అల్పపీడనం బలహీనపడుతోంది. అయినా రుతుపవనాలు చురుగ్గా ఉన్నందున సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడా...
నేడు అక్కడక్కడా భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: అల్పపీడనం బలహీనపడుతోంది. అయినా రుతుపవనాలు చురుగ్గా ఉన్నందున సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మూడ్రోజులు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. మధ్యలో ఒకట్రెండు రోజులు సాధారణ పరిస్థితి ఉంటుం దని, మళ్లీ వచ్చేనెల ఒకటో తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అది ప్రస్తుతం అండమాన్‌కు దూరంగా ఉందని, అల్పపీడనంగా ఏర్పడుతుందా లేదా అన్నది అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
ఒకటో తేదీ నుంచి కూడా రాష్ట్రాన్ని వర్షాలు ముంచె త్తే అవకాశాలున్నాయి. ప్రస్తుతం లానినో ట్రెండ్ మొదలైంది. అది మరింత బలపడి అక్టోబర్‌లో మరిన్ని వర్షాలు కురవొచ్చని, దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సి ఉందని రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లాను అతలాకుత లం చేశాయి. మాచారెడ్డిలో 32 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం న మోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు సమాచారం. అందులో సగానికిపైగా మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి.
జిల్లాల్లో విపత్తు సెల్...
వర్షాలకు పంటలు మునుగుతున్నా వాటిని అంచనా వేయడంలో, రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడంలో వ్యవసాయశాఖ విఫలమైందంటూ ‘సాక్షి’ ఆదివారం కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఆదివారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా జేడీఏ కార్యాలయాల్లో విపత్తు సెల్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో ఎన్ని ఎకరాల పంట నీట మునిగిందో తెలుసుకునేందుకు కమిషనరేట్ నుంచి 9 బృందాలను పంపాలని నిర్ణయించారు.
ఆ బృందాలు సోమవారం నుంచి మూడ్రోజులు జిల్లాల్లో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరించాలన్నారు. చెరువులు, కుంటలు తెగడం వల్ల ఎన్ని ఎకరాలు నీట మునిగిందో పరిశీలించాలని కోరారు. పంట నష్టంపై నివేదికను తయారు చేసి పంపించాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో సమన్వయం చేసుకొని రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. రబీకి గ్రామం, పంటల వారీగా విత్తనాలు ఏ మేరకు అవసరమో తెలియజేయాలని సూచించారు. రబీలో హైబ్రీడ్ కూరగాయాల విత్తనాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు.