విద్యార్థిని అనుమానాస్పద మృతి | female Student Suspicious death | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అనుమానాస్పద మృతి

Aug 10 2015 1:45 AM | Updated on Nov 9 2018 5:02 PM

డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోగా.. ఇద్దరు యువకులు ఆమె శవాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చిపారిపోయిన...

ఖమ్మం క్రైం: డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోగా.. ఇద్దరు యువకులు ఆమె శవాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చిపారిపోయిన ఘటన ఖమ్మంలో ఆదివారం జరిగింది. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం దుబ్బతండాకు చెందిన భూక్యా మౌనిక (19) ఖమ్మం లోని మహిళా కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతూ సదరమ్‌హోంలో ఉంటోంది. 2 రోజులు సెలవులు రావటంతో ఊరికి వెళ్తున్నానని స్నేహితులకు చెప్పి ఆదివారం సాయంత్రం బయటకొచ్చింది.

అయితే, ఆరు గంటల సమయంలో గుర్తుతెలియని యువకుడు మౌనిక తల్లిదండ్రులు సుజాత, రామచంద్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరి వేసుకుని ఉంటే ఆస్పత్రిలో చేర్పించామని.. అర్జెంట్‌గా రావాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో వారు ఖమ్మంలోని బంధువులకు సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా అప్పటికే మౌనిక ఆస్పత్రిలో మృతి చెందివుంది.
 
ఓపీ రాయించుకురమ్మంటే..: ఈ విషయమై టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి  సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా ఇద్దరు యువకులు ఆటోలో మౌనికను తీసుకువచ్చినట్లు ఉంది. అందులో నుంచి ఓ యువకుడు దిగి ఆస్పత్రిలోనికి వెళ్లి స్ట్రెచర్‌ను తీసుకొచ్చి మౌనికను దానిపై లోపలికి తీసుకెళ్లినట్టు గుర్తించారు. యువతి ఉరి వేసుకుంటే తీసుకువచ్చామని, ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉందని ఇద్దరు యువకులు చెప్పినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఓపీ రాయించుకుని రమ్మని చెప్పగా వెళ్లి..

ఇద్దరూ తిరిగి రాలేదన్నారు. డ్యూటీలో వున్న వైద్యుడు విజయ్ మౌనికను పరిశీలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.  పోలీసులు  మౌనిక తల్లిదండ్రులకు ఫోన్ చేసిన నంబర్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, మౌనికకు ఓ యువకుడితో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఆ యువకుడికి, ఆమెకు మధ్య హాస్టల్ ముందు ఘర్షణ జరగ్గా యువకుడు చేయి చేసుకున్నట్లు తెలిసింది.

బాధతో మౌనిక హాస్టల్ లోపలికి వెళ్లి రోధించినట్లు సమాచారం. ఆ యువకుడే మౌనిక మృతదేహాన్ని ఆస్పత్రిలో వదిలివేసి వుండవచ్చని భావిస్తున్నారు. ఆ యువకుడి పక్కనున్న మరో యువకుడు ఎవరు అయివుంటారని పోలీసులు మౌనిక స్నేహితులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ యువకుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement