జవాబుదారిలో భారీ మార్పులు

Telangana New Municipal Act Key Points - Sakshi

భారీ సంస్కరణలతో సభ ముందుకు కొత్త మున్సిపల్‌ చట్టం

పౌర సేవలు, పారదర్శకతే ప్రధాన ఎజెండా

కొత్త మున్సిపల్‌ చట్టంపై అసెంబ్లీలో నేడు చర్చ, ఆమోదం 

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త మున్సిపల్‌ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా తెరపైకి తెచ్చింది. పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల ఉమ్మడి భాగస్వామ్యంతో మున్సిపల్‌పాలనను పరుగులు పెట్టించేలా ఈ చట్టాన్ని రూపొందించింది. ఓవైపు బాధ్యతలను గుర్తుచేస్తూనే మరో వైపు సంస్కరణలను ప్రవేశపెడుతూ రూపొందించిన ఈ చట్టంలో జిల్లా కలెక్టర్లను సూపర్‌బాస్‌లను చేసింది. మున్సిపల్‌పగ్గాలన్నీ వారికే అప్పగించి ప్రజాప్రతినిధుల పనితీరుపై ఓ కన్నేసి ఉంచేలా నిబంధనలను తీసుకొచ్చింది. తేడా వస్తే చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులను సస్పెండ్‌ చేసే అధికారాలను కట్టబెట్టింది. హరిత మున్సిపాలిటీల కోసం బడ్జెట్‌లో 10% నిధులను ప్రత్యేకంగా కేటాయించడంతో పాటు.. నాటిన వాటిలో 85% మొక్కలు బతక్కపోతే సంబంధిత వార్డు మెంబర్, అధికారిపై కొరడా ఝళిపించనుంది. పాలకవర్గాలకు ఎన్నికలు, వాటి పనితీరు సమీక్ష, పాలన పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక నియమ నిబంధనలు, ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్‌ రూల్స్, నైపుణ్య పెంపుదల కోసం స్వయంప్రతిపత్తితో కూడిన సంస్థ ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ బోర్డుల ఏర్పాటు వంటి అంశాలతో రూపొందించిన చట్టంపై శుక్రవారం సభలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. 

పదేళ్లు ఒకే రిజర్వేషన్‌ 
మున్సిపల్, నగర పాలక సంస్థలకు ప్రస్తుతం ఖరారు చేసే రిజర్వేషన్‌ రెండుసార్లకు (పదేళ్లు) వర్తించనుంది. రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, అవినీతికి అవకాశం కల్పిస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రొటేషన్‌ పద్ధతికి స్వస్తి పలికింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ విధానాన్ని అమలు చేసిన సర్కారు.. తాజాగా మున్సిపల్‌పాలికల్లోనే ఇదే పద్ధతిని అనుసరించనుంది. ఈ మేరకు కొత్త చట్టంలో పొందుపరిచింది. కౌన్సిలర్‌/కార్పొరేటర్, చైర్‌పర్సన్‌/మేయర్‌ పదవులకు ఈ ఏడాది ఖరారు చేసే రిజర్వేషనే వచ్చేసారీ అమలు కానుంది. 

50% మించకుండా.. 
50% స్థానాలను ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయిస్తారు. ఇందులో అన్ని కేటగిరీల్లోను సగం సీట్లను మహిళలకు రిజర్వ్‌ చేస్తారు. చైర్మన్, మేయర్‌ స్థానాల రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా మేయర్‌ స్థానాల్లో సగం సీట్లను వివిధ కేటగిరీలకు రిజర్వ్‌ చేస్తారు. పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మూడేళ్లు ఆగాల్సిందే. ఇప్పటివరకు నాలుగేళ్లు ఉన్న ఈ వ్యవధిలో ఏడాదిని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టంలో పొందుపరిచింది.  

