సర్కారీ షేర్లు వస్తున్నాయ్..! | Government lines up PSU disinvestments to meet Rs 40k crore target | Sakshi
Sakshi News home page

సర్కారీ షేర్లు వస్తున్నాయ్..!

Jan 8 2014 1:02 AM | Updated on Sep 2 2017 2:22 AM

సర్కారీ షేర్లు వస్తున్నాయ్..!

సర్కారీ షేర్లు వస్తున్నాయ్..!

ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వాటా విక్రయాల(డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యం సాధించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలే మిగిలి ఉండటంతో... కేంద్రం త్వరపడుతోంది.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వాటా విక్రయాల(డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యం సాధించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలే మిగిలి ఉండటంతో... కేంద్రం త్వరపడుతోంది. ఈ నెల్లోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ), ఇంజినీర్స్ ఇండియాల్లో వాటా విక్రయాలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ ప్రకటించారు. ఫిబ్రవరిలో బీహెచ్‌ఈఎల్(భెల్), మార్చిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)లు క్యూలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తంమీద ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం లక్ష్యించిన రూ.40 వేల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌కు దరిదాపుల్లోకి రాగలమని భావిస్తున్నట్లు మాయారామ్ ధీమా వ్యక్తం చేశారు. చిత్రమేంటంటే లక్ష్యం 40వేల కోట్లయితే ఇప్పటిదాకా ఏడు పీఎస్‌యూల్లో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం కేవలం రూ.3వేల కోట్లు మాత్రమే సమీకరించింది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ చేసిన కంపెనీల్లో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ కాపర్, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఎంఎంటీసీలున్నాయి.
 
 దిగ్గజాల వరుస...
 తాజా రోడ్‌మ్యాప్ ప్రకారం ఐఓసీ, ఇంజినీర్స్ ఇండియా, హెచ్‌ఏఎల్‌లో 10 శాతం చొప్పున వాటా విక్రయించే అవకాశముంది. దీన్లో ఐఓసీ ద్వారా రూ.5,000 కోట్లు, ఇంజినీర్స్ ఇండియా ద్వారా రూ.500 కోట్లు రావచ్చు. హెచ్‌ఏఎల్ ద్వారా రూ.3,000 కోట్లు సమకూరే అవకాశముంది. భెల్‌లో 5 శాతం వాటా విక్రయంతో రూ.2,000 కోట్లు ఖజానాకు జమ కావచ్చు.  కోల్ ఇండియా, ఆర్‌ఐఎన్‌ఎల్(వైజాగ్ స్టీల్) వంటి దిగ్గజ సంస్థల ఇష్యూలు కూడా చాన్నాళ్లుగా జాప్యమవుతూ వస్తున్నాయి.
 
 కాగా,  ఐఓసీలో డిజిన్వెస్ట్‌మెంట్‌పై సాధికార మంత్రుల బృందం(ఈజీఓఎం) గురువారం చర్చించనుంది. ఆర్థిక మంత్రి చిదంబరం అధ్యక్షతన ఈజీఓఎం ఈ వాటా (19.16 కోట్ల షేర్ల)విక్రయంపై చర్చిస్తుందని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే చెప్పారు.  ఐఓసీలో కేంద్ర ప్రభుత్వానికి 78.92 శాతం వాటా ఉంది. కొన్ని పీఎస్‌యూల్లో షేర్లను సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్(సీపీఎస్‌ఈ) ఈటీఎఫ్ యంత్రాంగం ద్వారా విక్రయించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.3,000 కోట్ల మూలనిధి(కార్పస్)తో దీన్ని ఏర్పాటు చేయొచ్చని అంచనా. ప్రతిపాదిత ఈపీఎఫ్‌లో ఇప్పటికే లిస్టయిన సీపీఎస్‌ఈల షేర్లు(2-3%)ఉంటాయి.
 
 పసిడిపై నియంత్రణలు కొనసాగుతాయ్...
 బంగారం దిగుమతులపై ప్రభుత్వ నియంత్రణలను ఇప్పుడప్పుడే తొలగించే అవకాశాల్లేవని మాయారామ్ చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) మెరుగుపడుతున్నప్పటికీ.. కనీసం మార్చి చివరివరకూ ఈ నియంత్రణలు కొనసాగవచ్చన్నారు. క్యాడ్ రికార్డు స్థాయికి చేరడం, రూపాయి పతనం కావటంతో పుత్తడిపై దిగుమతి సంకాన్ని అంచెలంచెలుగా కేంద్రం 10%కి పెంచడం తెలిసిందే.  దీంతో మే నెలలో 162 టన్నుల స్థాయి నుంచి నవంబర్‌లో 19.3 టన్నులకు పడిపోయాయి. క్యాడ్ కూడా జూలై క్వార్టర్‌లో 4.8% నుంచి సెప్టెంబర్ క్వార్టర్‌లో 1.2%కి దిగొచ్చింది. నియంత్రణల కారణంగా బంగారం స్మగ్లింగ్ పెరిగేందుకు దారితీస్తోందా అన్న ప్రశ్నకు.. అలాంటి వాదనలకు తగిన ఆధారాల్లేవని మాయారామ్ తేల్చిచెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement