పన్ను ఎగ్గొడితే.. ‘వాటా’ పోయినట్టే! | Will discuss Taxpayers, Traders issues at GST Council | Sakshi
Sakshi News home page

పన్ను ఎగ్గొడితే.. ‘వాటా’ పోయినట్టే!

Aug 27 2017 1:55 AM | Updated on Sep 17 2017 5:59 PM

పన్ను ఎగ్గొడితే.. ‘వాటా’ పోయినట్టే!

పన్ను ఎగ్గొడితే.. ‘వాటా’ పోయినట్టే!

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లో భాగంగా.. ఎగవేతదారుల ముక్కుపిండి మరీ పన్ను రాబట్టేందుకు ప్రభుత్వం తాజాగా కొన్ని నిబంధనలు విధించింది. ఎవరైనా రిజిస్టర్డ్‌ డీలర్‌ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు నిర్ధారణ అయితే..

► డీఫాల్టర్ల వ్యాపార భాగస్వామ్యాన్ని సర్కారుకు అటాచ్‌ చేసే అవకాశం
► స్థిరచరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు కూడా..
► అవసరమైతే అమ్మకానికీ వెసులుబాటు
► జీఎస్టీ అమలు నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిబంధనలు
► సీజ్‌ చేసిన సరుకులను వేలం ద్వారా అమ్మి రికవరీ  


సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లో భాగంగా.. ఎగవేతదారుల ముక్కుపిండి మరీ పన్ను రాబట్టేందుకు ప్రభుత్వం తాజాగా కొన్ని నిబంధనలు విధించింది. ఎవరైనా రిజిస్టర్డ్‌ డీలర్‌ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు నిర్ధారణ అయితే.. ఆ డీలర్‌ చేస్తున్న వ్యాపారంలోని అతడి భాగస్వామ్యాన్ని ప్రభుత్వం అటాచ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు సదరు డీలర్‌ చెల్లించాల్సిన పన్ను రికవరీ అయ్యేంతవరకు ఆ భాగస్వామ్యాన్ని, ఆ భాగస్వామ్యం ద్వారా వచ్చే లాభాలను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. తెలంగాణ వస్తుసేవల పన్ను నిబంధనలు–2017 పేరిట రాష్ట్ర వస్తుసేవల పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ ఉత్తర్వులను విడుదల చేశారు.

సరుకులు, ఆస్తులను అమ్మి..
జీఎస్టీ చట్టం 79 (1) సెక్షన్‌లోని క్లాజ్‌ (బి) ప్రకారం.. సదరు డీలర్‌ చెల్లించాల్సిన పన్ను మేరకు అతడి వ్యాపార సరుకులను విక్రయించి రికవరీ చేయవచ్చు. ఈ సరుకులను డీలర్‌కు నోటీసులు జారీ చేసిన 15 రోజుల తర్వాత.. అది కూడా ఈ–వేలం ద్వారా మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వపరంగా అయిన ఖర్చులను కూడా డీలర్‌ ఖాతాలోనే వేస్తారు. ఇక సివిల్‌ కోర్టుల్లో దావాలు వేయడం ద్వారా సదరు డీలర్‌కు అటాచ్‌మెంట్‌ డిక్రీలు ఇప్పించి అతడి ఆస్తులను స్వాధీనం (అటాచ్‌) చేసుకుంటారు. తొలుత డీఫాల్టర్‌కు సంబంధించిన స్థిర, చరాస్తుల జాబితాను నిర్దేశిత అధికారి తయారుచేసి, వాటి మార్కెట్‌ విలువను కూడా నిర్ధారిస్తూ నోటీసులు జారీ చేయాలి.

ఆ నోటీసులకు డీలర్‌ స్పందించని పక్షంలో వేలం ద్వారా ఆస్తులను అమ్మి పన్ను సొమ్మును రికవరీ చేసుకునే అధికారం ఉంటుంది. ఈ వేలం ప్రక్రియలో నిర్దేశిత అధికారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనే అవకాశం లేదని.. పోలీసుల సహకారంతో వేలం ప్రక్రియను నిర్వహించాలని, సెలవు దినాల్లో వేలం నిర్వహించవద్దని నిబంధనలు పేర్కొంటున్నాయి. పన్ను ఎగవేతదారుల ఇష్టానుసారం వారి వ్యాపార భాగస్వామ్యాన్ని ప్రభుత్వం అటాచ్‌ చేసుకునే పక్షంలో... ఆ వ్యాపారంలోని ఇతర భాగస్వాములు ఆ వాటాను కొనుగోలు చేసే స్వేచ్ఛ ఉంటుంది. అధికారులు డీఫాల్టర్‌కు సంబంధించిన బ్యాంకు డిపాజిట్లు, మార్కెట్‌ షేర్లను కూడా అటాచ్‌ చేసుకుని రికవరీ చేసుకుంటారు. ఈ ప్రక్రియల ద్వారా పన్ను మొత్తం రికవరీ చేసుకుని, ప్రభుత్వ ఖర్చులను మినహాయించుకుని.. ఇంకేమైన సొమ్ము మిగిలితే డీఫాల్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది.

ఎగుమతుల పన్నుకు 105 రోజులు
ఎగుమతులకు సంబంధించిన పన్ను చెల్లింపులపై కూడా గడువును విధించారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే సరుకులకు సంబంధించి ఇన్వాయిస్‌ రాసిన మూడు నెలల తర్వాత 15 రోజుల్లోపు కచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇతర దేశాలకు ఎగుమతులు చేసినట్టయితే ఇన్వాయిస్‌ రాసిన ఏడాదిలోపు పన్ను చెల్లించాలి.  

జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులకే..
జీఎస్టీ అమల్లో భాగంగా రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలను తనిఖీ చేసే అ«ధికారాన్ని వస్తుసేవల పన్ను శాఖలో పనిచేస్తున్న జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారులకే కల్పించారు. జేసీ స్థాయి అధికారి తన కింది అధికారుల్లో ఎవరైనా ఒకరికి తనిఖీలు చేసే అధికారాన్ని కల్పిస్తే... సదరు అధికారి తనిఖీలు చేయవచ్చు. తనిఖీల్లో భాగంగా సరుకులను లేదా బుక్స్‌ లేదా డాక్యుమెంట్లను సీజ్‌ చేయాల్సి వస్తే నోటీసులు జారీ చేసి సీజ్‌ చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement