డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అంతరంగం


- ఎన్నో కష్టాలకు ఎదురీది విజయ తీరాన్ని చేరిన డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అంతరంగం

 

మాది నిరుపేద కుటుంబం. మా ఆర్థిక పరిస్థితులు బాగాలేక నాలుగో తరగతి తర్వాత మా నాన్న నన్ను బడికి కాకుండా పశువులుకాసే పనికి పంపాడు. ఇంద్రసేనారెడ్డి అనే సార్ మా నాన్న వద్దకు వచ్చి ‘నీ కొడుకు బాగా చదివి డాక్టరో, ఇంజనీరో అవుతాడని అనుకుంటే.. నువ్వేమో పశువులను కాయిస్తున్నావా’ అని అన్నారు. నా చదువు మళ్లీ మొదలైంది. నేను మ్యాథ్‌‌స బాగా చేస్తాను. ఇంజనీర్ అవుదామనుకున్నా. మా బంధువు ఒకరు ‘నువ్వు బాగా చదువుతావు.. డాక్టర్ అవ్వు అన్నాడు’. దాంతో బైపీసీ గ్రూపులోకి మారాను. ఆ తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేశాను.  ఉద్యోగం వచ్చినా.. సొంత ప్రాక్టీస్‌పైనే దృష్టిపెట్టిన. రాజకీయూలపై మొదట్లో ఆసక్తి లేకపోరుునా 1997లో సోనియాగాంధీ ‘డు కమ్ ఇన్ టూ పాలిటిక్స్’ అని ఆహ్వానించడంతో కాంగ్రెస్‌లో చేరాను. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచా. 2012లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్‌లో చేరిన. కేసీఆర్ అభిమానంగా చూసుకున్నారు. ఇటీవల ఎన్నికలు ముగిసిన వెంటనే కేసీఆర్ గారు అందరిముందు ‘వైద్య ఆరోగ్య శాఖ మా రాజయ్య చూస్తడు’ అన్నరు. అప్పుడే నాకు మంత్రి పదవి ఖరారైందని తెలిసింది. జూన్ ఒకటిన మరోసారి గుర్తు చేద్దామని వెళ్లా... ‘నిన్ను డిప్యూటీ సీఎంను చేస్తున్నాను. రేపటి దాకా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. మీ ఆవిడకు కూడా తెలియవద్దు’ అన్నారు. ఆ క్షణం నా సంతోషానికి అవధుల్లేవు.  


 

మాది స్టేషన్‌ఘన్‌పూర్. నాన్న వెంకటయ్య, అమ్మ లక్ష్మి. నాకు ఒక తమ్ముడు, నలుగురు చెల్లెళ్లు. నిరుపేద కుటుంబం. నాన్న పాలేరు. మా సొంతూరు తాటికొండ(స్టేషన్‌ఘన్‌పూర్ మండలం). ఇంటిపేరు మారపాక. మా పూర్వీకులు స్టేషన్‌ఘన్‌పూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. తాటికొండ ఊరు నుంచి వచ్చినందున అక్కడ మా ఇంటిపేరు తాటికొండగా మారింది. నేను మా అమ్మమ్మ వాళ్లింట్లో(రాజవరం) పుట్టాను. మా అమ్మమ్మ వేములవాడ రాజన్న భక్తురాలు(శివసత్తి). ఆమె నాకు రాజన్న అని పేరు పెట్టింది. ఇప్పటికీ వేములవాడకు వెళ్తుంటా. ఉప ముఖ్యమంత్రి అయ్యాకా వెళ్లొచ్చా. ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడే ఫాతిమామేరీతో పెళ్లయింది. ఆమెను భారతి అని పిలుస్తా. మా పెళ్లప్పుడు ఆమె పదో తరగతి. ఆ తర్వాత కష్టపడి లైబ్రరీ సైన్స్‌లో పీజీ పూర్తి చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సీనియర్ లైబ్రేరియన్‌గా పనిచేస్తోంది. నా జీవిత పయనంలో ఆమె పాత్ర ఎక్కువ. నా ఈ ఎదుగుదలకు ఆమే కారణం. నేనిప్పటికీ బట్టలు కూడా కొనుక్కోను. అన్నీ ఆవిడే చూస్తుంది. పిల్లల చదువు.. ఇంటి వ్యవహారం అన్నీ ఆమెకే తెలుసు. ఇద్దరు కుమారులు క్రాంతిరాజ్, విరాజ్... కోడళ్లు సింధు, శీతల్ వైద్యులే.

