నేడే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌..

Telangana Assembly Elections Voting Held Today - Sakshi

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం

గెలుపుపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ

సంక్షేమ పథకాలు, ‘కారు డ్రైవర్‌’పైనే టీఆర్‌ఎస్‌ ఆశలు

ప్రభుత్వ వ్యతిరేకత, మిత్రపక్షాల ఐక్యతనే నమ్ముకున్న కాంగ్రెస్‌

హైదరాబాద్‌పై పట్టు నిలుపుకునేందుకు బీజేపీ, ఎంఐఎం యత్నాలు

సామాజిక కోణం ఓట్లు రాలుస్తుందనే భావనలో బీఎల్‌ఎఫ్‌

11న మధ్యాహ్నంకల్లా వెలువడనున్న ఓటరు తీర్పు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ఓట్ల పండుగ రోజు వచ్చేసింది. ఓటర్ల తీర్పునకు సమయం ఆసన్నమైంది. తెలంగాణ అసెంబ్లీ రద్దుతో గడువుకన్నా 9 నెలల ముందుగానే వచ్చిన ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ శుక్రవారం జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో 2.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)కు ఓటరు ధ్రువీకృత కాగితపు రశీదు యంత్రాల (వీవీప్యాట్‌)ను అనుసంధానించడంతో తాము ఎవరికి ఓటు వేశామో నిర్ధారించుకునే అవకాశం ఓటర్లకు లభించనుంది. ఇన్నాళ్లూ కాళ్లకు బలపాలు కట్టుకొని ఎన్నికల ప్రచా రం చేపట్టిన అభ్యర్థుల జాతకం తేలే రోజు కావడంతో అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షన్‌ నెలకొంది. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి, బీజేపీ, ఎంఐఎం, బీఎల్‌ఎఫ్‌ పక్షాన పోటీచేస్తున్న అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే ఓటరు దేవుడు ఏం ఆలోచిస్తాడో... ఎటువైపు మొగ్గుచూపుతాడోననే సందేహం అన్ని పార్టీల్లోనూ నెలకొంది. 

‘కారు’కు ప్రజలు మళ్లీ పట్టం కట్టేనా..? 
ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు అగ్నిపరీక్షగా నిలవనున్నాయి. శాసనసభ గడువుకు ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ నేతృత్వంలోని గులాబీ దళానికి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి అన్ని పార్టీలకంటే ముందే ఎన్నికల వేడిని రగిల్చిన కేసీఆర్‌ చరిష్మా ఆధారంగానే టీఆర్‌ఎస్‌ ఎన్నికల బరిలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించిన కేసీఆర్‌... మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 116 నియోజకవర్గాల తరఫున 87 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తమ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని, పథకాల లబ్ధిదారులంతా తమను మరోమారు ఆదరిస్తారనే అంచనాలో కేసీఆర్‌తోపాటు ఆ పార్టీ అభ్యర్థులున్నారు. ప్రతి నియోజకవర్గంలో సరాసరి 30వేల మంది వరకు వివిధ పథకాల లబ్ధిదారులున్నారని, వారిలో మెజారిటీ ఓట్లు తమ బాక్సుల్లోనే పడతాయనే ధీమాతోనే ప్రచారం చేశారు. దీంతోపాటు స్థానికంగా జరిగిన అభివృద్ధి కూడా తమ గెలుపునకు సహకరిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల ఆసరా, ‘కారు డ్రైవర్‌’ప్రతిభ పోలింగ్‌ రోజున గులాబీ దళాన్ని గట్టెక్కిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 

కూటమి క్లిక్‌ అయ్యేనా? 
టీఆర్‌ఎస్‌ పానలో ప్రజలకు ఒరిగిందేమీలేదని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమను గెలిపించాలని కోరుతున్న కాంగ్రెస్‌ ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత, కూటమి పార్టీల్లోని ఐక్యతపై ఆధారపడింది. ఈ రెండు అంశాలే తమ బ్యాలెట్‌ బాక్సులు నింపుతాయని ఆశిస్తోంది. గత ఎన్నికల ఫలితాల ఆధారంగా చూస్తే కూటమి భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతోపాటు తొలిసారి పోటీ చేస్తున్న టీజేఎస్‌ కలిపితే గెలుపునకు సరిపోయే ఓట్లు వస్తాయని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా తమకు దోహదపడతాయని లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉందని, వారితోపాటు టీఆర్‌ఎస్‌ హామీలు నెరవేరని సామాజిక వర్గాలు సైతం తమతో కలసి వస్తాయని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే ఫ్రభుత్వ వ్యతిరేకతకుతోడు కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరిగితేనే అధికార టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ టీం గట్టిగా ఢీకొట్టగలుగుతుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. 

