పెద్దపులి ఎక్కడ..?

Tiger Leg Marks Caught in Jaipur Forest Viral in Social Media - Sakshi

జైపూర్‌ పరిసరాల్లో తిరుగుతున్నట్లుగా పుకార్లు

ఎస్టీపీపీలో సంచరిస్తున్నట్లు వదంతులు

చెన్నూర్‌ వైపు వెళ్లిందంటున్న అధికారులు

జైపూర్‌(చెన్నూర్‌): ఇటీవల అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పెద్దపులి జైపూర్‌ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. జైపూర్‌ చుట్టుపక్కల వెంచర్లలో పెద్దపులి అడుగులుగా భావిస్తూ స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముదిగుంట అటవీప్రాంతం నుంచి వచ్చిన పెద్దపులి జైపూర్‌ పరిసరాల్లో సంచరిస్తున్నట్లుగా స్థానికులు భావిస్తున్నారు. ముదిగుంటలో సంచరిస్తున్న పెద్దపులి భీమారం మండలం కొత్తపల్లి అడవుల మీదుగా ఆస్నాద్‌వైపుగా వెళ్లినట్లుగా అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. పెద్దపులి భీమారం వైపు వెళ్లిందా?...లేక జైపూర్‌ పరిసరాల్లోనే సంచరిస్తుందా? అన్న అనుమానం ఇప్పుడు ప్రతిఒక్కరిలో కలుగుతోంది.జూన్‌ 1నుంచి జనారణ్యప్రాంతంలో కలియతిరగడం...జనావాసాలకు అతి సమీపంలో సంచరిస్తుండడంతో పాటు ప్రత్యక్షంగా చూసిన స్థానికులు ఇదే ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు.

ఈ నెల 5న శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం, ఆర్కే–8గని మీదుగా ఆర్కే–7, ఆర్కే–5 ప్రాంతంలోని ముదిగుంట అటవీప్రాంతంలో పెద్దపులి సంచరించింది. ఒకగేదె, ఆడవిపందిని సైతం హతమార్చింది. గత నెల 29న కాసిపేట మండలం నుంచి కేకే ఓసీపీ, కేకే–3, కేకే–5వైపుగా వెళ్లిన పెద్దపులి మందమర్రి మండలం శంకరపల్లి, సంట్రోన్‌పల్లి, సారంగపల్లి, తుర్కపల్లి, పోన్నారం మీదుగా ఈ నెల 1న కాన్కూర్, ముదిగుంట అటవీప్రాంతాల నుంచి మంచిర్యాల–చెన్నూర్‌ 63వ జాతీయ రహదారి దాటి ఇందారం అటవీప్రాంతానికి చేరుకుంది. ముదిగుంట, ఇందారం అటవీప్రాంతంలో అధికారులు పెద్దపులి అడుగులను గుర్తించారు. 5న శ్రీరాంపూర్‌ ఆర్కే–8 గని ప్రాంతంలో ఓవ్యక్తి స్వయంగా పెద్దపులిని కొంతదూరం నుంచి గమనించి అవాక్కయ్యాడు. అదేప్రాంతంలో పెద్దపులి అడుగులను అటవీశాఖ–పోలీస్‌శాఖ సంయక్తంగా పరిశీలించి గుర్తించారు. చివరగా ఈనెల 10న ఆర్కే–5 సమీపంలో అటవీశాఖ అధికారులు పులి అడుగులను గుర్తించారు. సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటులో శనివారం ఓ సెక్యూరిటీ గార్డు స్వయంగా చూసినట్లుగా చెప్పడం...ఇదే ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా పెద్దఎత్తున పుకార్లు కావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం పెద్దపులి కొత్తపల్లి, ఆస్నాద్‌ అడవుల మీదుగా చెన్నూర్‌ వైపు వెళ్లినట్లు చెప్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top