ఎండల్లో విధులు..తప్పని వెతలు

Traffic Police Staff Suffering in Summer Heat Hyderabad - Sakshi

వేడిగాలులు, వడదెబ్బలతో విలవిల  

ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లపై నిప్పుల కొలిమి     

రద్దీ రూట్లలో నిత్యం నరకం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం  

‘సంగీత్‌ చౌరస్తాలో ఉదయం, సాయంత్రం వేళల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రతి 2–3 నిమిషాలకు వందలాది వాహనాలు రాకపోకలుసాగిస్తాయి. రైల్‌ నిలయం నుంచి చౌరస్తా మీదుగా అమీర్‌పేట్‌ వైపు వెళ్లే వాహనాల రద్దీ మరీ ఎక్కువ. సిగ్నల్‌ పడితే ఈ ఒక్క రూట్‌లోనే పెద్ద సంఖ్యలో వాహనాలకు బ్రేక్‌ పడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయాల్సి ఉంటుంది.  ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. కొంచెం నిర్లక్ష్యం వహించినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం నేను డ్యూటీ చేసే 6గంటల్లో 4గంటలు ఎత్తిన చేతులు దించకుండా పని చేయాల్సి వస్తోంది. నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలతో బాగా నీరసం రావడంతో పాటు వడదెబ్బకు గురవుతున్నామ’ని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రావు. ఇదొక్క శ్రీనివాస్‌రావు కథనే కాదు.. నగరంలోని ఎంతో మంది ట్రాఫిక్‌ కానిస్టేబుళ్ల వ్యధ.  

సాక్షి, సిటీబ్యూరో:అది సంగీత్‌ చౌరస్తా. సికింద్రాబాద్‌లో 24 గంటల పాటూ వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఇటు ఆలుగడ్డ బావి నుంచి ప్యాట్నీ వైపు  మారేడుపల్లి, ప్యాట్నీ వైపు నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వైపు లక్షలకొద్దీ వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కీస్‌ హైస్కూల్‌ వైపు వెళ్లేవి, క్లాక్‌టవర్‌ వైపు వెళ్లే వాహనాలతో  సంగీత్‌ రహదారులు బిజీగా ఉంటాయి. నగరంలోని చాలాచోట్ల చౌరస్తాలను యూటర్న్‌లుగా మార్చిన తర్వాత వాహనాల రద్దీ కొంతమేరకు తగ్గుముఖం పట్టింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, లక్డికాపూల్, తార్నాక చౌరస్తాల్లో యూ టర్న్‌లు అందుబాటులోకి వచ్చాయి. సంగీత్‌ చౌరస్తాలో మాత్రం అందుకు అవకాశం లేదు. ట్రాఫిక్‌ నియంత్రణకు కచ్చితంగా పోలీసులు విధులు నిర్వహించాల్సిందే. నలువైపుల నుంచి దూసుకొచ్చే వాహనాలను ఒక క్రమపద్ధతిలో నియంత్రించి  పంపించాలి. ఇప్పుడు సంగీత్‌ చౌరస్తాలో పని చేసే కానిస్టేబుళ్లు నిప్పుల కొలిమిపై నిలబడి విధులు నిర్వహిస్తున్నారు. గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌రావు సంగీత్‌ చౌరస్తాతో పాటు వైఎంసీఏ, ఆలుగడ్డ బావి చౌరస్తాల్లో కూడా విధులు నిర్వహిస్తాడు. ఎండ తీవ్రత కారణంగా  బాగా నీరసం వచ్చేస్తోందని, వడదెబ్బకు గురవుతున్నామని శ్రీనివాస్‌రావు ఆవేదన వెలిబుచ్చారు.

