పార్టీ ఫిరాయింపుపై సమాధానమివ్వండి

పార్టీ ఫిరాయింపుపై సమాధానమివ్వండి - Sakshi


* ఐదుగురు టీటీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

* బదులిచ్చేందుకు వారం గడువు


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల అధికార టీఆర్‌ఎస్‌లో చేరిన ఐదుగురు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ మధుసూదనాచారి గురువారం నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుపై వారంలోగా సమాధానమివ్వాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్. కె.పి. వివేకానంద, సాయన్నలను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలిచి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న వీరిపై అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ టీడీపీ నాయకత్వం స్పీకర్‌కు లేఖ సమర్పించిన నేపథ్యంలో ఆయన ఈ చర్య చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ నుంచి గెలిచిన మొత్తం 15 మంది ఎమ్మెల్యేలలో గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఇటీవల మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తమ సంఖ్య పదికి చేరినందున మెజారిటీ సభ్యుల ఏకాభిప్రాయం మేరకు టీటీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలంటూ పిటిషన్‌పై సంతకాలు చేసి ఎర్రబెల్లి ద్వారా స్పీకర్‌కు సమర్పించారు.



అయితే ఎర్రబెల్లి పార్టీ మారుతున్నట్లు తెలిసిన వెంటనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ ఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు చెబుతూ ఎల్పీ నేతగా ఆయన్నే గుర్తించాలని స్పీకర్ లేఖ రాశారు. ఎర్రబెల్లి సమర్పించిన విలీనం పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే స్పీకర్ ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ నెల 10 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో స్పీకర్ నోటీసులు జారీ చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతేడాది, అంతకన్నా ముందే టీఆర్‌ఎస్‌లో చేరిన టీటీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, సి. ధర్మారెడ్డి, ఎం. కృష్ణారావు, ఎం. కిషన్‌రెడ్డిలకు స్పీకర్ గతంలోనే నోటీసులివ్వడం తెలిసిందే.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top