లేఔట్‌ అనుమతులకు కమిటీ 
లేఔట్లను అనుమతించే అధికారం జిల్లా స్థాయి కమిటీకి దఖలు పరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్‌ శాఖల ఎస్‌ఈ, ఈఈలతో కూడిన కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ లేఔట్ల అనుమతి దరఖాస్తులను పరిశీలించి.. అనుమతులు జారీ చేయనుంది. భవన నిర్మాణానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సమర్పించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత 21 రోజుల్లోగా అనుమతి ఇచ్చేదీ లేనిది తేల్చేయాలి. ఒకవేళ దరఖాస్తును తిరస్కరించాలనుకుంటే ఎందుకు తిరస్కరించారో సహేతుక కారణం చూపాలి. లిఖితపూర్వకంగా దరఖాస్తుదారునికి ఈ వివరాలు తెలియజేయాలి. లేనిపక్షంలో అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించనున్నారు. 200 చదరపు మీటర్లలోపు స్థలంలో భవనం నిర్మించాలనుకుంటే గతంలోలాగా అనుమతులు అవసరం లేదు. 

సకాలంలో ఇవ్వకపోతే? 
లేఔట్‌ అనుమతులను నిర్దేశిత సమయంలో ఇవ్వలేకపోయిన పక్షంలో బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అనుమతి పొందిన లేఔట్లలో రెండేళ్లలో డెవలపర్‌ లేదా బిల్డర్‌ కనీస సౌకర్యాలు కల్పించి ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సిందే. లేదంటే ఆ డెవలపర్‌ లేదా బిల్డర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి లేఔట్లు చేపట్టకుండా అనర్హులుగా ప్రకటిస్తారు. లే అవుట్‌లో పార్కు, గ్రీన్‌బెల్ట్, ఆటస్థలం కోసం కేటాయించిన ఖాళీ స్థలాలను ఉచితంగా మునిసిపాలిటీలకు బదిలీచేయాల్సి ఉంటుంది.  

భవన నిర్మాణాలకు ఇలా! 
200 చదరపు మీటర్లలోపు స్థలంలో భవన నిర్మాణానికిగాను ఆన్‌లైన్‌లో సదరు యజమాని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తే సరిపోతుంది. దీంతోపాటు అన్ని డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో సమర్పించిన వెంటనే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే ఎందుకు నిరాకరించాల్సి వచ్చిందో రాతపూర్వకంగా తెలియజేయాలి. అలా చేయకుండా సదరు దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోతే అనుమతి ఇచ్చినట్లే పరిగణించాల్సి ఉంటుంది. అందుకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారు. 200 చదరపు మీటర్లలోపు స్థలాల్లో భవన నిర్మాణానికి ఇచ్చే సెల్ఫ్‌ డిక్లరేషన్‌కు సదరు యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. తప్పుడు డిక్లరేషన్‌ ఇస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ అవసరం ఉండదు. భవన నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇస్తారు. అయితే నిర్ణీత సమయంలోపు నిర్మాణం పూర్తిచేయాల్సిందే.

సమీకృత టౌన్‌షిప్‌లు 
సమీకృత పట్టణాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం డెవలపర్లకు అవసరమైన ప్రోత్సాహాకాలను కల్పిస్తోంది. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించేందుకు ఈ టౌన్‌షిప్‌లు దోహదపడతాయని భావిస్తోంది. పనిచేసే ప్రదేశం నివాసం మధ్యగల దూరం తగ్గించడం, రహదారులపై ఒత్తిడి తగ్గించడంతో ఎక్కువ ఉత్పాదక సమయం లభిస్తుంది. తద్వారా నివాస, కార్యాలయ, వాణిజ్య, వినోద, సేవలు, మౌలిక సదుపాయాల హబ్‌లుగా మారనున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు నిర్మించే డెవలపర్లు/బిల్డర్లకు ప్రోత్సాహకాలను కూడా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నిర్ణీత విస్తీర్ణంలో.. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేవాటికి ఈ రాయితీలు వర్తింపజేయనుంది. 

