కోలిక్కిరాని.. కమలం కసరత్తు

Telangana BJP Candidates List Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా రాష్ట్ర నాయకత్వం, జిల్లాల అధ్యక్షులతో ఎన్నికల విషయమై చర్చించారని సమాచారం. మరో వారం రోజుల దాకా  ఏయే స్థానాల్లో పోటీ చేయాలి? అభ్యర్థులు ఎవరన్న విషయం తేలేలా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆశావహులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ ఈ సారి మా త్రం ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నాయకత్వం చెబుతోంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ పోటీ చేయాల్సిన స్థానాలపై ఇప్పటికే కొంత కసరత్తు చేసినట్లు సమాచారం.  నల్లగొండ జిల్లాకు సంబంధించి నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, మిర్యాలగూడ స్థానాల్లో కచ్చితంగా పోటీలో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికైతే ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్న చర్చ కూడా జరిగినట్లు చెబుతున్నారు. కేం ద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, తెలంగాణలో టీఆ ర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని పదే పదే రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో.. దానికోసమైన అన్ని స్థానాల్లో బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అంటున్నారు.
 
ఆశావహుల ఎదురుచూపులు
ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆశగా ఉన్న పార్టీ నాయకులు అభ్యర్థిత్వాలను ఎప్పుడు ఖరారు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న మేరకు మునుగోడులో డాక్టర్‌ గంగిడి మనోహర్‌ రెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. నల్లగొండలో పార్టీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా, ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. పార్టీ సీనియర్లు ఒకరిద్దరు కూడా అవకాశం ఇస్తే పోటీ చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. రామోజు షణ్ముఖాచారి ఈసారి అవకాశం వస్తుందేమోనని ఎదు రు చూస్తున్నారు.

పార్టీలో తనకున్న పరిచయాలతో ప్రయత్నాలు కడా మొదలు పెట్టారని వినికిడి. సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరిలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు తదితరులు పోటీలో ఉంటా రని ప్రచారంలో ఉంది. రిజర్వుడ్‌ స్థానాలైన దేవరకొండ, నకిరేకల్, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్‌ ఇస్తారు? అసలు పోటీ ఉం టారా, లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేద ని అంటున్నారు. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంతో ఇప్పటికే సమాచాలోచనలు జరి పిందని, కనీసం వారంలో జిల్లాలో ఏయే స్థానాల్లో పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరన్న విషయం తేలిపోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top