ప్రతి క్షణం అప్రమత్తం..
సంగీత్‌ చౌరస్తాలో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రతి 2 నుంచి 3 నిమిషాలకు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి, రైల్‌ నిలయం నుంచి సంగీత్‌ మీదుగా అమీర్‌పేట్‌ వైపు వెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క రూట్‌లోనే సిగ్నల్‌ పడగానే సుమారు 2 వేల వాహనాలకు బ్రేక్‌ పడుతుంది. మారేడుపల్లి నుంచి రెతిఫైల్‌ వైపు, కీస్‌ హైస్కూల్‌ నుంచి ప్యాట్నీ వైపు, క్లాక్‌ టవర్‌ వైపు వెళ్లే వాహనాల సంఖ్య కొంచెం తక్కువగానే ఉంటుంది. సంగీత్‌లో ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ రద్దీ  అధికంగా ఉండడంతో పోలీసులే విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్‌రావుతో పాటు మరో  ఇద్దరు అక్కడ పని చేస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి  2 నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టులుగా ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు  అక్కడ పని చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు విధుల్లో చేరిన శ్రీనివాస్‌రావు మధ్యాహ్నం వరకు డ్యూటీలో ఉంటాడు. ‘రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి 2 నుంచి 3 నిమిషాలకు  కంట్రోల్‌ చేసి పంపించాలి. ఎటు వైపు నుంచి వాహనాలు ఎక్కువగా వస్తున్నాయనేది గమనించాలి. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ కొంచెం ఏమరుపాటుగా ఉన్నా  ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంద’ని తన విధి నిర్వహణ గురించి చెప్పారు శ్రీనివాస్‌రావు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 6 గంటల పాటు డ్యూటీ ఉంటుంది. ఈ 6 గంటల వ్యవధిలో  మొదటి 4 గంటల పాటు రద్దీ ఎక్కువగానే  ఉంటుంది. ఆ నాలుగు గంటలు ఎత్తిన చేతులను దించకుండా పని చేయాల్సి వస్తోంది. రద్దీ తక్కువగా ఉన్న సమయంలో నీడకు వెళ్తున్నారు. బాగా తగ్గుముఖంపట్టిన తర్వాత ఆటోమేటిక్‌ సిగ్నళ్లను వినియోగిస్తున్నారు.   

వేడిగాలులు.. వడదెబ్బలు..
ఒకవైపు పోటెత్తే వాహనాలు. మరోవైపు నిప్పుల వాన. ఒక్క క్షణం ఆదమరిచినా ముంచుకొచ్చే ప్రమాదాలు. నిప్పులు చెరుగుతున్న ఎండల్లో ట్రాఫిక్‌ కానిస్టేబుళ్ల విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. నిప్పుల కుంపటిపై నిల్చొని పని చేస్తున్నట్లుగా ఉంది. వేడిగాలులు వీస్తున్నాయి. వడదెబ్బలు తగులుతున్నాయి. అయినా విధి నిర్వహణలో అప్రమత్తతను పాటిస్తున్నారు. వడదెబ్బ వల్ల తరచూ డయేరియాకు గురవుతున్నట్లు  శ్రీనివాస్‌రావు చెప్పారు. ‘ట్రాఫిక్‌ కానిస్టేబుళ్ల ఆరోగ్యం పట్ల అధికారులు  శ్రద్ధ తీసుకుంటున్నారు. రోజుకు 2 గ్లూకోన్‌ డీ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఒక వాటర్‌ బాటిల్‌ ఇస్తారు. కూలింగ్‌ సన్‌గ్లాస్‌ కూడా ఇచ్చారు. మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. అంతా బాగుంది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోతున్నాం’ అని చెప్పారు శ్రీనివాసరావు. ఒకవైపు ఎండతీవ్రత, మరోవైపు వాహనాల వేడి, పొగ, కాలుష్యం బారిన పడి ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు అనారోగ్యానికి గురవుతున్నారు. శ్రీనివాస్‌రావులాంటి వేలాది మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మండుటెండల్లో కరిగిపోతూ ప్రజలకు ప్రమాదరహితమైన  ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top