ఎమ్మెల్సీలన్నీ గెలుస్తాం

TRS WIll Win In Five MLC Seats Says KTR - Sakshi

మాకు సంఖ్యా బలం ఉంది: కేటీఆర్‌ 

మిత్రపక్షం కాబట్టే ఎంఐఎంకు ఒక స్థానం 

నైరాశ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌  

మంత్రివర్గంలో ఎవరుండాలనేది ముఖ్యమంత్రి ఇష్టం

ఏపీలో వైఎస్సార్‌సీపీదే విజయమన్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. ఆ మేరకు తమకు సంఖ్యా బలం ఉందన్నారు. ఏపీలో చంద్రబాబు వంద శాతం ఓడిపోతారని, వైఎస్సార్‌సీపీ తప్పకుండా గెలుస్తుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్‌ శనివారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కచ్చితంగా గెలుస్తాం. ఎంఐఎం మా మిత్రపక్షం. అందుకే ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాం. మాకు సరైన సంఖ్య ఉన్నందునే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించాం. 

కాంగ్రెస్‌ వాళ్లు చెబుతున్నట్లుగా లోక్‌సభ ఎన్నికలు రాహుల్‌ వర్సెస్‌ మోదీ అన్నట్లుగా ఉండవు. జాతీయ పార్టీలకు సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఢిల్లీని శాసించాలంటే టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లు గెలవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నైరాశ్యంలో ఉంది. ఢిల్లీని శాసిద్దాం అనే నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నాం. పార్లమెంట్‌ సన్నాహక సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో షెడ్యూల్‌ ప్రకటిస్తాం. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాం. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పరిణామాలు మంచివి కావు. రెండు దర్యాప్తు సంస్థల మధ్య విభేదాలు సరికాదు’అని అన్నారు. 

మార్చి 1 నుంచి లోక్‌సభ ప్రచారం: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మార్చి 1 నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులను, శ్రేణులను లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరగనున్నాయి. కరీంనగర్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ నుంచి వీటిని ప్రారంభించనున్నారు. మార్చి 1న కరీంనగర్, 2న వరంగల్, భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్ల సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలతో సమన్వయం, టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేలా ఈ సమావేశాలు సాగనున్నాయి. 

నిఘా వైఫల్యమూ బయటికొస్తుంది... 
‘పుల్వామా దాడి విషయంలో బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తే... కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యం కూడా బయటకొస్తుంది. భావోద్వేగాలతో గెలుపు సాధ్యం కాదు. పుల్వామా ఘటనను రాజకీయంగా వాడుకుంటే ప్రజలు తిప్పికొడతారు. ప్రస్తుతం ప్రధానిగా మోదీ ఉన్నారు. అందుకే మళ్లీ ఆయనే ప్రధాని అవుతారని సర్వే ఫలితాలు వస్తున్నాయి. మోదీకి గెలుస్తాననే ధీమా ఉంటే వివిధ పార్టీలతో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలను బట్టే ఫెడరల్‌ ఫ్రంట్‌ సమీకరణలు ఉంటాయి. ఏపీలో వైఎస్సార్‌సీపీ తప్పకుండా గెలుస్తుంది. 

చంద్రబాబు దారుణంగా ఓడిపోతారు. బాబులో నిరాశ నిస్పహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన నిద్రలోనూ కేసీఆర్‌ అని కలవరిస్తున్నారు. బాబు పక్క పార్టీలపై ఏడవకుండా ఏపీకి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలి. ఢిల్లీలో కాదు అమరావతిలోనూ చక్రం తిప్పలేరు. ఏపీలో పారిశ్రామికవేత్తలపై ఆదాయ పన్ను శాఖ తనిఖీలు జరిగితే బాబుకు ఎందుకు బాధ. ఆయనకు బినామీలు ఉన్నారా? ప్రతి దానిపై నిందలు వేయడం ఎందుకు బాబు? దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఐటీ దాడులు జరుగుతాయి. ఒక్క చంద్రబాబుకే ఉలిక్కిపాటు ఎందుకు. మేం ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా ఏ ఒక్క పని చేయనప్పుడు కేసీఆర్‌ విషయంలో చంద్రబాబు ఎన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టినా అక్కడి ప్రజలు పట్టించుకోరు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ను కలవాల్సిన సమయంలో కలుస్తారు. 

మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా ముఖ్య మంత్రి ఇష్టం. నేనయినా, హరీశ్‌రావు అయినా, మరెవరయినా ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టు బడాల్సిందే. అసెంబ్లీ సంఖ్యా బలంలో 15 శాతం మం దిని మాత్రమే కేబినెట్‌ మంత్రులుగా తీసుకునేలా ఉన్న నిబంధనను సవరించాలి. కొంత వరకు పెంచాలి. పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను కేసీఆర్‌ ఖరారు చేస్తారు. అసెంబ్లీ ముందుగా రద్దు చే శాం కాబట్టి అభ్యర్థులను ముందుగా ప్రకటించారు. ఇప్పుడు ఆ అవసరం లేదు’అని కేటీఆర్‌ అన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top