్శించారు. కనీసం ఒక్కసారి కూడా పండిట్ నెహ్రూను గుర్తు చేసుకోం. నెహ్రూను ప్రస్తావించకుండా రాజ్యాంగం గురించి మాట్లాడటం ఎలా సాధ్యం? నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ జీవించి లేకున్నా.. వారిని ఒకరిపై ఒకరికి పోటీ పెట్టారు. బీజేపీ నేతలు స్వాతంత్య్ర సమర యోధులను రాజకీయం కోసం వాడుకుంటున్నారు. దీన్నే అసహనం అంటారు. గత సంవత్సరన్నరగా భారత్‌లో నెలకొన్న వాతావరణం రాజ్యాంగస్ఫూర్తికి వ్యతిరేకమైనది.’ అని ఆజాద్ మండిపడ్డారు.

తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు జైట్లీ ప్రయత్నించడంతో.. ‘మీరు మీ ప్రసంగంలో హిట్లర్‌ను ప్రస్తావించవచ్చు కానీ.. నేను మన తొలి ప్రధాని గురించి మాట్లాడకూడదా? దీన్నే అసహనం అంటారు’ అని ఎదురుదాడి చేశారు. హైదరాబాద్, మాలేగావ్, సంరతా పేలుళ్ల కారకులపై చర్యలు తీసుకోవాలి’ అన్నారు. ‘ఎస్సీ, ఎస్టీల పరిస్థితి దారుణంగా ఉంది. ఎంపీ స్థాయిలో ఉన్నా.. పార్టీలో ఒత్తిళ్లతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేని పరిస్థితి ఆ వర్గ ఎంపీల్లో ఉంది.  రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి 26న అయితే, నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఏంటని సీపీఎం నేత యేచూరి పేర్కొన్నారు.
 
 అసహనంపై స్పందన లేదు!
 లోక్‌సభలో విపక్షాల ధ్వజం

 ‘అసహనం’పై ప్రజల్లో భయాందోళనలను తొలగించే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని లోక్‌సభలో విపక్షాలు ధ్వజమెత్తాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో గురువారం ప్రారంభమైన చర్చ శుక్రవారం  కొనసాగింది. రాజ్యాంగంలోని లౌకికత అనే పదం ప్రభుత్వంలోని వారికి ఇబ్బందికరంగా ఉందని కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య వ్యాఖ్యానించారు. ‘ఇద్దరు దళిత చిన్నారులను తగలబెడ్తే.. ఒక కేంద్రమంత్రి కుక్క ఉదాహరణ చెప్తారు. కళాకారులు తమ అవార్డులను తిరిగిస్తుంటే.. ఓ ఎంపీ వారిని ఉగ్రవాది తో పోలుస్తారు. ఇవన్నీ వేటికి సంకేతం’ అంటూ మండిపడ్డారు. అంబేద్కర్ దిష్టిబొమ్మలను గతంలో ఆరెస్సెస్ తగలబెట్టిన విషయాన్ని సింధియా ప్రస్తావించారు. 

ముస్లింల స్వప్నాలు ఎంతవరకు నిజమయ్యాయని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. జీవించే హక్కు రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కు అన్న ఓవైసీ.. ముస్లింల జీవించే హక్కును కాపాడాలన్నారు. ఎన్నో సందర్భాల్లో ముస్లింల జీవించే హక్కును కాలరాచారన్నారు. ‘మోదీ ఈ దేశంలోని ముస్లింలకు ప్రధాని కారా?’ అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement