రహదారులు, భవనాలపై ఎక్కడపడితే అక్కడ పుట్టుకు వస్తున్న హోర్డింగ్‌లు, యూనిపోల్స్ ప్రకటనలకు చెక్‌పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: రహదారులు, భవనాలపై ఎక్కడపడితే అక్కడ పుట్టుకు వస్తున్న హోర్డింగ్‌లు, యూనిపోల్స్ ప్రకటనలకు చెక్‌పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా రాష్ట్ర మునిసిపల్ ప్రకటనల విధానాన్ని (ఏపీ మునిసిపల్ అడ్వర్టయిజ్‌మెంట్ పాలసీ) తయారు చేసింది. ప్రస్తుతం బిల్లును న్యాయశాఖ పరిశీలనకు పురపాలక శాఖ పంపించింది. స్థానిక సంస్థలకు ఆదాయం తగ్గుతుందనే అంశంతో సంబంధం లేకుండా, పట్టణాలు, నగరాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రజలు గాయపడడం, మరణిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటనల విధానానికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును చట్టం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఏటా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న హోర్డింగ్ కంపెనీల యాజమాన్యాలు కనీస నిబంధనలు పాటించడం లేదు. దానికితోడు స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన ఫీజును కూడా ఎగ్గొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రకాల వస్తు ఉత్పత్తి సంస్థలు తమ ప్రచారం కోసం వినియోగించే సైన్‌బోర్డులు, బ్యానర్లు, యూనిపోల్స్, హోర్డింగ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ప్రచారంపై ఆంక్షలు విధించనుంది.
జాతీయ, రాష్ట్ర రహదారులపైనా నిషేధం: ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా ప్రకటనల హోర్డింగ్స్‌కు అనుమతించరు. ప్రధాన కూడళ్లలోనూ, రహదారి మధ్యలో డివైడర్లు, విద్యుత్ స్తంభాలపై ఎలాంటి ప్రకటనలకు అనుమతించరాదు. నగరాలు, పట్టణాల్లో విచ్చలవిడిగా ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు అనుమతించకుండా.. ప్రత్యేక ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడే అన్ని రకాల బోర్డులు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాలి. హోర్డింగ్స్, యూని పోల్స్‌పై కదిలే(మూవింగ్) ప్రకటనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదు. రంగురంగల విద్యుత్ కాంతులు వెదజల్లేలా ఏర్పాటు చేసే ప్రకటనలను అంగీకరించరాదు. పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల్లోనే ఈ ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేసుకోవచ్చు. నివాస ప్రాంతాల్లో వీటికి అనుమతిలేదు.
ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా: పురావస్తు, వారసత్వ, అర్కిటెక్చరల్ భవనాలు, ప్రార్థనా కేంద్రాలు, విగ్రహాలు, ప్రభుత్వ, మున్సిపల్ కార్యాలయాలు, సరస్సులు, కుంటలు, ఫ్లైఓవర్, బ్రిడ్జిలు, 4 రోడ్ల కూడళ్లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడాన్ని నిషేధించాలి. ప్రకటనల బోర్డులపై ఫ్లాష్ లైట్ల వినియోగించరాదు. అనుమతించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే హోర్డిం గ్స్ మధ్య కనీసం 30 మీటర్లు ఉండాలి. విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లేన్లు, సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, రైల్వేస్టేషన్లకు 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. ఈ ప్రకటనల బోర్డుల్లో 10% స్థలాన్ని ప్రజోపయోగం కోసం విడిచిపెట్టాలి. సమాజంలో చెడు ప్రబలేలా ఎలాంటి ప్రకటనలు ప్రదర్శించడానికి వీల్లేదు. మతం, మద్యం, నగ్న చిత్రాల ప్రచారం నిషేధం. పురపాలక సంఘాలు, సంస్థల వద్ద నమోదు చేసుకున్న సంస్థలకే ఈ ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయడానికి అనుమతినిస్తారు.