కౌన్సిలర్, చైర్మన్‌ను సస్పెండ్‌ చేసే అధికారం 
మున్సిపల్‌పాలన కలెక్టర్ల కనుసన్నల్లో జరుగనుంది. విధిగా మున్సిపాలిటీలను తనిఖీ చేయడమేగాకుండా.. ప్రతి నిర్ణయంలోను కలెక్టర్లదే పైచేయి కానుంది. ఈ మేరకు చట్టంలో కలెక్టర్లకు విస్తృతాధికారాలను కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌ రూపకల్పన, రికార్డుల పరిశీలన, తీర్మానాలను సమీక్ష/రద్దు చేసే అధికారం అప్పగించారు. మున్సిపాలిటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదని విచారణలో తేలితే కౌన్సిలర్, వైస్‌ చైర్మన్, చైర్మన్‌ను సస్పెండ్‌ చేసే అధికారం కలెక్టర్లకుంది. 30 రోజుల్లో అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
 
డైరెక్ట్‌ చేస్తారు కూడా 
పాలన సక్రమంగా సాగే విధంగా చైర్‌పర్సన్‌కు సూచనలు చేసే అధికారం కూడా ఈ చట్టంతో కలెక్టర్లకు దఖలు పడనుంది. మున్సిపాలిటీల పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ఏ క్షణంలోనైనా తనిఖీ చేసే అధికారం కూడా కలెక్టర్లకు ఇచ్చారు. అదే విధంగా ఆ మునిసిపాలిటీ పరిధిలోని ఏ స్థిరాస్తినైనా తనిఖీ చేయవచ్చు. 

ఏకీకృత సర్వీసు 
ఇక మున్సిపల్‌ ఉద్యోగులంతా ఒకే గొడుగు కిందకు రానున్నారు. ప్రస్తుతం పట్టణాభివృద్ధి సంస్థలు, జీహెచ్‌ఎంసీ, నగర పాలక సంస్థల్లో పనిచేస్తున్న అన్ని కేడర్ల అధికారులు, ఉద్యోగులను మున్సిపాలిటీలకు బదిలీ చేసే అధికారం ఉండేది కాదు. ఇలా విడివిడిగా ఉన్న ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌ను ‘కామన్‌ మున్సిపల్‌ సర్వీస్‌’గా పేర్కొంది. తద్వారా చట్టంలో ప్రతిపాదిస్తున్న మార్పుల ప్రకారం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలైనా, జీహెచ్‌ఎంసీ అయినా, కార్పొరేషన్లయినా, పట్టణాభివృద్ధి సంస్థలు ఏవైనా ఒకటే సర్వీసు రూల్స్‌ ద్వారా ఏ ఉద్యోగి ఎక్కడికయినా బదిలీపై వెళ్లే వెసులుబాటు కలుగనుంది. 

పారిశుద్ధ్యానికి కార్యాచరణ ప్రణాళిక 
పారిశుద్ధ్య నిర్వహణకు వార్డుల వారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించనున్నారు. చెత్త సేకరణ, డంపింగ్‌ కోసం ఎన్ని వాహనాలు అమలవుతాయనే దానిపై మ్యాపింగ్‌ చేయనున్నారు. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌)కు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తారు. డంపింగ్‌ యార్డులను శాస్త్రీయంగా నిర్వహించాల్సివుంటుంది. పర్యావరణ సమస్యలు తలెత్తకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సివుంటుంది.
 
హరితనిధి 
పట్టణ సంస్థల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇందులోభాగంగా గ్రీన్‌సెల్‌ను ఏర్పాటు చేసి బడ్జెట్‌లో 10% నిధులను కేటాయించింది. అంతేకాకుండా.. నాటిన మొక్కల్లో 85% సంరక్షించకపోతే బాధ్యులపై చర్యలు తీసుకోనుంది. మొక్కలను కాపాడడంలో ఉదాసీనంగా ఉన్న వార్డు మెంబర్‌ (కౌన్సిలర్‌)ను, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలిన ప్రత్యేకాధికారిని సర్వీసు నుంచి తొలగించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

