రసవత్తరం

Who Is winning at huzurabad ?  - Sakshi

     ఇప్పటి వరకు ఎనిమిది పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు

     1952, 57 జరిగిన ఎన్నికల్లో నలుగురు పీడీఎఫ్‌ అభ్యర్థుల విజయం

     నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపు

     రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన టీఆర్‌ఎస్‌ 

 సాక్షి, హుజూర్‌నగర్‌ : నియోజకవర్గంలో 1952 నుంచి 1972 వరకు ఆరుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నియోజకవర్గం రద్దయింది. అప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 1952లో జరిగిన ద్విసభ్య నియోజకవర్గ ఎన్నికల్లో పీడీఎఫ్, అదే ఏడాది జరిగిన ఉపఎన్నికల్లో పీడీఎఫ్, రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి ఇండిపెండెంట్‌ అభ్యర్థి విజయం సాధించారు. తిరిగి 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రామన్నపేట నియోజకవర్గం రద్దయి హుజూర్‌నగర్‌ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి వరకు కోదాడ ఎమ్మెల్యేగా ఉన్న ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. నియోజకవర్గంలో హుజూర్‌నగర్‌ పట్టణంతోపాటు గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు, మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి మండలాలు ఉన్నాయి. 

పునర్విభజనకు ముందు ..
2009 నియోజకవర్గ పునర్విభజనకు ముందు హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మిర్యాలగూడ అసెంబ్లీ  పరిధిలో ఉంది. గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌ మండలంలోని 6 గ్రామాలు, మఠంపల్లి మండలంలోని 7 గ్రామాలు మాత్రమే మిర్యాలగూడ అసెంబ్లీ పరిధిలో ఉన్నాయి. మేళ్లచెరువు మండలంతోపాటు మఠంపల్లి, హుజూర్‌నగర్‌ మండలంలోని మిగిలిన గ్రామాలు కోదాడ అసెంబ్లీ పరిధిలో కొనసాగాయి. అయితే ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో రామన్నపేట నియోజకవర్గం రద్దు కాగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గం తిరిగి 2009లో ఆవిర్బవించింది. 

ద్విసభ్య నియోజకవర్గంలో..
1952లో ద్విసభ్య నియోజకవర్గంగా జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి జయసూర్య కాంగ్రెస్‌ అభ్యర్థి కె.ఎల్‌.ఎన్‌.రావుపై, మరో పీడీఎఫ్‌ అభ్యర్థి టి.నర్సింహులు కాంగ్రెస్‌ అభ్యర్థి సుమిత్రాదేవిపై విజయం సాధించారు. కాగా పీడీఎఫ్‌ అభ్యర్థి జయసూర్య మెదక్‌ నుంచి లోక్‌సభకు కూడా అదే ఎన్నికల్లో గెలుపొందడంతో ఆయన రాజీనామా చేయగా తిరిగి ఉప ఎన్నికలు అనివా ర్యమయ్యాయి. అదే సంవత్సరం 1952లో జరిగిన ఉప ఎన్నికలలో పీడీఎఫ్‌ అభ్యర్థిగా ఎం.మొహియుద్దీన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జీఎస్‌.రెడ్డిపై గెలుపొందారు. అనంతరం 1957లో జరిగిన ఎన్నికలలో పీడీఎఫ్‌ అభ్యర్థిగా దొడ్డా నర్సయ్య కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వీబీ.రావుపై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మహాకూటమి తరఫున టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డిపై, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి శంకరమ్మపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఇప్పటి వరకు మొత్తంగా కాంగ్రెస్‌ 4సార్లు గెలుపొందింది.

సిమెంట్‌ పరిశ్రమలకు నెలవు 
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో పేరుపొందిన సిమెంట్‌ పరిశ్రమలు ఉన్నాయి. మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి, నేరేడుచర్ల మండలాల్లోని కృష్టపట్టె ప్రాంతంలో విరివిగా సున్నపురాయి నిక్షేపాలు ఉండడంతో పరిశ్రమలు ఏర్పాటు చేశారు. మైహోం, నాగార్జున, సాగర్‌ సిమెంట్స్, అంజనీ, కోరమాండల్, సువర్ణ, పెన్నా, డెక్కన్, విశ్వం తదితర 16 సిమెంట్‌ పరిశ్రమలు ఏర్పడ్డాయి. 

తెలంగాణలో సిమెంట్‌ పరిశ్రమలకు నెలవుగా పేరొందిందిన హుజూర్‌నగర్‌ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఇంకా ప్రాధాన్యం పెరిగింది. హుజూర్‌నగర్‌లో ఈ సారి జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిలవనున్నాయి. వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. టీఆర్‌ఎస్‌ 107 నియోజకవర్గాలలో తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా ఉన్న నియోజకవర్గాల జాబితాలో హుజూర్‌నగర్‌ కూడా ఒకటి. ప్రస్తుతం హుజూర్‌నగర్‌ నియోజకవర్గం ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top