 

నాన్నే నా కొడుకులా...



నిజానికి మా నాన్నకు నేను కొడుకుగా కంటే తండ్రిగానే వ్యవహరించాను. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు మా పెద్ద చెల్లెలి పెళ్లి చేశాం. ఎండాకాలమంతా కూలిపని చేస్తే రూ.200 వచ్చాయి. దాంతో మా పెద్ద చెల్లి పెళ్లి చేశాం. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు రెండో చెల్లి పెళ్లి అయింది. ఈ పెళ్లి కోసం నా పెళ్లి కుదిరింది. నా పెళ్లి ఖర్చులకని మా మామ ఐదు వేల రూపాయలు ఇచ్చారు. వాటితో రెండో చెల్లి పెళ్లి చేశాను. ఆ తర్వాత నా ప్రాక్టీస్ మీద మిగిలిన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చేశా. పాలేరుగా ఉన్న నాన్నకు సొంత భూమి కొనిచ్చి యజమానిని చేసిన. 2008 ఎన్నికలప్పుడు నేను నామినేషన్ వేసి రెండు రోజులకే మా నాన్న చనిపోయాడు. నా ఎన్నిక విషయంలో గెలుపోటములపై రందితోనే అలా జరిగిందేమో. నాన్న మరణం నా జీవితంలో ఎక్కువ బాధాకరమైన సందర్భం. నా జీవితంలో మరిచిపోలేని వ్యక్తి.. ఫాదర్ కొలంబో. నాకు మార్గదర్శకుడు. చదువుకునేందుకు నాకు సహాయం చేశారు. క్రమశిక్షణ ఆయన నుంచే నేర్చుకున్నా. 2009లో నేను ఎమ్మెల్యే అయ్యాక మరణించారు. అయన అంతిమ సంస్కారాలు చేసే రోజునే.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణించే హెలికాప్టర్ మిస్సయిందనే సమాచారం వచ్చింది. నా రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి. నేను ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలల 17 రోజులకే వైఎస్ మరణించారు. అది బాగా బాధ కలిగించింది.  

 

సార్ మాటలు నమ్మకాన్ని పెంచారుు

 

నాలుగో తరగతి వరకు ఊళ్లోనే చదివా. చిన్నప్పుడు నాతోటి వాళ్లు బడికి పోతుంటే నేను పశువులు మేపేందుకు వెళ్లేవాడిని. ఒక్క పశువు కాస్తే ఒక్క రూపాయి ఇచ్చేవారు. 31 పశువులను కాసేవాడిని. 13 నెలలు పశువులు కాశాను. నేను పశువులు కాస్తున్నా నా దృష్టంతా బడిమీదనే. మా పాఠశాలలో ఇంద్రసేనారెడ్డి అనే  మా సార్ ఉండె. ఆ సార్ మా నాన్న దగ్గరికొచ్చి ‘అరె వెంకటి నీ కొడుకు బాగా చదివి డాక్టరో, ఇంజనీరో అవుతాడని అనుకుంటే.. నువ్వేమో పశువులను కాయిస్తున్నావా’ అని అన్నారు. ఆ మాటలను అక్కడే ఉన్న నేను విన్నాను. ఆ మాటలు నా మీద నాకు నమ్మకం పెంచాయి. అట్లా నా చదువు మళ్లీ మొదలైంది. నేను మ్యాథ్‌మెటిక్స్ బాగా చేస్తాను. టెన్త్‌లో నాది కాంపోజిట్ మాథ్స్. కనుక ఇంజనీర్ అవుదామనుకున్నా. ఇంటర్మీడియట్ ఎంపీసీలో జాయిన్ అయ్యా. మా కజిన్ బాలస్వామి అప్పటికే ఆర్‌ఈసీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఓసారి ఆయన నా దగ్గరికొచ్చి ‘మన తాటికొండ వారిలో నేను ఇంజనీర్‌ను అవుతున్నాను.. నువ్వు బాగా చదువుతావు డాక్టర్ అవ్వు అన్నాడు’. అంతే.. ఆ మాటతో బైపీసీ గ్రూపులోకి మారాను. ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు బాలసముద్రం హాస్టల్‌లో ఉండేవాడిని. కేఎంసీలో 1981లో ఎంబీబీఎస్ పూర్తి చేశాను.