కమల వికాసం ఏ మేరకు? 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డింది. మిషన్‌ 70 ప్లస్‌ అనే కార్యక్రమాన్ని చేపట్టి వీలైనన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించడంతోపాటు ఈసారి సీట్ల సంఖ్యను భారీగా పెంచుకోవాలనే వ్యూహంతో కమలనాథులు ముందుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రధాని మోదీ చరిష్మా, అమిత్‌ షా వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ... ఈసారి హైదరాబాద్‌లో తన పట్టును ఎలాగైనా నిలుపుకోవాలని ఆశిస్తోంది. అలాగే నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో బలం పెంచుకోవాలని భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తమకు అధికారమిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిబాట పట్టిస్తామని చెప్పిన కమలనాథుల వ్యూహం ఏ మేరకు ఓటరు దేవుడిని ఆకట్టుకుంటుందనేది వేచి చూడాల్సిందే. ఇక పాతబస్తీపై ఆధిపత్యం ఉన్న ఎంఐఎం తన సంప్రదాయ నియోజకవర్గాలపైనే దృష్టిపెట్టింది. గత ఎన్నికల్లో గెలిచిన 7 నియోజకవర్గాలతోపాటు రాజేంద్రనగర్‌లో కూడా దృష్టి పెట్టి ఒవైసీ సోదరులు పనిచేశారు. తమ స్థానాల్లో గెలవడంతోపాటు ఇతర చోట్ల ముస్లింల ఓట్లు టీఆర్‌ఎస్‌ వైపునకు మళ్లించడమే ధ్యేయంగా పనిచేసిన ఎంఐఎంపట్ల ఓటరన్న ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు పార్టీలకుతోడు సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) కూడా సత్తా చూపాలని ఆరాటపడుతోంది. సామాజిక ఎజెండాతో ప్రజల ముందుకెళ్లిన బీఎల్‌ఎఫ్‌ తమ సామాజిక మంత్రం పనిచేస్తుందనే అంచనాలో ఉంది. సీపీఎంతోపాటు చిన్నాచితకా పార్టీలు, కొన్ని ప్రజాసంఘాల కలయికగా ఉన్న బీఎల్‌ఎఫ్‌ వైపు ఓటరన్న మొగ్గుచూపుతాడా అనే అంశంపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

ఒక్కరోజే రూ. 15 కోట్లు స్వాధీనం... 
మూడు వారాలపాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ముగియడంతో చివరి క్షణంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు అడ్డదారులకు తెరలేపారు. కొన్ని చోట్ల ఇప్పటికే భారీగా డబ్బు వెదజల్లగా మరికొన్ని చోట్ల పోలింగ్‌ ముందు రోజు కూడా డబ్బు మూటలు తరలిస్తూ పలు పార్టీల కార్యకర్తలు పట్టుబడ్డారు. దీంతో గురువారం ఒక్కరోజే రూ. 15 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంమీద అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకోవడంతో అన్ని వర్గాలు, రాజకీయ పార్టీల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అయితే ఓటరు దేవుడు ఏం చేశాడు..? గెలుపు రాత ఎవరికి రాశాడు? అనేది మాత్రం ఈ నెల 11న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలతో తేలనుంది. 

ఇవీ పోలింగ్‌ లెక్కలు... 
మొత్తం ఓటర్ల సంఖ్య: 2,80,64,684 
పురుష ఓటర్లు: 1,41,56,182 
మహిళా ఓటర్లు: 1,39,05,811 
ఇతర ఓటర్లు: 2,691 
ఎన్నికల అభ్యర్థులు: 1,821 
మొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 32,815 

పోలింగ్‌ సమయం... 
106 నియోజకవర్గాల్లో: ఉదయం 7 – సాయంత్రం 5 వరకు 
13 తీవ్రవాద ప్రభావిత స్థానాల్లో: 7 – సాయంత్రం 4 వరకు 

ఎన్నికల సామగ్రి... 
బ్యాలెట్‌ యూనిట్లు: 55,329 
కంట్రోల్‌ యూనిట్లు: 41,063 
వీవీ ప్యాట్స్‌: 42,751 
మొత్తం పోలింగ్‌ సిబ్బంది: 1,50,023 
ఈసీఐ వెబ్‌ కాస్టింగ్‌: 3,478 పోలింగ్‌ కేంద్రాల్లో  

ఓటర్లు
పురుష ఓటర్లు 1.42 కోట్లు
మహిళా ఓటర్లు 1.39 కోట్లు 
మొత్తం ఓటర్లు 2.81 కోట్లు 

అభ్యర్థులు
రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలు-119
మొత్తం అభ్యర్థులు- 1,821
మహిళా అభ్యర్థులు- 136
పోలింగ్‌ కేంద్రాలు.. 32,815

పార్టీల వారీగా పోటీ చేసే అభ్యర్థులు

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top