ఆస్తిపన్ను బోర్డు 
ఆస్తిపన్ను మదింపునకు ‘తెలంగాణ ఆస్తిపన్ను బోర్డు’ఏర్పాటు చేయనున్నారు. భవనాలు, భూములపై పన్ను నిర్ధారణపై మున్సిపాలిటీలకు సాంకేతిక మార్గదర్శకాల జారీకి ఈ బోర్డు సహాయకారిగా ఉండనుంది. అక్రమార్కులపై మున్సిపల్‌ శాఖ కొరడా ఝళిపించనుంది. అక్రమంగా నిర్మాణం గుర్తించి.. దాన్ని కూల్చివేస్తే దాని ఖర్చును భవన యజమాని నుంచి వసూలు చేయనుంది. అలాగే అతడిపై జరిమానాలను విధించనుంది. ఇప్పటివరకు కేవలం రెవెన్యూ అధికారులకే ఉన్న రెవెన్యూ రికవరీ అధికారం మున్సిపల్‌ కమిషనర్లకు కూడా సంక్రమించనుంది.  

టౌన్‌ప్లానింగ్‌ ట్రిబ్యునల్‌ 
లేఔట్ల అభివృద్ధి, భవన నిర్మాణాల్లో చోటుచేసుకునే అభ్యంతరాలను అప్పీల్‌ చేసుకునేందుకు టౌన్‌ప్లానింగ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు కానుంది. నిబంధనల ఉల్లంఘన, పెనాల్టీల విధింపు తదితర న్యాయ నిర్ణయాలను వెలువరించే అధికారం ఈ ట్రిబ్యునల్‌కు దఖలు పరిచారు. ఐదుగురు సభ్యులతో కూడిన ట్రిబ్యునల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. చైర్‌పర్సన్‌గా జిల్లా జడ్జీ ఉంటారు. పాలకవర్గాలను సంప్రదించిన తర్వాత ఏ మున్సిపాలిటీలోనైనా అవసరం అనుకుంటే ప్రభుత్వం.. పట్టణ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఈ కమిటీలు ప్రణాళికలు తయారు చేస్తాయి. ఇందుకయ్యే ఖర్చును మున్సిపల్‌ నిధి నుంచే భరిస్తారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు నిరంతర శిక్షణ ఇచ్చేందుకు స్వయంప్రతిపత్తి కలిగిన ఓ సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ‘స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ ఎక్సలెన్స్‌’పేరుతో స్థాపించనున్న ఈ సంస్థలో పట్టణాభివృద్ధి, నిర్వహణ, పాలన, ఆర్థికాంశాలు, పేదరిక నిర్మూలన, విధి విధానాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని స్థానాలు లేదా ఒక మున్సిపాలిటీ లేదా కొన్ని మున్సిపాలిటీలకు కలిపి ఎన్నికల వ్యయ పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) నియమించవచ్చని కొత్త మున్సిపల్‌ చట్టంలో పొందుపరిచారు. 

