
ఆ జింకలను ఎవరు చంపారు?
సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సరదా కోసం రక్షిత వన్యప్రాణులైన కృష్ణజింకలను వెటాడారన్న కేసులో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది.
సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సరదా కోసం రక్షిత వన్యప్రాణులైన కృష్ణజింకలను వెటాడారన్న కేసులో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ కు ఈ కేసు నుంచి విముక్తి ప్రసాదించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు..
-
1998 సంవత్సరంలో రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో ఆ సినిమా నటులైన సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రె, టబు, నీలమ్ తదితరులు సరదా కోసం వేటకు వెళ్లారని, రక్షిత వన్యప్రాణులైన జింకలను వేటాడారని అప్పట్లో కేసు నమోదైంది. జోథ్ పూర్ శివార్లలోని భవాద్ అటవీ ప్రాంతంలో 1998 సెప్టెంబర్ 26న ఓ జింక, సెప్టెంబర్ 28న ఘోడా ఫార్మ్ హౌస్ లో మరో జింక హత్యకు గురయ్యాయి.
-
ఈ జింకలను వేటాడి చంపిన కేసులో 2006లో జోథ్ పూర్ ట్రయల్ కోర్టు సల్మాన్ఖాన్కు ఐదేళ్లు శిక్ష విధించింది. ఈ శిక్షను సవాల్ చేస్తూ సల్మాన్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు శిక్షపై స్టే విధించింది. అనంతరం సుదీర్ఘకాలం వాదనల అనంతరం సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది.
-
జింకలను వెటాడిన కేసులో సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించడంపై స్థానిక బిష్ణోయ్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ వర్గం తెలిపింది. మరోవైపు రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని భావిస్తోంది.
-
న్యాయవ్యవస్థ ఎంత నెమ్మదిగా పనిచేస్తోందో సెలబ్రిటీ కేసులే మనకు చెప్తాయి. సల్మాన్ ఖాన్ నిర్దోషి అని చెప్పడానికి కోర్టుకు 20 ఏళ్లు పట్టడం నిజంగా భయం కలిగిస్తున్నది- రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో..
Only celebrity cases make us realise how dead slow judiciary works .it's scary it took 20yrs for court to decide Salman khan is not guilty
— Ram Gopal Varma (@RGVzoomin) July 25, 2016 -
సల్మాన్ ఖాన్ కు కేసులు కొత్త కాదు. 'హిట్ అండ్ రన్' కేసులోనూ ఆయన విచారణ ఎదుర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపి ఓ వ్యక్తి మృతికి, నలుగురు గాయపడటానికి కారణమైనట్టు అభియోగాలు ఎదుర్కొన్న ఈ కేసులో ముంబై హైకోర్టు ఆయనను గత ఏడాది డిసెంబర్ లో నిర్దోషిగా ప్రకటించింది. 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో సల్మాన్ కు ఊరట లభించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయడంతో ఈ కేసు ఇంకా సల్మాన్ ను వెంటాడుతూనే ఉంది.
-
'సుల్తాన్' సినిమాతో బాక్సాఫీసు రికార్డు బద్దలు కొట్టిన సల్మాన్.. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో వివాదాస్పద 'రేప్' వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.