
బిల్లు చూశాకే వైఖరి చెబుతాం
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు స్వరూపం, స్వభావాన్ని చూసిన తరువాతే తమ వైఖరి చెబుతామని కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తేల్చిచెప్పింది.
* కాంగ్రెస్ దూతలకు తేల్చిచెప్పిన బీజేపీ
* బిల్లుపై పార్టీ ముఖ్యులమంతా చర్చించాకే నిర్ణయం
* విభజనకు సూత్రప్రాయ మద్దతు; హైదరాబాద్ తెలంగాణదే
* అయితే తెలంగాణ, సీమాంధ్రకు న్యాయం జరగాలి
* ఇది మాటలతో కాదు.. చట్టబద్దంగా బిల్లులో ఉండాలి
* సీమాంధ్ర లోటును పూడ్చేందుకు ప్రతిపాదనలేంటి?
* తెలంగాణలో సీమకు చెందిన రెండు కాదు.. నాలుగు జిల్లాలు కలుపుతారా?
* అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌లతో భేటీలో వెంకయ్య ప్రశ్నాస్త్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు స్వరూపం, స్వభావాన్ని చూసిన తరువాతే తమ వైఖరి చెబుతామని కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తేల్చిచెప్పింది. ‘తెలంగాణకు, సీమాంధ్రకు న్యాయం జరగాలి. అది మాటలతో కాదు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగినట్టు బిల్లులో కనిపించాలి. సీమాంధ్రుల భయాలు, అపోహలు తొలగించాలి. వారిని సంతృప్తిపర్చాలి. అది చూశాక నేనొక్కడినే కాదు.. పార్టీలోని నలుగురు ముఖ్యులం బిల్లుపై సమీక్షిస్తాం. చర్చిస్తాం. ఆ తరువాత మా వైఖరి చెబుతాం’ అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ దూతలకు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజ్యాంగపరంగా, రాజకీయంగా, పరిపాలన పరంగా తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపించాలని వారిని గట్టిగా అడిగారు.
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్రమంత్రుల బృందం(జీఓఎం) సభ్యుడు జైరాం రమేశ్ గురువారం రాత్రి వెంకయ్యనాయుడుతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా సీమాంధ్రులకు సంబంధించిన 13 ప్రధాన సవరణల లేఖను జైరాంకు అందచేసి.. వాటిపై కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియచేయాలని వెంకయ్యనాయుడు కోరారు. జైరాం భేటీకి కొనసాగింపుగా.. శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌లు వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పైవిధంగా స్పందించారు. భేటీలో బీజేపీ నేత లేవనెత్తిన అంశాల వివరాలు..
* రాష్ట్ర విభజనకు మా పార్టీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే ఇరు ప్రాంతాలకు న్యాయం చేసేలా విభజన జరగాలి. కానీ బిల్లు చూస్తే అలా లేదు.
* మేం ప్రతిపాదించిన సవరణల ద్వారా సీమాంధ్రుల్లో భయాలు, అపోహాలు తొలగిపోతాయని భావిస్తున్నాం.
* హైదరాబాద్ ఆదాయానికి సంబంధించిన అంశంపై జరిగిన చర్చలో.. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపే ప్రతిపాదనను దిగ్విజయ్ లేవనెత్తినట్టు సమాచారం. రెండు జిల్లాలను కలపడం వల్ల ప్రయోజనం ఏముంటుందని, రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలను కలుపుతారా అంటూ వెంకయ్య ప్రశ్నించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
* ‘ఆదాయం విషయానికి వస్తే.. తెలంగాణలో రూ. 8 వేల కోట్లు, రాయలసీమలో రూ. 7 వేల కోట్లు లోటు ఉంది. తెలంగాణలోనే హైదరాబాద్ ఉంటే.. ఆ ప్రాంతానికి లోటు తగ్గిపోతుంది. మరి రాయలసీమ లోటుకు సంబంధించి ఏం చేస్తున్నారు? దానికి సంబంధించి బిల్లులో గ్రాంట్ ఏమైనా ఇస్తున్నారా?’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. ‘లేక హైదరాబాద్‌ను సీమాంధ్రలో కలుపుతారా?’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారని సమాచారం. హైదరాబాద్‌ను తెలంగాణలోనే ఉంచడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేసినట్లు తెలిసింది.
* ‘కొత్త రాష్ట్రం ఏర్పాటైతే సీమాంధ్రలో జీతభత్యాలకు అప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల సీమాంధ్ర ప్రాంతానికి ఆర్థిక ప్యాకేజ్ ఇస్తున్నారా? ఆ వివరాలేమిటి?’ అని అహ్మద్ పటేల్, దిగ్విజయ్‌సింగ్‌లను వెంకయ్యనాయుడు అడిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
* ‘వెనకబడిన రాయలసీమకు పెట్టుబడులు రావాలంటే పరిశ్రమల్లో రాయితీలకు సంబంధించిన ప్రతిపాదనలు.. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే దానికి నిధులు, ఉపాధికల్పనలకు ప్రతిపాదనలేమైనా పెట్టారా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం.
* ఇవేగాక పెండింగు ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై వెంకయ్య ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది.
* తమ పార్టీ చేసిన సవరణల ప్రతిపాదనలపై హామీలతో సరిపెట్టకుండా చట్టబద్దంగా బిల్లులో పొందుపర్చాలని డిమాండ్ చేశారని సమాచారం.
* భేటీ అనంతరం జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ మీతో టచ్‌లో ఉంటారని చెప్పి అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌లు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.