పాలమూరు రాజకీయాలలో వీడని ఉత్కంఠ..! | Tickets Are Not Confirm In Palamuru | Sakshi
Sakshi News home page

పాలమూరు రాజకీయాలలో వీడని ఉత్కంఠ..!

Nov 18 2018 11:00 AM | Updated on Mar 6 2019 6:10 PM

 Tickets Are Not Confirm  In Palamuru - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : మహాకూటమితో పాటు బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి సస్పెన్స్‌ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు సోమవారం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఎనలేని తాత్సర్యం చేస్తుండడం ఆశావహులకు ఆవేదన, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఒక్క టీఆర్‌ఎస్‌ మాత్రమే ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాలకు ఒకేసారి ప్రకటించడంతో పాటు... ప్రచారంలో నిమగ్నమైంది.

ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమి ఇప్పటి వరకు మూడు జాబితాలు విడుదల చేసినా ఇంకా రెండు స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లోనే ఉంచారు. కాంగ్రెస్‌కు సంబంధించి శనివారం మూ డో జాబితా విడుదల కాగా.. ఇందులో కొల్లాపూర్‌ స్థానానికి బీరం హర్షవర్ధన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అలాగే ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ కూడా ఇప్పటి వరకు మూడు జాబితాలు విడుదల చేసినప్పటికీ... రెండు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను వెల్లడించలేదు.

 జడ్చర్ల, కొల్లాపూర్‌ స్థానాలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈనెల 19వ తేదీ సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా.. మహాకూటమితో పాటు బీజేపీ మిగిలిపోయిన స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.  


ఆది నుంచి అంతే.. 
టీఆర్‌ఎస్‌ను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో జట్టు కట్టిన మహాకూటమిలోని పార్టీలు ఆది నుంచి పొత్తులు, లెక్కల సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూటమిలోని కాంగ్రెస్, టీడీపీకి మాత్రమే అభ్యర్థులకు స్థానం దక్కింది. కూటమిలో భాగస్వామ్యమైన టీజేఎస్, సీపీఐకి పోటీ చేసే అవకాశం లభించలేదు. మొత్తం 14 స్థానాలకు ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మూడు సార్లు విడుదల చేసిన జాబితాలో పది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

అలాగే కూటమి భాగస్వామ్యంలో భాగంగా రెండు స్థానాలు మహబూబ్‌నగర్, మక్తల్‌ను టీడీపీకి కేటాయించింది. ఇక మిగిలిన రెండు స్థానాలు దేవరకద్ర, నారాయణపేటకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటి విషయంలో ఎడతెగని సస్పెన్స్‌ కొనసాగుతోంది. సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండడంతో ఆదివారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, బీజేపీ సైతం కొల్లాపూర్, జడ్చర్ల స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో కొల్లాపూర్‌ నుంచి సుధాకర్‌రావు అభ్యర్థిత్వానికి బీజేపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.  


లెక్కల సమీకరణాలు 
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆయా పార్టీలకు కత్తిమీద సాములా మారింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 స్థానాలకు గాను రెండు స్థానాలు ఎస్సీ రిజర్వుడ్‌గా ఉన్నాయి. మిగిలిన 12 జనరల్‌ స్థానాల విషయంలో అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాల లెక్కలు ఆయా పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే డిమాండ్‌ గట్టిగా వినిపిస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలోని జనరల్‌గా ఉన్న 12 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ముగ్గురు బీసీలకు అవకాశం కల్పించింది.

షాద్‌నగర్‌ నుంచి అంజయ్య యాదవ్, కల్వకుర్తి నుంచి జైపాల్‌ యాదవ్, మహబూబ్‌నగర్‌ నుంచి శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్లు దక్కాయి. అలాగే బీజేపీ నుంచి ఇప్పటి వరకు ప్రకటించిన 12 స్థానాల్లో ఐదుగురు బీసీలకు స్థానం దక్కింది. కల్వకుర్తి నుంచి టి.ఆచారి, నాగర్‌కర్నూల్‌ నుంచి దిలీప్‌ ఆచారి, కొడంగల్‌ నుంచి నాగూరావ్‌ నామాజీ, దేవరకద్ర నుంచి ఎగ్గని నర్సింహులు, మక్తల్‌ నుంచి కొండయ్యకు అవకాశం కల్పించారు. అయితే మహాకూటమి నుంచి కేవలం ఒక్క స్థానం మహబూబ్‌నగర్‌ నుంచి ఎర్ర శేఖర్‌కు మాత్రమే అవకాశం కలిగింది.

దీంతో కూటమి అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాల రచ్చ కొనసాగుతోంది. కాగా, పెండింగ్‌లో ఉంచిన స్థానాలలో ముందు నుంచి పనిచేసుకుంటున్న వారికి అవకాశం కల్పించాలనే డిమాండ్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం వద్దగా ఆశావహులు గట్టిగా వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఆదివారం రాత్రి వరకు మహాకూటమి, బీజేపీకి సంబంధించి నాలుగు స్థానాల అభ్యర్థులను ప్రకటిస్తే సమీకరణాల లెక్కలు తేలనున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement