
కట్నం అడిగితే ద్రోహులే: అమల
కట్నం అడిగిన వారంతా దేశ ద్రోహులు, మహిళా ద్రోహులేనని ప్రముఖ సినీ నటి, బ్లూక్రాస్ సొసైటీ చైర్‌పర్సన్ అక్కినేని అమల అన్నారు.
మన్సూరాబాద్ (హైదరాబాద్): కట్నం అడిగిన వారంతా దేశద్రోహులు, మహిళా ద్రోహులేనని సినీనటి, బ్లూక్రాస్ సొసైటీ చైర్‌పర్సన్ అక్కినేని అమల అన్నారు. ఎల్‌బీ నగర్ చింతలకుంటలోని చైతన్య వికాస్ మహిళా పరస్పర సహాయక సహకార పరపతి సంఘం 9వ వార్షికోత్సవంలో ఆమె మాట్లాడారు. సామాజికంగా, ఆర్థికంగా మహిళలు ముందుండి దేశానికి పేరు తేవాలని కోరారు.
బాల్య వివాహాలు చేయవద్దని, కట్నం అడగొద్దని, ఆడ, మగ తేడా లేకుండా సమానంగా చూడాలని, ఆడపిల్లకు తప్పనిసరిగా విద్యను అందించాలనే అంశాలపై మహిళల నుంచి హామీ తీసుకున్నారు. అనంతరం ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. మహిళలకు చట్టసభల్లోనే కాకుండా విద్య, ఉద్యోగ రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు వర్తించేలా పార్లమెంటులో చట్టం చేయాలని ఆయన అన్నారు.