 

మొదటి పిల్లల నర్సింగ్ హోం...

 

ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టిన. కొత్తలో ఖాళీ లేకుండా పనిచేశాను. 1984లో ట్రైబల్ మెడికల్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పోస్టింగ్. జీతం రూ.3200. అప్పుడే ఎంఎస్(ఈఎన్‌టీ)లో సీటు వచ్చింది. అప్పటికి నేను ప్రాక్టీస్‌లో ఉన్నాను. పీజీ చేస్తే బాగుంటుందని ఈఎన్‌టీలో జాయిన్ అయ్యా. దాంట్లో నాకు సంతృప్తి కలగలేదు. తొమ్మిది నెలల తర్వాత  పిల్లల డాక్టర్ కావాలని డీసీహెచ్ చేశాను. 1987లో ఏపీపీఎస్సీ ద్వారా ఖమ్మం జిల్లా వైరాలో అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఉద్యోగం వచ్చింది. అప్పటికే ప్రాక్టీసుతో రూ.10 వేల వరకు వస్తోంది. ఉద్యోగంతో వచ్చేది సగమే. దీంతో ప్రైవేట్ ప్రాక్టీస్‌కే మొగ్గు చూపాను. జిల్లాలో పిల్లల వైద్యానికి సంబంధించిన ఒక్క నర్సింగ్‌హోమ్ కూడా లేదు. దీన్ని గమనించి క్రాంతి చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్‌ను ప్రారంభించా. వరంగల్ జిల్లాలో ఇదే మొదటి పిల్లల నర్సింగ్ హోం. ఒక దళిత డాక్టర్ నర్సింగ్ హోం పెట్టడం కూడా అదే తొలిసారి. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పేషెంట్లు వచ్చేవారు.

 

మొదటి నుంచీ ప్రజల్లోనే..

 

విద్యార్థిగా ఉన్నప్పుడు విప్లవ భావాలను ఇష్టపడేవాడిని. పీడీఎస్‌యూలో పనిచేశా. 1984-88లో జూనియర్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. నా ప్రాక్టీస్ బాగా నడుస్తున్న రోజుల్లోనే ప్రతి ఆదివారం, బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో వైద్యం అందించేవాడిని. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టాను. వైద్యం, మందులు అన్ని నేనే సమకూర్చుకునేవాడిని. ఈదురుమూడిలో ఎంఆర్‌పీఎస్ ఉద్యమం మొదలైంది. తెలంగాణలో ఒక ఎస్సీ మాదిగ డాక్టర్‌గా నా జాతి హక్కుల కోసం ముందు నిలబడ్డాను. నా కులాన్ని నేను గొప్పగా చెప్పుకున్నా. ఆత్మగౌరవం కోసం పోరాడాను. అప్పుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆర్.విల్సన్ నేను కలిసి పనిచేశాం. జిల్లాలోనే ప్రభుత్వ అనుమతితో అంబేద్కర్ విగ్రహం నేను మొదట పెట్టించా. హాస్పిటల్ పెట్టే క్రమంలో సమస్య వస్తే ప్రణయభాస్కర్ సహకరించారు.

 

చిన్నప్పుడే జై తెలంగాణ



నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం అంటే ఏమిటో అప్పుడు తెలియదు. అందరి లాగే మేమూ జై తెలంగాణ అంటూ రోడ్లమీద పడ్డాం. లాఠీదెబ్బలు తిన్నా. ఓసారి విజయవాడ నుంచి వచ్చే ప్యాసింజర్ రైలును అడ్డుకునేందుకు రైలు పట్టాలకున్న బోల్ట్‌లను తొలగించాం. పోలీసులు తరిమారు. రెండు మూడు కిలోమీటర్లు ఉరికి ఓ పశువుల కొట్టంలో దాసుకున్నం. చీకటి అయ్యాక ఇంటికి వెళ్లిపోయాను.

