..మరింత స్పీడ్‌

Telangana Police Focuses On Response Time For Crime Emergency - Sakshi

సత్వర స్పందనపై పోలీసుల దృష్టి

కాల్‌ లొకేషన్‌  గుర్తింపు..!

గస్తీ వాహనాలకు శాశ్వత నంబర్లు

3 కమిషనరేట్లలో  కేటాయింపు..

సాక్షి, హైదరాబాద్‌ : ఏదైనా నేరానికి సంబంధించి బాధితుల నుంచి సమాచారం అందాక పోలీసులు ఎంత త్వరగా వారి వద్దకు చేరుకోగలిగితే అంత మంచిది. సాంకేతికంగా రెస్పాన్స్‌ టైమ్‌గా పిలిచే ఇది ఎంత తక్కువుంటే పోలీసులపై అంత నమ్మకం పెరుగుతుంది. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో 7 – 10 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 12 – 20 నిమిషాలుగా ఉన్న రెస్పాన్స్‌ టైమ్‌ను మరింత తగ్గించాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘డయల్‌–100’కు ఫోన్‌చేసిన కాలర్‌ లొకేషన్‌ తెలుసుకోవడంతో పాటు గస్తీ వాహనాలైన పెట్రో మొబైల్స్‌ (తేలికపాటి వాహనాలు), బ్లూకోల్ట్స్‌ (ద్విచక్ర వాహనాలు)కు శాశ్వత నంబర్‌ కేటాయింపునకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఇలా..
రాష్ట్ర వ్యాప్తంగా 722 పోలీసుస్టేషన్లలో 810 పెట్రోమొబైల్స్, 1,515 బ్లూకోల్ట్స్‌ 81 హైవే పెట్రోలింగ్‌ వాహనాలు గస్తీ నిర్వర్తిస్తున్నాయి. ఆపదలో ఉండి పోలీసులకు ఫోన్‌చేసే బాధితులు తామున్న ప్రాం తాన్ని స్పష్టంగా చెప్పలేరు. దీంతో గస్తీ సిబ్బంది పదేపదే కాల్స్‌చేస్తూ వారుండే ప్రాంతాన్ని గుర్తించాల్సి వస్తోంది. దీంతో పోలీసుల రెస్పాన్స్‌ టైమ్‌ ఎక్కువవుతోంది. గస్తీ విధానంలో జవాబు దారీతనం పెంచడం, తక్కువ టైంలో ఘటనాస్థలికి చేరుకోవడం కోసమే పెట్రో మొబైల్స్, బ్లూకోల్ట్స్‌కు ‘రెస్పాన్స్‌ టైమ్‌’ నిర్దేశిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే గస్తీ వాహనాలను ‘డయల్‌–100’తో అనుసంధానించారు. జీపీఎస్‌ ఆధారం గా పనిచేసే ఈ విధానం ఫలితాలివ్వాలంటే బాధితులున్న ప్రాంతాన్ని (లొకేషన్‌) తెలుసుకోవాలి. ఇది సాధ్యమైతే రెస్పాన్స్‌ టైమ్‌ను తగ్గించవచ్చని భావిస్తోన్న డీజీపీ కార్యాలయం.. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో గస్తీ బృందాలకు శాశ్వత నంబర్‌ కేటాయించింది.

యూపీ, మహారాష్ట్ర మోడల్‌..
ప్రతి గస్తీ వాహనంలో జీపీఎస్‌ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు ‘100’ సిబ్బందికి ఏ గస్తీ     మిగతా 2వ పేజీలో u
వాహనం ఎక్కడుందో కంప్యూటర్‌ తెర, ట్యాబ్, ప్రత్యేక యాప్‌ ద్వారా కచ్చితంగా తెలుస్తుంది. దీంతో బాధితుడున్న ప్రాంతానికి సమీపంలోని గస్తీ వాహనానికే నేరుగా ‘100 సిబ్బంది’ తమకొచ్చే ఫోన్‌కాల్స్‌ను డైవర్ట్‌ చేస్తున్నారు. అయితే, గస్తీ సిబ్బంది సైతం ప్రస్తుతం బాధితుల అడ్రస్‌ తెలుసుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. అలాగే, బాధితుడు పదేపదే ఫోన్‌ఎత్తి తన చిరునామా చేప్పే వీలుండకపోవచ్చు. దీనికి పరిష్కారంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పోలీస్‌ విభాగాలు ఆధునిక విధానాన్ని ప్రారంభించాయి. అక్కడ ‘100’కు ఎవరైనా కాల్‌చేస్తే ఎక్కడి నుంచి చేశారో కంప్యూటర్‌ తెరపై కనిపిస్తుంది. ఫలితంగా ‘రెస్పాన్స్‌ టైమ్‌’ తగ్గుతోంది. మన డీజీపీ కార్యాలయం ఆ విధానం అమలుకు నిర్ణయించింది. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడంతో పాటు 11 మంది సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి లింకేజ్‌కు అవసరమైన సన్నాహాలు చేస్తోంది.

శాశ్వత నంబర్‌తో టైమ్‌ ఆదా
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ట్యాబ్‌లకు సిగ్నల్‌ అందట్లేదు. దీంతో గస్తీ సిబ్బందికి ఫోన్‌చేసి డయల్‌–100కు వచ్చిన ఫిర్యాదు విషయం చెప్పాల్సి వస్తోంది. అయితే ఈ సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తుండటంతో.. ఆ సమయంలో ఎవరు డ్యూటీలో ఉన్నారో కనుక్కోవడం మరింత ఆలస్యానికి కారణమవుతోంది. దీంతో ఈ బృందాలకు శాశ్వత నంబర్లు కేటాయిస్తున్నారు. ఇది అమలైతే గస్తీ విధుల్లో ఎవరున్నా.. ఆ వాహనాన్ని హ్యాండోవర్‌ చేసుకునేప్పుడు శాశ్వత నంబర్‌తో కూడిన ఫోన్‌ను తీసుకుంటూ ఉంటారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top