మున్సిపల్‌ చట్టంలోని మరికొన్ని ముఖ్యాంశాలు 

  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని ఏదో ఒక మున్సిపాలిటీలో ఎక్స్‌ ఆఫీషియో సభ్యులుగా కొనసాగు తారు. ఆయా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగిన 30 రోజుల్లోపు ఎక్స్‌ ఆఫీషియో సభ్యుడిగా ఎక్కడ కొనసాగాలో తేల్చుకోవాల్సివుంటుంది.  
  • కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఎన్నికైనవారు 30 రోజుల్లోపు ప్రమాణస్వీకారం చేయాల్సివుంటుంది. లేదంటే మరో 3 నెలలపాటు పాలకవర్గం అనుమతి మేరకు సదరు సభ్యుల ప్రమాణస్వీకారానికి గడువు లభించనుంది. 
  • ఏదైనా కారణంతో సభ్యులు అనర్హతకు గురైతే 30 రోజుల్లోగా జిల్లా కోర్టులో సవాల్‌ చేయాల్సివుంటుంది. ఈ పిటిషన్‌ను సదరు కోర్టు మూడు నెలల్లోగా పరిష్కరించాల్సివుంటుంది. లేనిపక్షంలో సభ్యుడు ఆ పదవిలో కొనసాగుతారు. 
  • ఎవరైనా సభ్యులు రాజీనామా చేసినా, చనిపోయినా, అనర్హతకు గురైనా విషయాన్ని 15 రోజు ల్లో ఈసీకి కమిషనర్‌ నివేదిక అందజేయాల్సివుంటుంది. ఆ ఖాళీని 4 నెలల్లోగా భర్తీ చేయాలి. 
  • ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వార్డు కమిటీల్లో మహిళలు, యువత, వయోధికులు, ఇతర ప్రముఖులు కలిపి 15 మందికి మించరాదు. 
  • పాలకవర్గాలు ప్రతి నెల విధిగా సమావేశం కావాల్సివుంటుంది. ఈ సమావేశాలకు కనీసం సగం మంది హాజరుకావాల్సివుంటుంది. 
  • కామన్‌ సర్వీసెస్‌కు సంబంధించిన పోస్టుల వర్గీకరణ, భర్తీ ప్రక్రియ, అర్హతల నిర్ధారణ, వేతనాలు, శిక్షణ తదితర నిబంధనలు ఖరారు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పడుతుంది. 
  • ఈ–గవర్నెన్స్, సిటిజన్‌ చార్టర్‌ను పకడ్బందీగా అమలు చేసే మున్సిపాలిటీలను మోడల్‌ టౌన్‌లుగా పరిగణించనున్నారు. 
  • మున్సిపాలిటీలకు సంబంధించి ఏటా ప్రభుత్వానికి పాలనా నివేదికను సమర్పించాల్సివుంటుంది. వచ్చే ఏడాదికిగాను కార్యాచరణ ప్రణాళికను కూడా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నెలరోజుల్లోపు పంపాల్సివుంటుంది. 
  • మున్సిపాలిటీల పరిధిలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కింగ్‌లకు యూజర్‌ చార్జీలను వసూలు చేయనున్నారు. ప్లంబర్, సర్వేయర్‌ లైసెన్సులు, మాంస విక్రయదారులు, కబేళాల నిర్వహణకు నిర్దేశిత రుసుం చెల్లించి లైసెన్స్‌ తీసుకోవాల్సివుంటుంది. 
  • 75 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇంటికి ఏడాదికి రూ.100 ఆస్తిపన్ను మాత్రమే వసూలు చేయనున్నారు. గ్రౌండ్, గ్రౌండ్‌ ప్లస్‌ భవనాలకు ఈ మినహాయింపు వర్తించనుంది. 
  • స్వీయ ఆస్తిపన్ను మదింపులో తప్పు లెక్కలు చూపినట్లు తేలితే వాస్తవ పన్ను సహా 25 రెట్ల అపరాధ రుసుం వసూలు చేస్తారు. 

ఏడు కొత్త నగరపాలికలు 
కొత్తగా ఏడు నగర పాలక సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నగరీకరణ నేపథ్యంలో రాజధాని శివార్లలోని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ మున్సిపల్‌ చట్టంలో పొందుపరిచింది. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట, రంగారెడ్డి జిల్లా పరిధిలో బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపాలిటీలను నగర పాలక సంస్థలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిరాకతో రాష్ట్రంలో నగరపాలికల సంఖ్య పదకొండుకు చేరింది. కాగా, జిల్లెలగూడ మున్సిపాల్టీని మీర్‌పేట కార్పొరేషన్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలావుండగా, రాష్ట్రవ్యాప్తంగా 128 మున్సిపాలిటీలు, వరంగల్‌ మహానగరపాలక సంస్థ, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, నిజామాబాద్‌ కార్పొరేషన్లకు కొత్త చట్టాన్ని వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీకి సంబంధించి ఈ చట్టాన్ని మినహాయిస్తున్నట్లు తెలిపింది. 

నగరపాలక సంస్థ- వార్డులు 
గ్రేటర్‌ వరంగల్‌- 66 
కరీంనగర్‌- 60 
రామగుండం- 50 
నిజామాబాద్‌- 60 
ఖమ్మం- 60 
బడంగ్‌పేట- 32 
బండ్లగూడ జాగీర్‌- 22 
మీర్‌పేట- 25 
బోడుప్పల్‌- 28 
పీర్జాదిగూడ- 26 
జవహర్‌నగర్‌- 28 
నిజాంపేట- 33   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top