 

రాజకీయాలు...



1994 ఎన్నికల ముందు దాస్యం ప్రణయ్‌భాస్కర్‌ను తీసుకుని దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు నా దగ్గరికి వచ్చి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఆ తర్వాత బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కూడా ఆహ్వానించారు. రాజకీయాలంటే నాకు ఇష్టం లేదని చెప్పాను. దండోరా ఉద్యమం తర్వాత నా దృక్పథంలో మార్పు వచ్చింది. 1997లో వైఎస్ రాజశేఖరరెడ్డి.. సోనియాగాంధీ వద్దకు తీసుకెళ్లారు. అప్పుడామె ‘డు కమ్ ఇన్ టు పాలిటిక్స్’ అని ఆహ్వానించారు. అప్పుడు కాంగ్రెస్‌లో చేరాను. 1999లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయా. 2004లో అవకాశం రాలేదు. 2008 ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు. 2009లో నాలుగు పార్టీలు మహాకూటమిగా ఉన్నా అడ్డంకులను అధిగమించి 11,600 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను.

 

టీఆర్‌ఎస్ ప్రస్థానం...

 

నేను ఎమ్మెల్యే అయిన కొన్ని నెలలకు, 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అదే రోజు కొందరు వైద్య మిత్రులు కలిసి ఎంజీఎంకు ప్రొజెక్టురు డొనేట్ చేసే కార్యక్రమం ఉండె. నేను గెస్ట్‌గా వెళ్లా. నా మిత్రులు జై తెలంగాణ నినాదాలు చేశారు. నన్నూ అనమన్నారు. అన్నాను. యూనివర్సిటీలో విద్యార్థులు మిగిలిన ప్రజాప్రతినిధులపైకి చెప్పులు వేసి వ్యతిరేకత తెలిపినా నన్ను మాత్రం పూలదండలతో ఆహ్వానించారు. కేసీఆర్ నిమ్స్‌లో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి వచ్చా. తెలంగాణ కోసం నాలుగుసార్లు రాజీనామా చేశాను. 2012లో కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. మలిదశ ఉద్యమంలో అధికార పార్టీని వీడిన తొలి దళిత ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన. తర్వాత కేసీఆర్‌గారు నన్ను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. నాపై నమ్మకంతో 87 నియోజకవర్గాల్లో తిప్పారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్‌ల బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని కార్యక్రమాలకు నేనే వెళ్లేవాడిని. నాకు ఇది బాగా కలిసివచ్చింది. కేసీఆర్‌గారు ఎన్నికలు ముగిసిన వెంటనే అందరిముందు ‘వైద్య ఆరోగ్య శాఖ మా రాజయ్య చూస్తడు’ అన్నరు. అప్పుడే నాకు మంత్రి పదవి ఖరారైందని తెలిసింది. జూన్ ఒకటిన మరోసారి గుర్తు చేద్దామని వెళ్లా ‘నిన్ను డిప్యూటీ సీఎంను చేస్తున్నాను. రేపటి దాకా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. మీ ఆవిడకు కూడా తెలియవద్దు’ అన్నారు. ఆ క్షణం నా సంతోషానికి అవధుల్లేవు. జీవితంలో ఎక్కువ ఉత్కంఠ అనుభవించిన రోజు అదే. తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేసుకుంటూ పోతున్నా. నాకు ఉన్నతమైన స్థానం కల్పించిన కేసీఆర్‌కు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటా.. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తా. అందరూ బాగుండాలని కోరుకుంటా. ‘నీ వలెనే నీ పొరుగువారిని ప్రేమించు’ అనే ఏసుక్రీస్తు సూక్తి నాకు ఎప్పడూ స్ఫూర్తిగా ఉంటుంది.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top