'క్లీన్‌' వాటర్‌

WHO COVID 19 Alert on Healthy Water And HMWS Focus on it - Sakshi

గ్రేటర్‌లో డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల మేరకు తాగునీరు

నల్లానీటి నాణ్యతకు జలమండలి ప్రత్యేక చర్యలు

కోవిడ్‌ వైరస్‌ నేపథ్యంలో మరింత కట్టుదిట్టం

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ అలర్ట్‌ నేపథ్యంలో గ్రేటర్‌లో నల్లా నీటి నాణ్యతను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాల మేరకు నిర్వహించేందుకు జలమండలి ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. నీటిశుద్ధి ప్రక్రియలో ఆలం వినియోగాన్ని పెంచడం, మహానగరం పరిధిలోని సుమారు 300 భారీ స్టోరేజి రిజర్వాయర్ల వద్ద క్లోరినేషన్, బూస్టర్‌ క్లోరినేషన్‌ ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించాలని, రిజర్వాయర్ల పరిసరాల్లో అపరిశుభ్రతకు తావులేకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ వేయాలని ఎండీ దానకిశోర్‌ ఆదేశించారు. నీటి శుద్ధి ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి మాస్క్‌లు, చేతి గ్లౌజులు, శానిటైజర్‌ అందజేయడంతోపాటు ఇతర ప్రత్యేక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. గ్రేటర్‌ నగరానికి ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలే దాహార్తిని తీర్చే వరదాయినుగా మారాయి. జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి కేవలం 15 ఎంజీడీల నీటినే సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానగరం తాగునీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరి జలాలపైనే ఆధారపడింది. ఆయా జలాశయాల నుంచి రోజువారీగా 468 మిలియన్‌ గ్యాలన్ల నీటిని జలమండలి నగర తాగునీటి అవసరాలకు సేకరించి శుద్ధి చేస్తోంది. ఈ నీటిని సుమారు 10 లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. 

నీటి నాణ్యత పక్కాగా..
ప్రధానంగా జలమండలి సరఫరా చేస్తున్న నీటి రంగు, కరిగిన ఘన పదార్థాలు, వాసన, గాఢత, విద్యుత్‌ వాహక, లవణీయత, అమోనియా, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లు, నైట్రేట్లు, క్లోరైడ్‌లు, ఫ్లోరైడ్స్, సల్ఫేట్‌లు, ఇ.కోలి వంటి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఇలా 13 రకాల పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పరీక్ష ఫలితాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఉన్నాయో లేదో ప్రయోగశాలలో పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల్లో నల్లా నీటి నాణ్యత ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ (ఐఎస్‌ఓ) ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

బూస్టర్‌ క్లోరినేషన్‌తో..  
వేసవి వచ్చిందంటే చాలు గ్రేటర్‌లో ఒకప్పుడు గరళ జలాలతో పలు బస్తీలు.. కాలనీలు గడగడలాడే దుస్థితి. భోలక్‌పూర్‌లో 2009లో కలుషిత జలాలు తాగిన ఘటనలో ఏకంగా పదిమంది మృత్యువాతపడడం అప్పట్లో సంచలనం సృష్టించింది. గత నాలుగేళ్లుగా ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు జలమండలి నడుం బిగించింది.  ఫిల్టర్‌ బెడ్స్‌ వద్ద ఆలం అనే రసాయనంతో పాటు నీటిని నిల్వచేసే స్టోరేజి రిజర్వాయర్ల వద్ద బూస్టర్‌ క్లోరినేషన్‌ ప్రక్రియను నిర్విరామంగా చేపడుతుండడంతో నీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది. నీటి రంగు, రుచి, వాసనే కాదు.. రసాయన, భౌతిక ధర్మాలు సైతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు నమోదవుతుండడం విశేషం.  ప్రతి స్టోరేజి రిజర్వాయర్‌ వద్ద బూస్టర్‌ క్లోరినేషన్‌ రూమ్‌లతోపాటు ప్రత్యేకంగా క్లోరిన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచుతుండడంతో గరళ జలాల నుంచి సిటీజన్లకు విముక్తి లభించింది. మంచినీరు, మురుగు నీటి పైపులైన్లు పక్కపక్కనే ఉన్న చోట తాగునీరు కలుషితమైన పక్షంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుండడంతో పరిస్థితి మెరుగైంది. సమస్యలను పరిష్కరించిన తర్వాత వినియోగదారుల ప్రతిస్పందన తీసుకోవడం, నీటి నాణ్యతపై థర్డ్‌పార్టీ ఏజెన్సీలతో వరుస తనిఖీలు చేస్తుండడంతో ఒకప్పుడు నిత్యం వందల్లో అందే కలుషిత ఫిర్యాదులు ఇప్పుడు పదులసంఖ్యకు చేరుకోవడం విశేషం.

నిత్యం ఐదువేల నీటి నమూనాలకు పరీక్షలు  
నీటి నాణ్యతను పరీక్షించేందుకు నిత్యం గ్రేటర్‌ నలుమూలల నుంచి ఐదువేల నల్లా నీటి నమూనాలను సేకరించి జలమండలి నాణ్యతా విభాగంతోపాటు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సిస్టం, స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో పరీక్షింపజేస్తున్నాం. గ్రేటర్‌లో ప్రతి స్టోరేజి రిజర్వాయర్‌ వద్ద బూస్టర్‌ క్లోరినేషన్‌ ప్రక్రియను నిర్వహించడంతో పాటు సీజన్‌లవారీగా రిజర్వాయర్ల శుద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. అవసరమైన క్లోరిన్‌ సిలిండర్లను ఎక్కడికక్కడే అందుబాటులో ఉంచుతున్నాం. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top